సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 16, 2020 , 01:38:48

ఏపీ ఏకపక్ష నిర్ణయం!

ఏపీ ఏకపక్ష నిర్ణయం!
  • 584 మంది విద్యుత్‌ ఉద్యోగుల రిలీవ్‌
  • ధర్మాధికారి సూచనలు పట్టని విద్యుత్‌ సంస్థలు
  • మరో వివాదానికి తెరతీసిన ఏపీ యాజమాన్యాలు
  • తమకు సంబంధంలేదన్న సీఎండీ ప్రభాకర్‌రావు
  • ఉద్యమిస్తామన్న తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు

హైదరాబాద్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: విద్యుత్‌ ఉద్యోగుల విభజన విషయంలో ఏకపక్ష నిర్ణయంతో ఏపీ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు మరో వివాదానికి తెరతీశాయి. ఈ విషయంలో మొదటినుంచి తెలంగాణ ఉద్యోగాల్లో ఆంధ్రావారిని దిగుమతి చేయడంపైనే దృష్టి సారించిన ఏపీ విద్యుత్‌ సంస్థలు మరోసారి అదే తరహాలో వ్యవహరించాయి. విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు నియమించిన ఏకసభ్య కమిటీ జస్టిస్‌ ధర్మాధికారి తుది ఉత్తర్వులను పట్టించుకోకుండా, అనుబంధ ఉత్తర్వులపై ఇచ్చిన వివరణను పరిశీలించకుండా.. ఏకపక్షంగా 584 మంది ఉద్యోగులను సంస్థ లు ఏపీ నుంచి రిలీవ్‌ చేశాయి. దీనిపై తెలంగాణలోని విద్యుత్‌ కార్మిక, ఉద్యోగ సంఘాలతోపాటు ఉన్నతాధికారులు భగ్గుమంటున్నారు. జస్టిస్‌ ధర్మాధికారి ఈ నెల 11న ఇచ్చిన అనుబంధ తుది ఉత్తర్వుల్లో కొన్ని అంశాల్లో గందరగోళం నెలకొనడంతో తెలంగాణ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు కమిటీ స్పష్టమైన వివరణ ఇచ్చింది. దీనిని పట్టించుకోకుండా ఏపీ విద్యుత్‌ సంస్థలు ఉద్యోగులను రిలీవ్‌ చేశాయి.


భగ్గుమన్న తెలంగాణ విద్యుత్‌ జేఏసీ

ఏపీ విద్యుత్‌ సంస్థల ఏకపక్ష నిర్ణయంపట్ల తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగ, కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. ఏపీలో రిలీవ్‌ అయినవారు హైదరాబాద్‌లో ఉద్యోగంలో చేరేందుకు సోమవారం రానున్నారనే సమాచారం నేపథ్యంలో అడ్డుకుంటామని స్పష్టంచేశాయి. ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్న ఈ అం శంలో తాము బాధ్యత వహించబోమని తెలంగాణ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు కూడా తేల్చిచెప్పాయి. విద్యుత్‌ జేఏసీ నేతలు ఆదివారం మింట్‌కాంపౌండ్‌లో సమావేశమయ్యారు. జేఏసీ చైర్మన్‌ ఎన్‌ శివాజీ, వైస్‌చైర్మన్‌ పీ అంజయ్య తదితరులు.. ఏపీ జారీచేసిన రిలీవ్‌ ఉత్తర్వుల ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తంచేశారు. భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించారు. సోమవారం విద్యుత్‌సౌధ, ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ను ముట్టడించి, ఏపీ ఉద్యోగులను అడ్డుకుంటామన్నారు. మధ్యాహ్నభోజన సమయంలో ఉత్తర్వుల ప్రతుల దహనం, ర్యాలీలు నిర్వహించనున్నామన్నారు. ఈ నెల 31 వరకు రిలే దీక్షలు, అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షకు సైతం వెనుకాడబోమన్నారు. ఆప్షన్లు ఇవ్వని, హోం డిస్ట్రిక్ట్‌కాని ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడం దారుణమని మండిపడ్డారు. కార్యక్రమంలో పవర్‌ జేఏసీ నేతలు రామేశ్వరయ్యశెట్టి, నాజర్‌షరీఫ్‌, రాజేశ్‌, వినోద్‌, నర్సింహారెడ్డి, పున్నానాయక్‌, పరమేశ్‌, సురేందర్‌, అనిల్‌, వెంకట్రామ య్య, పవన్‌కుమార్‌గుప్తా, వెంకటేశ్‌ పాల్గొన్నారు.


