సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 24, 2020 , 03:23:06

దుఃఖమే మిగిలింది

దుఃఖమే మిగిలింది

  • ఉద్యోగులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించాం
  • అధునాతన ప్లాంట్‌లో ఘటన దురదృష్టకరం
  • 15 రోజుల్లో ఒకటి, రెండో యూనిట్ల పునరుద్ధరణ
  • ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదంలో చిక్కుకున్న ఉద్యోగులను కాపాడేందు కు తీవ్రంగా ప్రయత్నించామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. వారిని ప్రాణాలతో బయటకు తీసుకొస్తామని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు అశగా ఎదురుచూశామని.. కానీ, చివరకు మృతదేహాలు లభించడం దురదృష్టకమ ని అన్నారు. శ్రీశైలం జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించిందని గురువారం రాత్రి 10.35 గంటలకు ఫోన్‌ వచ్చిందని, వెంటనే అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశానని తెలిపారు. కొద్దిసేపటికే అగ్నికీలలు కేంద్రం మొత్తం వ్యాపించినట్టుగా తెలిసిందని, ఆ విషయాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. మంత్రితో కలిసి రాత్రి 11.45 గంటలకు బయలుదేరామని, తెల్లవారుజామున 2.45 గంటలకు అక్కడికి చేరుకునేసరికి పరిస్థితి భీభత్సంగా ఉన్నదని, లోపల తొమ్మిది మంది చిక్కుకునిపోయారని తెలిసిందని పేర్కొన్నారు. వారిని ఎలాగైనా రక్షించేందుకు ప్రయత్నించామని చెప్పారు. ‘అప్పటికే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక శకటాలతో లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. ఆలోగా అక్కడ కు చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బం ది ఆక్సిజన్‌ సిలిండర్‌ పెట్టుకుని లోపలకు వెళ్లారు. లోపల చిక్కుకున్న సిబ్బంది ప్రాణాలతోనే ఉన్నారని అప్పటివరకు అందరం ఆశతో ఉన్నాం. ఎలాగైనా వారిని ప్రాణాలతో బయటకు తీసుకొస్తామని అనుకున్నాం. కానీ వారి మృతదేహాలే బయటకురావడం చాలా దురదృష్టకరం’ అని సీఎండీ తెలిపారు.

ఊహకు అందడం లేదు..

అత్యంత ఆధునిక సాంకేతికత ఉన్న శ్రీశై లం జల విద్యుత్‌ కేంద్రంలో ఇలాంటి ఘటన జరుగడం ఊహకే అందడం లేదని ప్రభాకర్‌రావు అన్నారు. మంటలు రాగానే దురదృష్టవశాత్తు యూనిట్స్‌ ట్రిప్‌ కాలేదని, దీంతో పైప్‌నుంచి వేరు చేయాల్సి వచ్చిందని చెప్పారు. అప్పటికే ప్రకంపనలు వచ్చాయని, ఐసొలేషన్‌ చేసేసరికి పవర్‌ మొత్తం పోయిందని తెలిపారు. దీంతో లోపల అంధకారం ఏర్పడిందని, అప్పటికే అగ్నికీలలు పెరిగి, విపరీతంగా పొగ నిండిపోయిందన్నారు. ఈ కారణంగా అందులో చిక్కుకుపోయినవారు బయటకురాలేకపోయారని చెప్పారు. ప్రమాదాల సమయంలో ఉపయోగించే ఎస్కేప్‌ టన్నెల్‌ నుంచి నలుగురు బయటకు వచ్చేందుకు పయత్నించారని.. రెండు నిమిషాలైతే బయటకొస్తారనగా ఆక్సిజన్‌ దొరక్క.. కార్బన్‌డైఆక్సైడ్‌ పీల్చుకుని అక్కడే కూలిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఒకటవ, రెండవ యూనిట్లకు కొంత తక్కువ నష్టం జరిగిందని, వాటిని 15 రోజుల్లో పునరుద్ధరిస్తామని చెప్పారు. మిగిలిన యూనిట్ల వద్ద చాలా వేడిగా ఉన్నదని, అక్కడకు వెళ్లలేని పరిస్థితి ఉన్నదని చెప్పారు. మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు జెన్‌కో తరఫున ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని, ఒకట్రెండురోజుల్లో వారిని కలిసి ఆత్మైస్థెర్యా న్ని కల్పిస్తామని తెలిపారు.


గతంలోనూ జరిగాయి..

శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో ఘటనలాంటివి దేశంలో పలు చోట్ల గతంలో కొన్ని జరిగాయి. 2017 నవంబర్‌1న ఉత్తరప్రదేశ్‌లోని 500 మెగావాట్ల ఉంచాల్‌ ఎన్టీపీసీ ప్లాంట్‌లో బాయిలర్‌ పేలిపోయింది. ఈ ఘటనలో 38 మంది ఉద్యోగులు చనిపోయారు. ఈ ఏడాది జూలై 1న నైవేలీ  లిగ్నైట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎల్‌సీ)లోనూ బాయిలర్‌ పేలిపోయింది. ఇక్కడ రెండునెలల వ్యవధిలో రెండుసార్లు బాయిలర్‌ బద్దలయింది. 

శ్రీశైలం దుర్ఘటనపై అంతర్గత విచారణ

  • ఐదుగురు సభ్యులతో కమిటీ
  • ఉత్తర్వులు జారీచేసిన సీఎండీ

 శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదంపై జెన్‌కో అంతర్గతంగా విచారణ చేపట్టనున్నది. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కమిటీని నియమిస్తూ జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీచేశారు. ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జీ రఘుమారెడ్డి చైర్మన్‌గా, సీఈ పీ రత్నాకర్‌ కన్వీనర్‌గా, ట్రాన్స్‌కో జేఎండీ సీ శ్రీనివాసరావు (ఐఆర్‌ఏఎస్‌), డైరెక్టర్‌ టీ జగత్‌రెడ్డి, జెన్‌కో డైరెక్టర్‌ ఎం సచ్చిదానందం సభ్యులుగా ఉంటారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించి 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భవిష్యత్‌తో ఇలాంటి ఘటనలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలు కూడా సిఫారసు చేయాలని ఆదేశించారు.


logo