శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 00:30:13

ప్రజాస్వామ్య పాఠాలెక్కడ?

ప్రజాస్వామ్య పాఠాలెక్కడ?

  • రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం : టీఎస్‌యూటీఎఫ్‌
  • 30 శాతం కుదింపును స్వాగతిస్తున్నాం : టీపీయూఎస్‌
  • సీబీఎస్‌ఈ సిలబస్‌ తగ్గింపుపై భిన్నాభిప్రాయాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో 9-12 తరగతులకు సిలబస్‌ను తగ్గిస్తూ సీబీఎస్‌ఈ తీసుకున్న నిర్ణయం రచ్చకు దారితీస్తున్నది. కొన్ని వర్గాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగం, హక్కులు, ప్రజాస్వామ్యం, చరిత్ర వంటి అంశాలను తొలగించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తగ్గించిన సీబీఎస్‌ఈ సిలబస్‌ రాజ్యాంగం నిర్ణయించిన లక్ష్యాలకు విరుద్ధంగా ఉందని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు కే జంగయ్య, చావ రవి ఆరోపించారు. ఉదాహరణకు 9, 10 తగరతులకు సాంఘికశాస్త్రంలో జనాభా, ప్రజాస్వామిక హక్కులు, రాజ్యాంగ స్వరూపం, ప్రజాస్వామ్యం- భిన్నత్వం, ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లు, కులం, మతం, లింగ వివక్ష, ప్రముఖ పోరాటాలు, ఉద్యమాలు, ఆహార భద్రత తదితర ముఖ్యమైన అంశాలను తొలిగించారన్నారు. అలాగే 11, 12 తరగతుల సాంఘికశాస్త్రంలోజాతీయత, లౌకికతత్వం, సమాఖ్య వ్యవస్థ, స్థానిక ప్రభుత్వాలు, పౌరసత్వం, వాతావరణం, సహజ వనరులు, వర్తమాన ప్రపంచంలో దేశ భద్రత, పొరుగు దేశాలతో సంబంధాలు, మానవ హక్కుల చరిత్ర వంటి కీలక పాఠ్యాంశాలను తొలిగించారన్నారు.

నియంతృత్వ వ్యవస్థలోకి తీసుకుపోవడానికి మానసికంగా విద్యార్థులను సిద్ధం చేయడానికే ఆ అంశాలను తొలగించినట్టు అవగతం అవుతోందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పాఠాలకు ప్రాధాన్యత లేదా అంటూ సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ స్టడీస్‌ (సెస్‌) ప్రశ్నించింది. ఇక, సిలబస్‌ తగ్గింపును స్వాగిస్తున్నట్టు తెలంగాణ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు హనుమంతరావు, సురేష్‌ తెలిపారు. రాష్ట్రంలోనూ 30 శాతం వరకు సిలబస్‌ను తగ్గించాలని కోరారు. కరోనా సమయంలో సిలబస్‌ తగ్గింపును పెద్ద సమస్యగా చూడొద్దని ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్‌నాథ్‌ అన్నారు. దీనిపై రచ్చ చేయడం శ్రేయస్కరం కాదని అభిప్రాయపడ్డారు.


తాజావార్తలు


logo