అడ్డుకుంటాం: టీఎస్‌పీఈఏ

ఏపీ నుంచి వస్తున్న విద్యుత్‌ ఉద్యోగులను అడ్డుకుంటామని తెలంగాణ పవర్‌ ఇంజినీర్స్‌ అసొసియేషన్‌ (టీఎస్‌పీఈఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీ రత్నాకర్‌రావు, పీ సదానందం హెచ్చరించారు. ఆదివారం సోమాజీగూడలోని పవర్‌ ఇంజినీర్స్‌ భవన్‌లో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఉద్యోగుల రాకను నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేస్తామని తెలిపారు. వారిని వెనక్కిపంపేవరకు విద్యుత్‌సౌధ, మింట్‌కాంపౌండ్‌, వరంగల్‌ ఎన్సీడీసీఎల్‌ సహా అన్ని విద్యుత్‌ కేంద్రాల్లో పెద్దఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించారు. సమావేశంలో కిరణ్‌కుమార్‌, శివశంకర్‌, వెంకటనారాయణరెడ్డి, విద్యాసాగర్‌, కే వెంకటేశ్వర్‌, వెంకటేశ్‌, గోపాల్‌రావు, పీవీరావు, సతీశ్‌, సురేశ్‌, సత్యనారాయణరాజు, మల్లికార్జున, భాస్కర్‌, యాదగిరి, గంగాధర్‌, కిరణ్‌, సుమంత్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.


ఏపీ నిర్ణయం సరికాదు: సీఎండీ ప్రభాకర్‌రావు


కమిటీ ఉత్తర్వులను ఉల్లంఘించి ఏపీ రిలీవ్‌చేసిన ఉద్యోగుల బాధ్యత తమది కాదని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు స్పష్టంచేశారు. జస్టిస్‌ ధర్మాధికారి నుంచి వివరణ వచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని ఉటంకిస్తూ ఆదివారం ఏపీ ట్రాన్స్‌కో సీఎండీకి, ఏపీ జెన్‌కో ఎండీకి లేఖ రాశారు. ఇందులో జస్టిస్‌ ధర్మాధికారి అనుబంధ ఉత్తర్వులు, అందులోని కొన్ని అంశాలపై తాము వివరణ కోరగా.. వచ్చిన వివరణలను కూడా ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఏపీ సబ్‌కమిటీ కేటాయింపుల ఆధారంగా ఏకసభ్య కమిటీ గుర్తించిన 2,165 మంది ఉద్యోగుల జాబితా తమకు అందలేదని, ఈ కారణంగా అనుబంధ ఉత్తర్వుల్లో పేర్కొన్న 27వ పేరాలోని అంశాన్ని అమలుచేసే ప్రసక్తేలేదని తెలిపారు. ఏకసభ్య కమిటీ గుర్తించిన 2,165 మంది ఉద్యోగుల నుంచి రెండు రాష్ర్టాల మధ్య విభజించిన 1,157 మంది, ప్రత్యేక కారణాలతో తెలంగాణకు కేటాయించిన 71 మంది, ఏపీ నుంచి సెల్ఫ్‌ రిలీవ్‌ అయి తెలంగాణలో చేరిన 229 మందిని తీసివేసి.. మిగిలినవారిలో తెలంగాణ స్థానిక జిల్లాల ఆధారంగా.. ఏకసభ్య కమిటీ విచారణలో తమ ఆప్షన్‌ను ఇచ్చినవారిని గుర్తించి ఇచ్చిన రిపోర్టు.. దానిని ఏకసభ్య కమిటీ గుర్తించి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. 


ఈ ప్రక్రియ జరుగకుండా, తమకు జాబితా అందించకుండా ఏకపక్షంగా 584 మందిని రిలీవ్‌ చేయడం సరికాదన్నారు. వాస్తవానికి ముందస్తు సమాచారం ఇవ్వాలని, దీనివల్ల సమాచారాన్ని సరిచూసుకొనే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆ తర్వాతే రిలీవ్‌ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను పాటించకుండా తీసుకొనే ఎలాంటి నిర్ణయమైనా కమిటీ, సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్టుగానే భావించాల్సి ఉంటుందని చెప్పారు. అందుకే ఎవరినీ రిలీవ్‌ చేయవద్దని.. ఒకవేళ అలాంటి నిర్ణయమే తీసుకొంటే తెలంగాణ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు దీనికి ఎలాంటి బాధ్యత వహించవని లేఖలో స్పష్టంచేశారు.


logo