బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 00:24:25

విపత్తులోనూ సమర్థ నిర్వహణ

విపత్తులోనూ సమర్థ నిర్వహణ

  • యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
  • పర్యవేక్షణకు నోడల్‌ ఆఫీసర్ల నియామకం
  • నీరు నిలవడంతో సవాల్‌గా  కరెంట్‌ సరఫరా
  • ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణవ్యాప్తంగా,  ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీవర్షాలు కురుస్తున్నప్పటికీ కీలక విద్యుత్‌ వ్యవస్థలను సమర్థంగా నిర్వహిస్తున్నామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. రెండువారాలుగా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల విద్యుత్‌ వ్యవస్థలు దెబ్బతిన్నాయని.. వాటిని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తూ సరఫరాలో ఆటంకం లేకుండా చేస్తున్నామని చెప్పారు. బుధవారం విద్యుత్‌సౌధలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారీవర్షాల కారణంగా జీహెచ్‌ఎంసీలో విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్లు, హెచ్‌టీ, ఎల్‌టీ లైన్లు దెబ్బతిని అనేకచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిందని చెప్పారు. పలు భవన సముదాయాల్లో ఇప్పటికీ వరద నీరు నిలిచి ఉండటం తో విద్యుత్‌ సరఫరా పెద్ద సవాల్‌గా మారిందన్నారు. కరెంట్‌ సరఫరా పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా నోడల్‌ ఆఫీసర్లను నియమించామని అత్యవసర పరిస్థితుల్లో వారిని సంప్రదించాలని సూచించారు. ఆయాప్రాంతాల్లో విద్యుత్‌సరఫరాపై ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశామని, ప్రస్తుతమున్న కాల్‌సెంటర్‌ 1912కు తోడు మరికొన్ని నంబర్లను కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు. తడిసి ఉన్న స్తంభాలు, వేలాడే వైర్లను తాకొద్దని.. ఎక్కడైనా వైర్లు తెగిపడి ఉంటే వెంటనే విద్యుత్‌ అధికారులకు సమాచారమందించాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 286 విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఉండగా 15 సబ్‌స్టేషన్లపై, 11 కేవీ ఫీడర్లు 2,927 ఉండగా 754 ఫీడర్లపై వరదలు ప్రభావం చూపాయని.. వాటన్నంటినీ పునరుద్ధరించామని ప్రభాకర్‌రావు తెలిపారు. 1,215 ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురికాగా 1,170 ట్రాన్స్‌ఫార్మర్లను పునరుద్ధరించామని.. నీరు నిలిచిపోవడం కారణంగా మిగిలినవాటి పనుల్లో ఆటంకం ఏర్పడుతున్నదని చెప్పారు. 1,264 విద్యుత్‌ స్తంభాలను సరిచేసినట్టు తెలిపారు.

నోడల్‌ ఆఫీసర్ల ఫోన్‌నంబర్‌

ట్రాన్స్‌కో రాష్ట్ర 94913 98550

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఏరియా 94408 13856

టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ ఏరియా 94408 11210

కంట్రోల్‌రూం నంబర్లు

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌: 73820 72104, 

                                73820 72106,

                                73820 71574

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌: 94408 11244, 

                                94408 11245