మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 02:59:41

నరేగాకు నయా రూపు

నరేగాకు నయా రూపు

 • కలకాలం నిలిచేలా ఉపాధి హామీ పనులు
 • 2006 నుంచి రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు
 • చెప్పుకోవడానికి ఎక్కడా కన్పించని ‘ఉపాధి’ నిర్మాణం

లక్ష కోట్లు వెచ్చించి మూడు నాలుగేండ్లలో అపూర్వమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథ కం వంటి భారీ ప్రాజెక్టు నిర్మించవచ్చు. రూ.25 వేల కోట్లతో హైదరాబాద్‌లో మెట్రో రైలువంటి అద్భుతమైన రవాణా వ్యవస్థను రూపొందించవచ్చు. కానీ పేదలకు రోజు కూలీ కల్పించేందుకు ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (నరేగా) కింద ఉమ్మడి రాష్ట్రంలో లక్షల కోట్లు ఖర్చుచేసినా.. ఒక్కటంటే ఒక్కటి.. కనీసం చెప్పుకోవడానికైనా శాశ్వత నిర్మాణం కనిపించదు. ఈ పథకం వల్ల కూలీలకు ఉపాధి లభించిందేమో కానీ.. ప్రజలకు ఉపయోగపడిందేమీ లేదు. 

బర్కత్‌ లేకుండా ఎన్ని డబ్బులు ఖర్చుచేసినా నిరుపయోగమే. అందుకే ప్రహసనంగా మారిన నరేగాకు నయారూపు తెచ్చి నిధుల సద్వినియోగానికి తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. పచ్చదనం పెంచడం నుంచి పంటకాలువల పరిశుభ్రత వరకు.. పంచాయతీ భవనాల నుంచి రైతు వేదికల వరకు ఉపాధి కూలీలతో శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధంచేస్తున్నది. అటు కూలీలకు ఉపాధి కల్పిస్తూ.. ప్రజలకు ఉపయోగకరమైన పనులనూ చేపడుతున్నది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామీణ ప్రాంతా ల్లో పనుల ద్వారా కూలీలకు ఉపాధి కల్పించాలని 2006లో నాటి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్రామీ ణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. అప్పట్నుంచి ఈ పథకం కింద ఏటా రూ.కోట్లు ఖర్చుచేస్తున్నారు. కూలీలకు ఉపాధి లభించడం వరకు పథకం ఆశయం నెరవేరుతున్నది కానీ, నిర్మాణాత్మకమైన ఒక్కపని చేపట్టలేదు. మట్టిపని పేరిట కోట్లు వెచ్చిస్తు న్నా గ్రామాల్లో ప్రజలకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూర్చే పనులేవీ జరుగలేదు. కానీ, గత ఏడాదికాలం గా తెలంగాణ ప్రభుత్వం ఉపాధి పథకం పనులకు సార్థకత చేకూరుస్తున్నది. ఈ పథకం కింద చేపడుతు న్న పనులతో గ్రామాల్లో భారీఎత్తున మౌలిక వసతుల కల్పన జరుగుతున్నది. పల్లెలను పరిశుభ్రంగా ఉంచే నిర్మాణాలు మొదలు భారీ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిని పొలాలకు తీసుకెళ్లే పంట కాలువల వరకు అనేకశాఖల పరిధిలో ప్రజలకు చిరకాలం ప్రయోజనం చేకూర్చే పనులను చేపడుతున్నారు. 


అనుసంధానంతోనే ప్రయోజనం

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని సీఎం కేసీఆర్‌ అనేకసార్లు కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని మోదీకి నేరుగా విజ్ఞప్తి చేయడంతోపాటు పలు వేదికలపైనా సూచనలు చేశారు. ఎట్టకేలకు కేంద్రం ఉపాధి పనుల మార్గదర్శకాలను విస్తృతంచేసి నిర్మాణాత్మక పనులకూ అవకాశం కల్పించింది. మట్టి పనుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 90:10 శాతం, మెటీరియల్‌తో నిర్మాణానికి 70:30 శాతం నిధుల వాటాతో పనులు చేపట్టేలా మార్గదర్శకాలు రూపొందించింది. కేంద్రం కల్పించిన ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున వినియోగించుకుంటున్నది. ఉపాధి హామీ పథకాన్ని సఫలీకృతం చేయడంలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది.

