గురువారం 26 నవంబర్ 2020
Telangana - Oct 30, 2020 , 01:54:22

రేపటిలోగా ఎంసెట్‌ ర్యాంకులు

రేపటిలోగా ఎంసెట్‌  ర్యాంకులు

  • ఇంటర్‌ పాసైన వారందరికీ కౌన్సెలింగ్‌కు చాన్స్‌ ఇస్తూ జీవో
  • తుది విడుత కౌన్సెలింగ్‌ తేదీల్లో సవరణ
  • 323 మందికి ర్యాంకులు వచ్చే అవకాశం?

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇంటర్మీడియట్‌ పాసై టీఎస్‌ ఎంసెట్‌లో అర్హత సాధించిన వారికి ఈ నెల 31(శనివారం)లోగా ర్యాంకులు ప్రకటించనున్నట్టు ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ తెలిపారు. కొవిడ్‌-19 నేపథ్యంలో తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన వారికి సెకండియర్‌ పరీక్షలు నిర్వహించలేదు. అందరికీ 35% మార్కులు ఇస్తూ పాసైనట్టు ప్రకటించారు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు 45 % మార్కులు తప్పని సరి అనే నిబంధన ఉండటంతో వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన ధర్మాసనం ఎంసెట్‌లో అర్హత సాధించి ఈ సారి వరకు ఇంటర్‌ పాసైన వారందరికీ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆదేశించింది. దీంతో  విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ఇందుకు సంబంధించిన జీవోను గురువారం  జారీచేశారు. ఈ క్రమంలో ఎంసెట్‌ తుదివిడుత కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. తాజా ఉత్తర్వుల మేరకు ఇంటర్‌ పాసై, ఎంసెట్‌లో అర్హత సాధించిన వారందరికీ ర్యాంకులు ప్రకటించిన తర్వాత తుది విడుత కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఇంటర్‌బోర్డు, ఓపెన్‌స్కూలు, సీబీఎస్‌ఈ తదితర అన్ని రకాల బోర్డుల నుంచి దాదాపు 323 మందికి మాత్రమే ర్యాంకులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.  దీనిపై కసరత్తు జరుగుతున్నదని, ఇందులో ఇంజినీరింగ్‌, మెడికల్‌ విభాగాలు కలిసే ఉన్నాయని తెలిపారు.

నేటి నుంచి  తుది విడుత కౌన్సెలింగ్‌

హైకోర్టు ఆదేశాల  నేపథ్యంలో ఎంసెట్‌ తుది విడుత కౌన్సెలింగ్‌ను శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ కన్వీనర్‌ నవీన్‌మిట్టల్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన తేదీలను ప్రకటించారు. 

  • ఈ నెల 31న ఇంటర్‌లో పాసైన అర్హులకు స్లాట్‌ బుకింగ్‌ 
  • నవంబర్‌ 1 నుంచి ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారి సర్టిఫికెట్ల పరిశీలన 
  • ఈ నెల 30 నుంచి నవంబర్‌ 2 వరకు కాలేజీల్లో సీట్ల కోసం వెబ్‌ కౌన్సెలింగ్‌ 
  • 4న ఎంసెట్‌ తుది విడుత సీట్ల కేటాయింపు.. 7న కాలేజీల్లో రిపోర్టింగ్‌కు గడువు