ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 23, 2021 , 01:49:19

11న జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నిక

11న జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నిక

  • అదేరోజు కార్పొరేటర్ల ప్రమాణం
  • రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌, జనవరి 22 (నమస్తే తెలంగాణ): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌, డిపూట్యీ మేయర్‌ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. వచ్చేనెల 11న పరోక్ష విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసింది. విధానపరమైన సూచనలు కూడా విడుదలచేసింది. ఫిబ్రవరి 11న జీహెచ్‌ఎంసీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి తెలిపారు. ఎన్నికల అధికారి అయిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక జిల్లా కలెక్టర్‌ను ప్రత్యేక సమావేశ నిర్వహణ కోసం ప్రిసైడింగ్‌ అధికారిగా నియమిస్తారని పేర్కొన్నారు. షెడ్యూల్‌ ప్రకారం ప్రిసైడింగ్‌ అధికారి ప్రత్యేక సమావేశం నోటీస్‌ను ఫిబ్రవరి 6లోగా జీహెచ్‌ఎంసీ సభ్యులకు జారీచేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడానికి ఎన్నికల కమిషన్‌ ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని పరిశీలకుడిగా నియమిస్తుందని వెల్లడించారు.

11 గంటలకు కొత్త కార్పొరేటర్ల ప్రమాణం

ప్రిసైడింగ్‌ అధికారి వచ్చేనెల 11న ఉదయం 11 గంటలకు కొత్త కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే ప్రత్యేక సమావేశంలో మొదట మేయర్‌ ఎన్నిక నిర్వహిస్తారు. తరువాత డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి తెలిపారు. ఏదైనా కారణాల వల్ల డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహించలేకపోతే.. మరుసటి రోజు (12న) నిర్వహిస్తామని చెప్పారు. ఒకవేళ మరుసటి రోజు సెలవున్నా ఎన్నిక ఉంటుందని స్పష్టంచేశారు.

VIDEOS

logo