సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 01:33:52

వేడుకొన్న వెంటనే..

వేడుకొన్న వెంటనే..
  • నిరుద్యోగులకు ఉపాధి
  • మంత్రి కేటీఆర్‌ హామీని నేరవేర్చిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  • ఇద్దరికి ఉద్యోగాలు

మహబూబ్‌నగర్‌, నమస్తేతెలంగాణ: తన కొడుకుకు ఉపాధి కల్పించాలని ఓ తల్లి మంత్రి కేటీఆర్‌ను వేడుకున్న తొమ్మిది రోజుల్లోనే ఉద్యోగం కల్పించారు. గత నెల 24న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జిల్లాకేంద్రానికి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ వచ్చారు. అ నంతరం ఆయన పాతతోట ప్రాంతంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పర్యటించారు. ఇంటింటికీ తిరిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. 


ఈ క్రమంలో వేణమ్మ అనే గృహిణి తమ గోడును మంత్రుల ముందు వెళ్లబోసుకున్నది. తనకు ముగ్గురు కుమారులని.. వీరిలో  ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించాలని ప్రాధేయపడింది. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌.. ఎలక్ట్రీషియన్‌ కోర్సు పూర్తిచేసిన సతీష్‌కు ఉద్యోగం ఇప్పించాలని పక్కనే ఉన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సూచించారు. ఇచ్చిన హామీ మేరకు మంగళవారం సతీష్‌కుమార్‌కు జిల్లా జనరల్‌ దవాఖానలో ఎలక్ట్రీషియన్‌గా అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిపై ఉద్యోగఅవకాశం కల్పిస్తూ నియామక పత్రాన్ని కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అందజేశారు. 


కాగా చైతన్య అనే మహిళ సైతం తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని వేడుకోగా.. ఆమెకూ ప్రభుత్వ దవాఖానలో ఉద్యోగం కల్పిస్తూ నియామకపత్రం అందజేశారు. తమకు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు కల్పించడంపై ఆనందం వ్యక్తం చేసిన సతీష్‌, చైతన్య మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


logo