మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 02:15:19

గిదేం ఖర్మ.. కిషనా

గిదేం ఖర్మ.. కిషనా

  • కేంద్ర మంత్రి సభకు జనం కరువు
  • వచ్చిన కొందరూ.. ఆయన మాట్లాడుతుండగానే వెళ్లిపోయారు
  • దండం పెట్టి బతిమిలాడినా ఆగలేదు.. మిగతావారు ముచ్చట్లలో 
  • అదీ దుబ్బాక  ఓటరు దెబ్బ.. వెలవెలబోతున్న బీజేపీ ప్రచారం

సిద్దిపేట/దుబ్బాక, నమస్తే తెలంగాణ: అది దుబ్బాక.. శుక్రవారం సాయంత్రం 4:30 గంటల సమయం.. బీజేపీ ప్రచారసభ కోసం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అక్కడికి విచ్చేశారు.. చూస్తే కండ్లముందు అన్నీ ఖాళీ కుర్చీలే.. ఇంకేం కన్పించలేదు.. దీన్ని చూసి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.. ఉన్నకొందరూ ఎవరి ముచ్చట్లలో వాళ్లు మునిగిపోవటంతో అక్కుడున్న నాయకులకు ఏం చేయాలో పాలుపోలేదు. అంతకుముందు ఈ సభకు భారీగా జనం వస్తారని బీజేపీ సోషల్‌ మీడియా బ్యాచ్‌ బాగానే ప్రచారం చేసింది. అయితే, జనం తక్కువగా రావటంతో ఉన్న మందితో మాట్లాడుదామనుకొని కిషన్‌రెడ్డి మైక్‌ పట్టారు. కానీ, అక్కడున్న జనం ఎవరి ముచ్చట్లలో వాళ్లు మునిగిపోయారు. కాసేపు కూర్చొన్న జనం ఇక చాలు.. వెళ్దామని ఎవరిదారిన వాళ్లు లేచి వెళ్లిపోయారు. చెప్పేవన్నీ చప్పటి ముచ్చట్లేనని అనుకుంటూ అక్కడినుంచి జారుకున్నారు. ఇది గమనించిన కొందరు బీజేపీ నేతలు జనాన్ని వెళ్లొద్దని బతిమిలాడారు. ‘మీకు దండం పెడ్తా.. కొద్దిసేపు కూసొండ్రి’ అంటూ ప్రాధేయపడటం కన్పించింది. సభకు వచ్చిన జనం కంటే అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులే ఎక్కువ కావటం గమనార్హం. మిగతా నాయకులు కూడా ఏం మాట్లాడాలో అర్థంకాక నాయకులు మమ అనిపించి వెళ్లిపోయారు. ఇదొక్కటే కాదు.. ఇటీవల బీజేపీ నిర్వహించిన చాలా సభలు తుస్సుమంటున్నాయి. పరాయి నాయకులు, కిరాయి మనుషులతో నెట్టుకొచ్చిన ఆ పార్టీ.. ఇప్పుడు ప్రజల మద్దతు లేకపోవటంతో నిరాశలో కూరుకుపోతున్నది.

మొన్న రోడ్‌షో అట్టర్‌ఫ్లాప్‌..

చిట్టాపూర్‌లో గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రచారం వాయిదాపడింది. జనం లేక, ఆదరణ లేక, మంత్రి హరీశ్‌రావు విసిరిన సవాల్‌కు వెనుకంజ వేసి ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలుస్తున్నది. దుబ్బాకలో గురువారం నిర్వహించిన  బీజేపీ దళిత మోర్చా ర్యాలీ, రోడ్‌షో కూడా అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. ఆ ప్రచారంలో ప్రచార రథం, ఆ పార్టీ నాయకులు తప్ప జనం ఎక్కడా కన్పించలేదు. చేసేదేమీ లేక రోడ్‌షో కోసం వచ్చిన బీజేపీ నేతలు బాబుమోహన్‌, జీ వివేక్‌, మోత్కుపల్లి నర్సింహులు  తూతూమంత్రంగా రోడ్‌షో ముగించుకొని వెళ్లిపోవటం కొసమెరుపు.