గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 01:56:51

రండి.. పనిచేయండి

రండి.. పనిచేయండి

  • ఇతర రాష్ర్టాలనుంచి తిరిగొచ్చిన కూలీలకు ఉపాధి
  • న్యాక్‌ ప్రత్యేక ఏర్పాట్లు
  • 10 వేలమంది జాబితా సిద్ధం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌లో విదేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చిన వలస కార్మికులు, కూలీలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. కూలీలకు స్థానికంగానే ఉపాధి కల్పించేందుకు సర్కారు ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలిస్తున్నది. దాదాపు 10 వేలమందికి ఇప్పటికే ఉపాధి మార్గం చూపింది. నిర్మాణరంగాలకు సైతం ఇది ఊతమిస్తున్నది. 

పని కల్పనకు సిద్ధం

ఇతర రాష్ర్టాలనుంచి వచ్చిన వలస కూలీలు లాక్‌డౌన్‌లో స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇప్పట్లో తిరిగి వచ్చే పరిస్థితి లేదు. కార్యకలాపాలు కొనసాగించడానికి కూలీల కొరత తీవ్రంగా ఉన్నది. రాష్ట్రంలోని నిర్మాణరంగ సంస్థలైన రియల్‌ ఎస్టేట్‌, బిల్డర్స్‌ అసోసియేషన్స్‌ బీఏఐ, క్రెడాయ్‌, ట్రెడా, టీబీఎఫ్‌, సీఐఐ-ఐజీబీసీ సంస్థలు తెలంగాణ బిడ్డలకు మొదటి ప్రాధాన్యంగా పని కల్పించడానికి సంసిద్ధత వ్యక్తంచేశాయి. ఇప్పటికే న్యాక్‌ వద్ద రిజిస్టర్‌ చేసుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉన్న 10,090 మంది కార్మికుల జాబితా వివరాలను రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇటీవల రియల్‌ఎస్టేట్‌ అసోసియేషన్లకు అప్పగించారు. ఈ అసోసియేషన్లు కార్మికులను నిర్మాణసంస్థలకు అప్పగిస్తాయి. జాబితాలో ఉన్న కార్మికులను ఆయా సంస్థలు సంప్రదించి పని కల్పిస్తాయి. ఇప్పటికే కొంతమంది కార్మికులకు ఉపాధి చూపారు. ఇటీవల పలు భవన నిర్మాణాలకు ‘రెరా’ అనుమతులిచ్చింది. అతి త్వరలో ఆయాసంస్థలు నిర్మాణాలను ప్రారంభిస్తాయి. పనులు ప్రారంభమైతే కార్మికుల అవసరం మరింత ఉంటుందని నిర్మాణ సంస్థలు అంటున్నాయి. 

ఆన్‌లైన్‌లో నమోదు

నిర్మాణ సంస్థల్లో పనిచేయాలనుకునే కార్మికులు ఆన్‌లైన్‌లో పేర్లను నమోదుచేసుకోవాలని న్యాక్‌ తెలిపింది. సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సాంకేతిక సహకారంతో తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో వెబ్‌సైట్‌ను రూపొందించింది. న్యాక్‌ (ఎన్‌ఏసీ) వెబ్‌సైట్‌లో వివరాలు నమోదుచేసుకుంటే కార్మికుల జాబితా భవన నిర్మాణ సంస్థలకు వెళ్తుంది. నిర్మాణ సంస్థలు ఆ కార్మికుడికి ఫోన్‌చేసి పనిస్తాం రమ్మని పిలిచి పని కల్పిస్తాయి.


logo