శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 02:06:46

నాలుగు క్యాటగిరీలుగా ఉపాధి

నాలుగు క్యాటగిరీలుగా ఉపాధి

  • భూసారం, నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం
  • మౌలిక వసతులు, హరితహారానికి ప్రణాళికలు 
  •  పనుల గుర్తింపుపై కమిషనర్‌ మార్గదర్శకాలు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉపా ధి పథకాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి రాష్ట్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2021-22లో ఉపాధి హామీ పనులను నాలుగు క్యాటగిరీలుగా విభజించింది. ఈ మేరకు పనుల గుర్తింపు ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భూసార పరిరక్షణ, నీటి సంరక్షణ, హరితహారం, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన పనులకు ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. ఏ, బీ, సీ, డీ క్యాటగిరీలుగా విభజించి గ్రామసభల్లో ఉపాధి కూలీలు, రైతుల భాగస్వామ్యంతో గుర్తించిన పనులను పొందుపరిచేందుకు ప్రత్యేక ఫార్మాట్లను సిద్ధం చేశారు. నవంబరు 30వ తేదీలోగా పనుల గుర్తింపును పూర్తి చేసి ఆ జాబితాను పంచాయతీ గోడలపై అతికించాలని కమిషనర్‌ సూచించారు. 

ఏ క్యాటగిరీలో..

ఊటకుంట, డగ్‌ ఔట్‌పాండ్‌లో పూడికతీత, వాననీటి నిల్వ, రీచార్జి కట్టడాలు, నీటి నిల్వ కుంటలు, ఫాంపాండ్‌, చెరువుల్లో పూడికతీత, చెక్‌డ్యామ్‌/ చెక్‌వాల్స్‌లో పూడికతీత, కందకాల తవ్వకం, నీటినిల్వ కందకాలు, పంటకాలువల తవ్వకం, పాత వాటిలో పూడికతీత, బావుల్లో పూడికతీత, పంట నూర్పిడి కల్లాలు.

బీ, సీ క్యాటగిరీలో..

కొత్త బావులు, పాత బావుల లోతు పెంచడం, మట్టి కట్టలు, కల్లాలు, కందకాలు, కంపోస్ట్‌ పిట్‌, వర్మీ కంపోస్ట్‌ పిట్‌, సమగ్ర భూ అభివృద్ధి పనులు, ముళ్లపొదల తొలగింపు, భూమినిచదును, లోతుగా దున్న డం, గడ్డి పెంపకం, సైలో పిట్‌ నిర్మా ణం, అజోల్ల పెంపకం, పశువుల నీటి తొట్లు,  వ్యక్తిగత మరుగుదొడ్లు.

డీ క్యాటగిరీలో..

డంపింగ్‌ యార్డు, ఇంకుడు గుంతలు, పంట పొలాలు, శ్మశాన వాటికలు, ప్రభుత్వ సంస్థలకు మట్టి రోడ్ల నిర్మాణం,  మట్టి రోడ్లకు బెర్మ్‌ను గట్టి చేయడం, రోడ్డుకు ఇరువైపులా ముళ్ల పొదల తొలగింపు, పాఠశాలల్లో ఆట స్థలాల ఏర్పాటు, ప్రభుత్వ సంస్థల్లో భూమి చదును చేసి గట్టి చేయడం.


logo