శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 03:42:59

ప్రజాహితమే పరమావధి

ప్రజాహితమే పరమావధి

  • దివ్యాంగ పరికరాల తయారీదారులను ప్రోత్సహిస్తాం
  • దివ్యాంగుల దినోత్సవ  కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని.. లేదంటే ఎంత గొప్ప సాంకేతికత అయినా నిష్ఫలమని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తరుచూ చెప్తుంటారని తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ ఆధ్వర్యంలో నెక్లెస్‌ రోడ్డులోని హెచ్‌ఎండీఏ మైదానంలో దివ్యాంగుల పరికరాల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో టీవర్క్స్‌, టీహబ్‌, ఐఐటీ హైదరాబాద్‌, సోషల్‌ అల్ఫా, ఆర్టి ల్యాబ్‌ ఫౌండేషన్‌, అస్టిస్‌ టెక్‌ ఫౌండేషన్‌, ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌, యూత్‌ ఫర్‌ జాబ్స్‌ తదితర సంస్థలు పాలు పంచుకున్నాయి. ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్‌ అక్కడి స్టాళ్లను పరిశీలించారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ దివ్యాంగులకు ఉపయోగపడే పరికరాల తయారీలో యువ పారిశ్రామికవేత్తలు చూపుతున్న చొరవ దేశానికి ఎంతో ఉపయోగకరమన్నారు. సాంకేతికతను ఇదే రకమైన కార్యక్రమాలు, ఆలోచనా విధానంతో ఎన్నో రకాలుగా వాడుకోవచ్చన్నారు.

స్టార్టప్‌లకు ప్రోత్సాహం

వ్యవసాయం, మహిళల భద్రత తదితర రంగాల్లో యాంత్రీకరణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంకా పెద్దమొత్తంలో ఉపయోగించాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్‌ అన్నారు. నిత్యనూతనమైన సాంకేతికతను ఉపయోగించి శాస్త్రవేత్తలు.. కొత్తకొత్త పరికరాలను సృష్టించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్‌ హైదరాబాద్‌లోనే టీ హబ్‌ రూపంలో ఉన్నదని.. అతిపెద్ద రోటో టైప్‌ ల్యాబ్‌ టీవర్క్స్‌ రూపంలో రానున్నదని చెప్పారు. వీటితో కలిసి పనిచేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని కోరారు. దివ్యాంగులకు ఉపయోగపడే పరికరాలను అతి తక్కువ ఖర్చుతో తయారుచేసేందుకు అవకాశాలు రూపొందించుకోవాలని సూచించారు. దివ్యాంగుల పరికరాల తయారీదారులను ప్రోత్సహిస్తామని, యంత్ర పరికరాల్లో ప్రకృతికి హాని కలిగించని బ్యాటరీలను ఉపయోగించాలని కోరారు. కార్యక్రమంలో చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, దివ్యాంగులు, వయో వృద్దుల సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య, డైరెక్టర్‌ శైలజ, ఇన్నోవేషన్‌ ప్రతినిధి రవినారాయణ్‌ పలు సం స్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకృతిక ట్వీట్‌.. కేటీఆర్‌ ట్రీట్‌..

చిన్నారి ఆటకు మాటిచ్చిన మంత్రి కేటీఆర్‌

పార్కు కావాలని బాలిక విజ్ఞప్తి

స్పందించి అధికారులకు మంత్రి ఆదేశం

ఓ చిన్నారి విజ్ఞప్తికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఆటల కోసం పార్కు ఏర్పాటుకు మాటిచ్చారు. బోడుప్పల్‌కు చెందిన శ్రీకృతిక ఆరోతరగతి చదువుతున్నది. తమ కాలనీలో 200 మంది వరకు చిన్నపిల్లలు ఉన్నారని, అక్కడ పార్కు కోసం 1200 గజాల స్థలం  కేటాయించారని తెలిపింది. ఖాళీ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని గురువారం ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేసింది. ఒకసారి కాలనీలో పర్యటించాలని కేటీఆర్‌ను కోరింది. దీనిపై కేటీఆర్‌ వెంటనే స్పందించారు. పార్కు సమస్యను తన దృష్టికి తీసుకొచ్చినందుకు చిన్నారికి ధన్యవాదాలు తెలిపారు. బోడుప్పల్‌ కమిషనర్‌కు వెంటనే ఆదేశాలు జారీచేయాలని సీడీఎంఏ కమిషనర్‌కు కేటీఆర్‌ సూచించారు. వీలైనంత త్వరగా పార్కును అభివృద్ధి చేయాలని చెప్పారు.

కరీంనగర్‌ కార్పొరేషన్‌ అధికారులకు అభినందన

కరీంనగర్‌ కార్పొరేషన్‌ అధికారులను మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు అభినందించారు. కరీంనగర్‌ పట్టణంలోని వీధుల్లో నివసిస్తున్నవారిని కార్పొరేషన్‌ నిర్వహిస్తున్న షెల్టర్లకు తరలించేందు కోసం స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌.. కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. స్పందించిన కేటీఆర్‌.. ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ ఇదేవిధంగా చేయాలని సూచించారు.