శనివారం 30 మే 2020
Telangana - May 11, 2020 , 01:40:06

సబ్‌ లైసెన్సీలదే హవా!

సబ్‌ లైసెన్సీలదే హవా!

  • లాభం వచ్చే ప్రాంతాల్లో ప్రైవేటు పాగా
  • గ్రామీణప్రాంతాలకే డిస్కంలు పరిమితం
  • నష్టాలు భరించలేక పూర్తిగా ప్రైవేటీకరణ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రజలకు నిర్విరామంగా సేవలందిస్తూ.. వేలమందికి ఉపాధి కల్పిస్తున్న ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ తదితర విద్యుత్‌రంగ సంస్థలు భవిష్యత్తులో కనుమరుగుకానున్నాయి! కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ బిల్లు-2020 చట్టంగా మారితే సబ్‌లైసెన్సీలదే హవా నడుస్తుందని.. డిస్కంలకు ఆర్థికభారంతో ప్రైవేటీకరణ ముంపు పొంచిఉన్నదని విద్యుత్‌రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బిల్లులో పేర్కొన్న పలు అంశాలను, సెక్షన్లను ఇందుకు ఉదహరిస్తున్నారు. కేంద్రం సిద్ధంచేసిన నూతన విద్యుత్‌ సవరణ బిల్లు-2020లోని సెక్షన్‌ 2 క్లాజ్‌ 17.. విద్యుత్‌ పంపిణీకి సబ్‌లైసెన్సీలను నియామకాన్ని అనుమతిస్తున్నది. డిస్కంల పరిధిలోని ఒక జిల్లా గానీ, డివిజన్‌ ప్రాంతాన్ని సబ్‌లైసెన్సీ తీసుకుని ఆ పరిధిలో విద్యుత్‌కు సంబంధించిన అన్ని పనులనూ అదే చూసుకుంటుంది. విద్యుత్‌ పంపిణీ, బిల్లుల తయారీ, బిల్లుల వసూలు తదితరాలన్నింటినీ డిస్కంల తరఫున చేస్తుంది.

ఆదాయం ఉన్నప్రాంతాలకే మొగ్గు

సబ్‌లైసెన్సీలు కేవలం లాభాపేక్షతోనే వస్తుంటారు. డిస్కంల పరిధిలో అధికలాభం వచ్చే ప్రాంతాలనే ఎన్నుకుంటారు. ఉదాహరణకు.. పట్టణాల్లో పారిశ్రామికప్రాంతాలతోపాటు వ్యాపార, వాణిజ్య సముదాయాలు కూడా ఉంటాయి. ఇవన్నీ లాభాలు తెచ్చిపెట్టేవే. అదే పల్లెలు, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు, వాణిజ్య, వ్యాపారసంస్థలు ఏవీ ఉండవు. అక్కడ సబ్సిడీపై విద్యుత్‌ను ఉపయోగించే రైతులు, గృహ వినియోగదారులే అధికంగా ఉంటారు. పైగా బిల్లుల చెల్లింపు నామమాత్రంగానే జరుగుతుంది. గ్రామీణప్రాంతాల్లో వీధిదీపాలు, తాగునీటి సరఫరా వంటివి సబ్సిడీపై నడిచేవే. వీటికి ఆదాయం కంటే నిర్వహణ వ్య యమే అధికంగా ఉంటుంది. వీటిని బేరీజు వేసుకుని సబ్‌లైసెన్సీలు లాభం వచ్చే ప్రాంతాలనే ఎన్నుకుని.. నష్టం వచ్చే ప్రాంతాలవైపు కన్నెత్తికూడా చూడరు. డిస్కంల వద్ద నష్టం ప్రాంతాలు మాత్రమే మిగిలిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఇప్పటివరకు లాభం వచ్చేప్రాంతాల నుంచి వచ్చే ఆదాయంతో నష్టాలను పూడ్చుకున్న డిస్కంలకు ఇప్పుడు నష్టాలు మాత్రమే మిగులుతాయి. దీంతో ఏదో ఒకరోజు చేతులెత్తేయక తప్పని పరిస్థితి దాపురిస్తుంది. 

