గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 01:58:01

యాప్‌లో ఉద్యోగి వేతన చరిత్ర

యాప్‌లో ఉద్యోగి వేతన చరిత్ర

  • ఐఎఫ్‌ఎంఐఎస్‌ పేరుతో రూపొందించిన రాష్ట్ర ఆర్థికశాఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వోద్యోగులు తమ జీత భత్యాలు, అలవెన్సులు, కోతలు,  పెరుగుదల వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంకోసం రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించింది. ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (ఐఎఫ్‌ఎంఐఎస్‌) పేరుతో సిద్ధమైన ఈ యాప్‌లో ఉద్యోగులు తమ ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన సమస్తమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇందులో వివరాలు చూసుకోవడం, అవసరమైతే ప్రింట్‌ తీసుకోవడం తప్ప సవరణలకు ఎలాంటి అవకాశం ఉండదు. దీని ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలగనున్నది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌చేసుకొని ఎంప్లాయి.. లేదా పెన్షనర్‌, ఆడిట్‌/డీడీవో ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకొని.. బ్యాంకు ఖాతా నంబర్‌ లేదా ఎంప్లాయి ఐడీ ద్వారా లాగిన్‌ కావాలి. అనంతరం డ్యాష్‌బోర్డులో ఉద్యోగికి సంబంధించిన సర్వీసు వివరాలన్నీ కనిపిస్తాయి. జీతం జమ అయ్యే బ్యాంకు ఖాతా వివరాలు.. దాని లావాదేవీలు కనిపిస్తాయి. వీటితోపాటు జీపీఎఫ్‌ నెంబర్‌, ఏపీజీఎల్‌ఐ నెంబర్‌, టీఎస్‌ జీఎల్‌ఐ నంబర్‌ కూడా ఉంటాయి. ఉద్యోగి పొందుతున్న హెచ్‌ఆర్‌ఏ, ప్రస్తుతం అమలవుతున్న పీఆర్‌సీ, ఐటీతోపాటు ఉద్యోగి వేతనం నుంచి కట్‌ అవుతున్న కోతలు, ఇంక్రిమెంట్‌, ప్రస్తుతం అమలువుతున్న డీఏ వివరాలు మొత్తం ఉంటాయి. ఉద్యోగికి సంబంధించిన పే స్లిప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఉద్యోగి జీతంలో సప్లిమెంటరీ బిల్స్‌ వివరాలు కనపడుతాయి. 


logo