సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 01:38:32

విద్యుదీకరణ 100%

విద్యుదీకరణ 100%

  • రాష్ట్రంలో ప్రతి ఇంటికీ కరెంటు
  • దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానం
  • సరఫరాలోనూ టాప్‌ స్థానాల్లో
  • ఆరేండ్లలోనే అద్భుత ప్రగతి 
  • సీఈఈడబ్ల్యూ సర్వేలో వెల్లడి

అంధకారమైపోతుందన్న శాపాలు ఎదుర్కొన్న తెలంగాణ ఇప్పుడు విద్యుత్తేజాలు వెదజల్లుతున్నది! పోయిన కరెంటు ఎప్పుడొస్తుందో తెలియక గుడ్డిదీపాలే దిక్కయిన చోట.. నిరంతర విద్యుత్‌ స్రవంతులు రికార్డులు సృష్టిస్తున్నాయి! ఉనికిలోకి వచ్చి ఆరేండ్లే అయినా.. పాత రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, బీహార్‌ వంటివాటిని పక్కకు నెట్టి.. శిఖరాగ్రస్థానంలో విజయ దరహాసం చేస్తున్నది! 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంపు, సరఫరా, నిర్వహణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ (సీఈఈడబ్ల్యూ) సంస్థ పేర్కొన్నది. దక్షిణాసియాలోని అగ్రశ్రేణి స్వచ్ఛంద సంస్థల్లో సీఈఈడబ్ల్యూ ఒకటి. ఇటీవల తాము ఇనిషియేటివ్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ ఎనర్జీ పాలసీ (ఐఎస్‌ఈపీ)తో కలిసి ‘ఇండియా రెసిడెన్షియల్‌ ఎనర్జీ సర్వే (ఐఆర్‌ఈఎస్‌)-2020 పేరుతో దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించామని ఆ సంస్థ పేర్కొన్నది. ఈ నివేదిక ప్రకారం విద్యుత్‌ రంగంలో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని సంస్థ ప్రోగ్రామ్‌ ఇంచార్జి షాలు అగర్వాల్‌ వివరించారు. కొత్త రాష్ట్రమే అయినా ఆరేండ్లలోనే కర్ణాటక, మధ్యప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌ వంటి రాష్ర్టాలను వెనక్కి నెట్టిందని ప్రశంసించారు. తెలంగాణలో ప్రతి ఇంటికీ కరెంటు కనెక్షన్‌ ఇచ్చారని, విద్యుదీకరణను 100% పూర్తిచేసిన రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌ 96.9%, కర్ణాటక 96.8%, రాజస్థాన్‌ 96%తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ 93.2 శాతంతో చివరన నిలిచిందని చెప్పారు. 

సరఫరాలోనూ అగ్రస్థానాల్లోనే

తెలంగాణ డిస్కమ్‌లు సైతం ఇతర రాష్ర్టాలతో పోల్చితే ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాయని షాలు అగర్వాల్‌ అభినందించారు. కరెంటు సరఫరాలోనూ తెలంగాణ టాప్‌-5 రాష్ర్టాల్లో నిలిచిందని తెలిపారు. దేశవ్యాప్తంగా సగటున రోజుకు 20 గంటలపాటు కరంటు సరఫరా చేస్తుండగా, తెలంగాణలో 22.5 గంటలపాటు సరఫరా అవుతున్నదని వివరించారు. ఉత్తరప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాలతో పోల్చితే తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోని ఇండ్లకు రెండు గంటలపాటు ఎక్కువగా కరెంటు సరఫరా అవుతున్నట్టు తమ సర్వేలో తేలింద పేర్కొన్నారు. సర్వేలో భాగంగా 21 రాష్ర్టాల్లోని 1,210 గ్రామాలకు చెందిన 15 వేల కుటుంబాలను ప్రశ్నించారు. తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లోని 500 ఇండ్లల్లో సర్వే నిర్వహించారు. గృహాలకు విద్యుత్‌ అందుతున్న తీరుపై దేశవ్యాప్తంగా నిర్వహించిన మొట్టమొదటి సర్వే ఇదే కావడం విశేషం. 

పట్టణాల్లోనూ వందశాతం

తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లోనూ గృహ విద్యుదీకరణ వందశాతం జరిగినట్టు సర్వే వెల్లడించింది. వీటన్నింటిలో మీ టర్లు ఉన్నాయని, వాటికి రెగ్యులర్‌గా బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయని పేర్కొన్నది. సర్వే చేసిన ఇండ్లలో మూడోవంతుకన్నా ఎక్కువ ఇండ్ల యజమానులకు సౌర విద్యుత్‌ తదితర సంప్రదాయేతర ఇంధనాల పట్ల అ వగాహ న కలిగి ఉన్నారని షాలు అగర్వాల్‌ తెలిపారు. 

వివిధ రాష్ట్రాల్లో గృహాల విద్యుదీకరణ

రాష్ట్రం : శాతం

తెలంగాణ: 100

ఉత్తరాఖండ్‌ : 99.3

ఒడిశా :99.2

గుజరాత్:‌ 99

వెస్ట్‌బెంగాల్‌: 98

బీహార్‌ :97.8

జార్ఖండ్‌ :97.6

మధ్యప్రదేశ్‌ :96.9

కర్ణాటక :96.8

రాజస్థాన్‌ :96

ఛత్తీస్‌గఢ్‌ :95.8

ఉత్తరప్రదేశ్‌: 93.2