పూర్తిగా ప్రైవేటైజేషన్‌

సబ్‌లైసెన్సీలకు అనుమతివ్వడమే ప్రైవేటైజేషన్‌కు మొదటి అడుగు అని విద్యుత్‌రంగ నిపుణులు అంటున్నారు. ఒక ప్రాంతంలోకి ఐదుగురు సబ్‌లైసెన్సీలు వస్తే.. అప్పటివరకు అక్కడ ఉన్న డిస్కం ఐదు ముక్కలైనట్టే. ప్రభుత్వరంగ సంస్థ అయిన డిస్కంలు ప్రభుత్వ ఆశయాలు, లక్ష్యాలను చేరుకునేలా లాభనష్టాలను బేరీ జు వేసుకోకుండా విద్యుత్‌ సేవలందిస్తాయి. కానీ, సబ్‌లైసెన్సీ లు లాభాల కోసమే పనిచేస్తాయి. దీంతో డిస్కం ఆర్థికంగా కుదేలయి, భారం పెరుగుతుంది. అప్పులు తరుముతుండటంతో ఇక అన్ని ప్రాంతాలనూ ప్రైవేటు సంస్థలకు అప్పగించకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో డిస్కంల ప్రైవేటీకరణ సంపూర్ణమవుతుందని హెచ్చరిస్తున్నారు.

 ఉద్యోగ నియామకాలు ఉండవు

కేంద్రం బిల్లు చట్టరూపం దాల్చితే ఉద్యోగ నియామకాలకు కోతపడుతుంది. మొత్తం ప్రైవేట్‌ వ్యక్తుల అధిపత్యమే కొనసాగుతుంది.విద్యుత్‌ టారిఫ్‌లపై నిర్ణయాధికారం కేంద్రప్రభుత్వం చేతుల్లోకి వెళ్లడంతో స్వతంత్ర ప్రతిపత్తితో నడుస్తున్న విద్యుత్‌ సంస్థలు నిర్వీర్యమవుతాయి. ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌కు మార్చాలని చాలాకాలంగా ఉద్యోగులమంతా పోరాడుతున్నాం. ప్రైవేట్‌ పరమైతే జీపీఎఫ్‌ స్కీమ్‌ను మర్చిపోవాల్సిందే. వారసత్వ ఉద్యోగాలు కూడా లభించవు. ముసాయిదా బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.

- కట్టా మల్లికార్జున్‌నాయుడు, టీఆర్‌వీకేఎస్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి

 సబ్‌లైసెన్స్‌లతో సవాలక్ష సమస్యలు

విద్యుత్‌ సంస్థల వికేంద్రీకరణకు విఘా తం కలిగించేలా కేంద్రం ముసాయిదాను ముందుకుతెచ్చింది. బిల్లులో ప్రతిపాదించిన సబ్‌లైసెన్స్‌లతో సవాలక్ష సమస్యలు ఉత్పన్నమవుతాయి. రెవెన్యూ వచ్చే నగరాలు, పట్టణాలను ప్రైవేట్‌కు అప్పగించి.. లోటుఉండే గ్రామీణ ప్రాంతాల డిస్కంల వద్దే ఉంచుతారు. దీంతో డిస్కంలు ఆదాయం లేక, ఆర్థికంగా కుదేలయ్యే ప్రమాదం ఉన్నది. ఇక సబ్‌లైసెన్స్‌లతో విద్యుత్‌పై అంతగా అనుభవంలేని వ్యక్తులు రంగప్రవేశం చేస్తారు. దీంతో ప్రజలకు నాణ్యమైన, సబ్సిడీతో కూడిన విద్యుత్‌ను అందించలేం. మన దగ్గర యూనిట్‌ ఉత్పత్తికి రూ.6 -7 ఖర్చుచేస్తూ పేదలకు మాత్రం రూ. 1.45కే అందిస్తున్నాం. ఇకమీదట పేదలకోసం ఇలాంటి సబ్సిడీలు ఉండవు.

- బీసీ రెడ్డి, సెక్రటరీ జనరల్‌, తెలంగాణ పవర్‌ డిప్లొమా ఇంజినీర్స్‌ అసోసియేషన్‌


logo