మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 16:20:02

స‌మ‌ర్థ‌వంతంగా బాలల హక్కుల పరిరక్ష‌ణ : మ‌ంత్రి స‌త్య‌వ‌తి

స‌మ‌ర్థ‌వంతంగా బాలల హక్కుల పరిరక్ష‌ణ : మ‌ంత్రి స‌త్య‌వ‌తి

హైద‌రాబాద్ : బాల‌ల హ‌క్కుల ప‌రిర‌‌క్ష‌ణ‌లో అధికారులు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయాల‌ని, బాల‌ల హ‌క్కులను ఉల్లంఘిస్తే క‌ఠిన శిక్ష‌లు ప‌డేలా చూడాల‌ని రాష్ట్ర మ‌హిళాభివృద్ధి-శిశు సంక్షేమ‌శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ అన్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నూతన కార్యాలయాన్ని గురువారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనరేట్ పరిధిలో మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలల హక్కులపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించాలన్నారు. తెలిసి, తెలియని వయసు నుంచే బాలబాలికల పట్ల అనేక దురాఘతాలు జరుగుతున్నాయన్నారు. 

బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ చైర్మ‌న్ జే. శ్రీ‌నివాస్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే తాము బాలల హక్కులను కాపాడడంలో చాలా చురుకుగా పనిచేసిన‌ట్లు తెలిపారు. ఎక్కడ బాలల హక్కులు  ఉల్లంఘనకు గురి అయినా అక్కడకు కమిషన్ చేరుకుని బాధితుల పక్షానా నిలబడుతోందన్నారు. రాబోయే కాలంలో ఇంకా మరింత స‌మ‌ర్ధ‌వంతంగా ప‌నిచేస్తామ‌న్నారు. బాల‌ల హక్కులపై గ్రామాల్లో కూడా అవగాహన కల్పించ‌నున్న‌ట్లు ఆయ‌న‌ తెలిపారు.

కార్య‌క్ర‌మ‌ అనంతరం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనరేట్‌లో రసాయనాలు లేకుండా పండించే ఆకుకూరలు, కూరగాయల విత్తనాలను మంత్రి, కమిషన్ సభ్యులు, అధికారులు చల్లారు. ప‌లు మొక్క‌ల‌ను నాటారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు బృందాదర్, అంజన్ రావు, దేవయ్య, శోభారాణి, అపర్ణ, రాగజ్యోతి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, బాల నేరస్తుల శాఖ సంచాలకులు శైలజా, కమిషన్ కార్యదర్శి ఆశ్రిత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
logo