ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 13, 2020 , 01:49:24

రైతుకు ఆర్థిక స్వావలంబన యువతకు ఉపాధి

రైతుకు ఆర్థిక స్వావలంబన యువతకు ఉపాధి

  • ప్రజలకు కల్తీ లేని నాణ్యమైన ఆహార ఉత్పత్తులు
  • ఆహారశుద్ధిరంగంలో రాష్ర్టానికి భారీ పరిశ్రమలు
  • ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లాజిస్టిక్స్‌ పాలసీలకు రూపకల్పన
  • దళిత, గిరిజన, మైనార్టీ యువత, మహిళలకు 
  • నూతన పాలసీల్లో ప్రత్యేక రాయితీల కల్పన
  • సీఎం కృషితో వ్యవసాయరంగాల్లో భారీ ఉత్పత్తి
  • రాష్ట్రంలో జల విప్లవంతో మరో మూడు విప్లవాలు
  • పంటలను, ఉత్పత్తి ప్రాసెసింగ్‌ సామర్థ్యాన్ని పెంచాలి
  • మంత్రులతో భేటీలో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌
  • విధాన రూపకల్పనలో పలువురు మంత్రుల సూచనలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లాజిస్టిక్స్‌ పాలసీల ద్వారా రాష్ర్టానికి భారీగా పరిశ్రమలు వచ్చే అవకాశమున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. దీంతో గ్రామాల్లో యువతకు స్వయంఉపాధి లభిస్తుందని, ఉద్యోగావకాశాలు మెరుగువుతాయని అన్నారు. ప్రజలకు కల్తీలేని ఆహార ఉత్పత్తుల లభ్యత పెరుగుతుందని చెప్పారు. బుధవారం ప్రగతిభవన్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లాజిస్టిక్స్‌ పాలసీలపై మంత్రులు, అధికారులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. వ్యవసాయం, పరిశ్రమలు, పంచాయతీరాజ్‌, ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, పశసంవర్ధకశాఖల అధికారులు తమ శాఖలపరంగా పాలసీలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. మంత్రి కేటీఆర్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లాజిస్టిక్స్‌ పాలసీలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మార్గదర్శకత్వంలో తెలంగాణలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల గురించి, దానివల్ల రాష్ట్రం లో ఆహారశుద్ధి రంగంలో వస్తున్న కొత్త అవకాశాల గురించి వివరించారు. సమావేశం దాదాపు ఎనిమిది గంటలపాటు సుదీర్ఘంగా జరిగింది.

రెండు పాలసీలతో భారీ పరిశ్రమలు

ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న ఫుడ్‌ప్రాసెసింగ్‌, లాజిస్టిక్స్‌ పాలసీల ద్వారా చిన్న యూనిట్ల నుంచి భారీ పరిశ్రమల వరకు స్థాపిం చే అవకాశం ఉన్నదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. స్వయంసహాయ సంఘాలు, సహకారసంఘా లు, దళిత, గిరిజన, మైనార్టీ యువతకు, మహిళలకు ప్రత్యేక రాయితీలు ఉంటాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌ కృషితో తెలంగాణలో జల విప్లవం వస్తున్నదని, లక్షల ఎకరాల బీడు భూములు.. కృష్ణా, గోదావరి నదుల నీటితో సస్యశ్యామలం అవుతున్నాయని చెప్పారు. ఈ జలవిప్లవం తో డ్పాటుతో నీలి విప్లవం (మత్స్య పరిశ్రమ), గులా బీ విప్లవం (మాంసం ఉత్పత్తి పరిశ్రమ), శ్వేత విప్లవం (పాడి పరిశ్రమ) కూడా తెలంగాణలో రానున్నాయన్నారు. తెలంగాణలో ఏ గ్రా మంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో ఏయే పంటలు పడుతున్నాయో మ్యాపింగ్‌ చేశామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక వరి, పత్తి, మక్కజొ న్న, పప్పుధాన్యాలు, సుగంధద్రవ్యాల ఉత్పత్తి బాగా పెరిగిందన్నారు. ఉత్పత్తి అవుతున్న పంటలను పూర్తిగా ప్రాసెసింగ్‌చేసే సామర్థ్యం మనకులేదని తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తులు ఇంకా పెరుగుతాయన్నారు. 

వెంటనే మనం ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలని చెప్పారు. తద్వారా తెలంగాణ రైతుకు ఆర్థిక స్వావలంబన, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. తెలంగాణలో ఆహారశుద్ధి పరిశ్రమను అభివృద్ధికి అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు, ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ర్టాల్లో, ఇతరదేశాల్లో ఉన్న ప్రోత్సాహకాలు పరిశీలించామన్నారు. ఈ సమావేశంలో వచ్చిన సూచనలు, సలహాలు తీసుకొని వాటన్నింటినీ పాలసీలో చేర్చి తుదిరూపు ఇస్తామని చెప్పారు. దానిని త్వరలో జరిగే క్యాబినెట్‌ సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, ఈటల రాజేందర్‌, టీ హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితాఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, గంగుల కమాలకర్‌, సత్యవతి రాథోడ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ ఉన్నతాధికారులు హాజరయ్యారు.


నిజామాబాద్‌ జిల్లాలో పసుపు పరిశ్రమలు 

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజక వర్గంలో 42 ఎకరాల్లో ఏర్పాటుచేసిన స్పైసెస్‌ పార్క్‌ చుట్టూ పసుపు సాగవుతున్నదని, ఇక్కడ పసుపు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలని ఆర్‌ అండ్‌ బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరా రు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో 200 ఎకరాలోని లక్కంపల్లి సెజ్‌లో సోయా, మక్కల ఆహార శుద్ధి కర్మాగారాలు ఏర్పాటుచేయాలని సూచించారు. 

రెండు పాలసీలపై మంత్రుల సూచనలు

మారుతున్న పంటల సరళికి అనువుగా ఆహారశుద్ధి కేంద్రాలనుప్రోత్సహించాలి.

పౌల్ట్రీ, మాంసం ఉత్పత్తి, చేపల ప్రాసెసింగ్‌ రంగాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలి.

కొన్ని పనులకు వర్కర్ల కొరతను తీర్చేందుకు యాంత్రీకరణను ప్రోత్సహించాలి. 

గిరిజన ప్రాంతాల్లో చిన్న ఆహార శుద్ధి పరిశ్రమలకు తోడ్పాటు అందించాలి. దళిత, మహిళా పారిశ్రామికవేత్తలు ఈ అవకాశా లు అందుకునేలా చర్యలు తీసుకోవాలి.

తెలంగాణ బ్రాండ్‌ ఉత్పత్తులు ప్రపంచం మొత్తం ఎగుమతి అయ్యేలా చూడాలి. ఆహార కల్తీని అరికట్టి వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తులు అందించాలి. 

పాడి ఉత్పత్తులకు విస్తృత అవకాశాలు 

నూనె గింజల ఉత్పత్తిని పెంచే ఆధునిక నూనె మిల్లులకు ప్రోత్సాహమివ్వాలి.

పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్‌ పరిశ్రమల స్థాపనతో రైతుకు లాభం. 


logo