సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 02:46:48

విదేశాంగ విధాన నిర్దేశకుడు

విదేశాంగ విధాన నిర్దేశకుడు

మన పని మనం చేసుకుంటున్నపుడు పక్కవాడు చెడగొడితే మనకే ఇబ్బంది. మన పనికి విఘ్నం వాటిల్లకుండా వాడిని మచ్చిక చేసుకోవడమో, సమయం చూసి దీటుగా సమాధానం ఇవ్వడమో చేయాలి. ఈ సత్యం తెలిసిన పీవీ నరసింహారావు దానికి తగ్గట్టుగానే చర్యలు తీసుకునేవారు. ఆయన విదేశాంగ విధానాన్ని వాస్తవిక దృక్పథంతో అమలు చేశారు. వాస్తవాధీన రేఖ వద్ద చైనాతో గొడవను సామరస్యంగా పరిష్కరిస్తే, కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్‌ను ప్రపంచ వేదిక ముందు దోషిగా నిలబెట్టారు. ఈ రెండు సందర్భాలే చాలు ఆయన విదేశాంగ విధానం ఎలా ఉంటుందో చెప్పడానికి. దేశాభివృద్ధికి పొరుగు దేశాలతో సత్సంబంధాలు చాలా ముఖ్యమని పీవీకి తెలుసు. అందుకే, ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకున్నారు.

‘లుక్‌ ఈస్ట్‌ (తూర్పు వైపు చూడు)’ విధానాన్ని తీసుకొచ్చారు. ఆసియాన్‌ దేశాలతో ఆర్థిక, దైపాక్షిక సంబంధాలను నెలకొల్పారు. 1992లో భారత్‌-ఆసియాన్‌ దేశాల మధ్య అంశాలవారీగా చర్చలు ప్రారంభమయ్యాయి. ఆ ఫలితమే ఇప్పుడు ఆసియాన్‌లో భారత్‌ కూడా భాగస్వామి అయ్యింది. చైనా దురాక్రమణ విధానాలతో విసిగిపోయిన ఆ కూటమి భారత్‌వైపు చూస్తున్నది. చైనాను అదుపులో ఉంచడానికి ఒకరకంగా పీవీ వేసిన వ్యూహాత్మక అడుగు ఇదని అభివర్ణించవచ్చు. ఇక, ఆయన నేతృత్వంలోని భారత్‌ ఇతర సార్క్‌ దేశాలతో కలిసి దక్షిణాసియా ప్రాధాన్యత వర్తక ఒప్పందంపై సంతకం చేసింది. ఇరాన్‌తో సంబంధాల విషయంతో పీవీ ఒక అడుగు ముందుకే వేశారు. పీవీ ప్రధాని అయ్యేకంటే ముందు వరకు ఇరాన్‌తో సంబంధాలు దారుణంగా ఉండేవి. 1965, 1971 ఇండో-పాక్‌ యుద్ధాల సందర్భంలో పాక్‌కు ఇరాన్‌ మిలిటరీ మద్దతు కూడా ఇచ్చింది. 

అలాంటిది, ద్వైపాక్షిక సంబంధాలు నెరిపేందుకు పీవీ 1993లో ఆ దేశ పర్యటనకు వెళ్లారు. అలా రెండు దేశాల మధ్య వాణిజ్య, టెక్నాలజీ రంగాల్లో సహకారం పెంపొందింది. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాల విషయంలో పీవీ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనది. నెహ్రూవియన్‌ పాలసీకి భిన్నంగా ఆ దేశంతో సంబంధాలు కొనసాగించారు. టెల్‌ ఆవివ్‌లో భారత రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ చర్య వల్ల రక్షణ సంబంధ విషయాల్లో ఇజ్రాయెల్‌ సహకారం భారత్‌కు అందింది. తనదైన మార్కుతో, విదేశాంగ విధానం అంటే ఇలానే ఉండాలని భావితరాలకు మార్గనిర్దేశనం చేశారు.

- సెంట్రల్‌ డెస్క్‌logo