గురువారం 28 మే 2020
Telangana - May 17, 2020 , 02:01:43

భవన నిర్మాణానికి ఊపు

భవన నిర్మాణానికి ఊపు

  • లాక్‌డౌన్‌నుంచి సడలింపులతో బిల్డర్లకు ఉపశమనం 
  • స్టీలు, సిమెంట్‌ దుకాణాలు తెరువడంతో ముమ్మరంగా పనులు
  • క్వారీ తవ్వకాలకు అనుమతితో తరలుతున్న ఇసుక 
  • వలస కార్మికులకు చేతినిండా ఉపాధి

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లానుంచి హైదరాబాద్‌కు ఇసుక తరలించేందుకు బారులుతీరిన లారీలివి.. నిర్మాణరంగానికి కరోనా కష్టాల నుంచి విముక్తి లభించింది. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకొన్నాయి. మరో మూడు నెలల్లో నిర్మాణరంగం సాధారణ పరిస్థితికి చేరుకొంటుందని క్రెడాయ్‌ ఆశాభావం వ్యక్తంచేస్తున్నది.

హైదరాబాద్‌/వరంగల్‌/ మణికొండ, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నుంచి ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో నిర్మాణరంగం ఊపందుకుంటు న్నది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, సీసీ రోడ్లు, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లనిర్మాణం శరవేగంగా సాగుతున్నది. దీంతోపాటు ప్రైవేటురంగంలోనూ భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వం స్టీలు, సిమెంట్‌తోపాటు, హార్డ్‌వేర్‌, ఇతర గృహోకరణ దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో ఇండ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీనికితోడు ఇసుక క్వారీలకు ప్రభుత్వం అనుమతివ్వడంతో ఇసుక తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 

ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున ఇసుక బుకింగ్‌లు వస్తున్నాయి. నిబంధనల మేరకు ప్రభుత్వం లారీల ద్వారా ఇసుక సరఫరాకు అనుమతి ఇస్తున్నది. లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు కొంతమంది సొంతప్రాంతాలకు పయనమయినా.. పెద్ద నిర్మాణ సంస్థలు తమవద్ద పనిచేసేవారిని నిర్మాణ ప్రాంతంలోనే నివాసాలు కల్పించాయి. మరికొన్ని సంస్థలు ఉన్న కొద్దిమంది కూలీలతోనే పనులు చేస్తున్నాయి. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్‌, మణికొండ, నార్సింగి, పుప్పాలగూడ, బండ్లగూడ, శంషాబాద్‌ తదితర ప్రాంతాలల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో వలసకార్మికులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం 12 కిలోల బియ్యం, రూ.500 చొప్పున నగదును పంపిణీ చేసి ఆదుకున్నది. 


వలస కూలీలలో సంతోషం

నిర్మాణ రంగ పనులకు ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంపై వలసకూలీల్లో హర్షం వ్యక్తమవుతున్నది. సొంత గ్రామాలకు వెళ్లాలనుకున్నవారు వారి నిర్ణయాన్ని మార్చుకుని పనులలో నిమగ్నమయ్యారు. రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు మావని, లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులకు గురైతే తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తమను ఆదుకున్నదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు భౌతికదూరం నిబంధనను అమలుచేస్తూ భవన నిర్మాణ కార్మికులతో పనులు చేయిస్తున్నారు. 

మూడు నెలల్లోపు సాధారణ పరిస్థితులు 

కరోనా ప్రభావం రియల్‌రంగంపై పెద్దగా ఉండబోదని, మూడునెలల్లోగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని హైదరాబాద్‌ నిర్మాణ రంగం చెప్తున్నది. కరోనాకు ముందు హైదరాబాద్‌లో వాణిజ్య, నివాసమార్కెట్లు గణనీయంగా పుంజుకున్న విషయం విదితమే. రెండేండ్ల నుంచి ఫ్లాట్లు, విల్లాలు భారీగా అమ్ముడుపోవడంతో మరో ఏడాది వరకు నిర్మాణరంగానికి వచ్చే ఢోకా ఏమీలేదని క్రెడాయ్‌ హైదరాబాద్‌ మాజీ అధ్యక్షుడు ఎస్‌ రాంరెడ్డి అభిప్రాయపడ్డారు. కరోనా రాకముందు వరకూ జరిగిన అమ్మకాలే హైదరాబాద్‌ నిర్మాణరంగాన్ని నిలబెట్టడంలో తోడ్పడుతుందనే విశ్వాసం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌ నుంచి భవననిర్మాణ కార్మికులు కొందరు స్వస్థలాలకు వెళుతున్నప్పటికీ.. ఇతరరాష్ర్టాల కూలీలు తిరిగి వస్తున్నారని వివరించారు. 

ఇసుక లారీ.. నగర దారి 

భవన నిర్మాణరంగం పనులు ముమ్మరంగా ప్రారంభమవడంతో పెద్దఎత్తున ఇసుక హైదరాబాద్‌కు రవాణా అవుతున్నది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో ఐదు, మహదేవ్‌పూర్‌లో ఎనిమిది క్వారీల నుంచి ప్రతిరోజూ దాదాపు 30 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను రాజధానికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుకను తరలించే వందల లారీలు హైదరాబాద్‌ నుంచి మడికొండ మీదుగా జాతీయ రహదారి (163)పై వరుసకట్టాయి. ఇసుక బుకింగ్‌, తరలింపుపై గతంలోని టీఎస్‌ఎండీసీ విధానాలనే అనుసరిస్తున్నామని మహదేవ్‌పూర్‌ టీఎస్‌ఎండీసీ ప్రాజెక్టు అధికారి రఘునందన్‌రావు పేర్కొన్నారు. 13 క్వారీల నుంచి దాదాపు 1800 లారీల ద్వారా రోజుకు 30 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తరలిస్తున్నట్టు చెప్పారు. క్వారీ పాయింట్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఈ మార్గంలో అన్ని పోలీస్‌ చెక్‌పోస్టుల వద్ద తనిఖీచేసి పంపిస్తుండటంతో లారీలు పెద్దఎత్తున నిలిచిపోతున్నాయి. శుక్రవారం అర్థరాత్రి దాటాక వరంగల్‌ అర్బన్‌, జనగామ జిల్లాల పరిధిలోని మడికొండ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌దాకా లారీల బారులు తీరాయి. 


logo