పల్లెల్లో ప్రగతి ప్రణాళిక

గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా నరేగాను అనుసంధానిస్తూ పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు కార్యాచరణ అమలుచేశారు. పల్లెల్లోనే ప్రగతి ప్రణాళికను రూపొందించి, ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామీణాభివృద్ధికి మార్గం సుగమం చేశారు. ప్రతి చిన్న పనికీ ప్రభుత్వస్థాయిలో ప్రతిపాదనల కోసం తాత్సారం కాకుండా.. ప్రజలే తమ గ్రామానికి కావాల్సిన వసతులు, అభివృద్ధి పనులను రూపొందించుకొంటున్నారు. ఇప్పటివరకు మూడువిడుతలుగా జరిగిన పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెల ముఖచిత్రం మారింది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయం, నీటిపారుదల, అటవీ, రోడ్లు, భవనాలు తదితర శాఖలకు అనుసంధానించేలా సీఎం కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కోట్ల రూపాయల నిర్మాణాత్మక పనులకు అడుగులు పడుతున్నాయి.

కాలువల నిర్వహణకూ ‘ఉపాధి’

ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ కింద చేపట్టిన చాలా ప్రాజెక్టులు ఏళ్లూపూళ్లూ గడిచినా పూర్తికాలేదు. హెడ్‌వర్క్స్‌, ప్రధాన కాలువలు, జలాశయాల పరిధిలోని డిస్ట్రిబ్యూటరీల పనులు మిగిలే ఉన్నాయి. దేవాదుల వంటి ప్రాజెక్టుల్లోని కొన్ని ప్యాకేజీల్లో కాలువలు శిథిలవుతున్నాయి.  ఇప్పుడు రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల పరిధిలోని కాలువల్లో ఉపాధిహామీ పథకం కింద నిర్వహణ పనులు చేపడుతున్న దరిమిలా.. ఈ ప్యాకేజీల్లో కూడా పనులు పూర్తయిన మేరకు కాలువలను నీటిపారుదలశాఖ స్వాధీనంచేసుకొంటే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉపాధిలో త కాలువల నిర్వహణను చేపడితే నిర్మాణాలు పటిష్టంగా ఉంటాయని, చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరు అంది టెయిల్‌ ఎండ్‌ సమస్య కూడా తీరుతుందని చెప్తున్నారు. 

ఉపాధిహామీ కింద నిర్మాణాత్మక పనులు 

 • పల్లెల్లో పంచాయతీ భవనాలు, శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డులు, మురుగునీటి కాలువల నిర్మాణాలు.
 • అంతర్గత రహదారుల నిర్మాణం కింద సీసీ రోడ్లు
 • గ్రామీణప్రాంతాల్లో రవాణావ్యవస్థను మెరుగుపరిచే లింక్‌ రోడ్లు. 
 • పొలాలకు వెళ్లేందుకు డొంకలు, ఇతర అంతర్గత రోడ్ల అభివృద్ధి
 • వడ్లు ఆరబెట్టేందుకు గ్రామాల్లో కల్లాల ఏర్పాటు
 • రైతులు మాట్లాడుకొనేందుకు రైతు వేదికల నిర్మాణం
 • పలుశాఖల పరిధిలో కోట్ల మొక్కలు నాటడం
 • చెరువులు, సాగునీటి కాలువల్లో పూడిక, ముండ్లపొదల తొలగింపు
 • ప్రాజెక్టుల నీటిని పొలాలకు అందించేందుకు పంట కాలువల నిర్మాణం


logo