e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home News బానిస బుద్ధి మారలే!.. తెలంగాణ అభివృద్ధిని ఓర్వని ఈనాడు, ఆంధ్రజ్యోతి

బానిస బుద్ధి మారలే!.. తెలంగాణ అభివృద్ధిని ఓర్వని ఈనాడు, ఆంధ్రజ్యోతి

  • ఇక్కడి వనరులను అనుభవిస్తూ పరాయి పాట
  • కేంద్ర మంత్రులు, సంస్థలు ప్రశంసిస్తున్నా పట్టదు
  • విష ప్రచారంతో తెలంగాణను బదనాం చేసుడే పని
  • జంట పత్రికలకు కంటగింపుగా మారిన రాష్ట్ర ఘనతలు

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు, పట్టణాలకు ప్రతినెల ఠంచనుగా రూ.381 కోట్లు విడుదల చేస్తున్నది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.2,487 కోట్లు విడుదల చేసింది. నెలవారీ కేటాయింపులకు అదనంగా రూ.200 కోట్లు ఇచ్చింది. వైకుంఠధామాలు, ఘనవ్యర్థాల షెడ్లు, పల్లె ప్రకృతి వనాలకు సంబంధించి ఒక్క బిల్లు కూడా పెండింగ్‌లో లేదు. సీసీరోడ్లకు సంబంధించిన రూ.41 కోట్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఉపాధిహామీ నిధుల విడుదలలోగానీ, మ్యాచింగ్‌ గ్రాంట్‌ విడుదలలోగానీ ఎక్కడా వెనక్కు తగ్గలేదు. అయినా ఈనాడు విషం కక్కింది.

ఈ లెక్కలేమీ తీసుకోకుండానే రూ.వెయ్యి కోట్ల బకాయిలు ఉన్నట్టు ఈనాడు అవాస్తవాలు ప్రచారం చేసింది. ‘బిల్లు..ఘొల్లు’ అంటూ సొల్లు రాతలు రాసింది.

- Advertisement -

ఇంకా బానిస బుద్ధిని ప్రదర్శిస్తూ.. పక్క రాష్ట్ర నాయకుడి అడుగులకు మడుగులొత్తుతూ, ఆయన కనుసన్నల్లోనే ఈ రెండు పత్రికలు నడుస్తున్నాయి. పాత అలవాటును మరచిపోలేక అరిగిపోయిన రికార్డుల్లా తయారయ్యాయి.

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (నమస్తే తెలంగాణ): 2014లో పసిగుడ్డుగా మొదలైన తెలంగాణ ప్రస్థానం ఏడేండ్లలోనే దేశానికే దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదగడాన్ని ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు పాపం జీర్ణించుకోలేకపోతున్నాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తెలంగాణ పైపైకి ఎదగడం చూసి కడుపుమంట ఓర్చుకోలేకపోతున్నాయి. ఈర్ష్య, అసూయ, కండ్లమంట ఇవే ఆ పత్రికల జర్నలిజానికి గీటురాళ్లయ్యాయి. అందుకే కేంద్రమంత్రులు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణ అభివృద్ధిని ప్రశంసిస్తున్నా వాటికి అదంతా కనిపించదు. ఏదో జరుగకూడనిది జరుగుతున్నట్టు ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని నానా తంటాలు పడుతుంటాయి. తెలంగాణ ప్రగతికి కేంద్ర ఆర్థిక నివేదికలు అద్దం పడుతున్నా.. ఆ కథనాలు రా‘తల’కెక్కవు. తెలంగాణ ఉద్యమం సాగుతున్న రోజుల నుంచీ ఈ రెండు పత్రికల ధోరణి తెలిసిందే. పచ్చి తెలంగాణ వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకొని ప్రజల ఆకాంక్షలపై నీళ్లు చల్లడమే లక్ష్యంగా పనిచేశాయి. కానీ తెలంగాణ సిద్ధించి, రాకెట్‌ వేగంతో దూసుకుపోతుంటే వాటికి కన్నుకుడుతున్నది. జలసిరితో కళకళలాడుతుంటే, పచ్చదనం పరచుకుంటుంటే జంట పత్రికలకు కంటగింపుగా ఉన్నది. టీడీపీ పూర్తిగా తెరమరుగు కావడం పుండుమీద కారం చల్లినట్టు ఉందేమో.. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి దిగుమతై పిచ్చి మాటలతో అధిష్ఠానానికి ఎసరు తెస్తున్న బాబు అనుంగు శిష్యుడు వీళ్లకు ఇష్టుడు. వాళ్లూ వీళ్లూ వాగే అవాకు లూ, చవాకులూ వండివారుస్తున్నాయి. ‘మేం బురద చల్లుతాం.. మీరు కడుక్కోండి’ అంటున్నాయి. ‘బట్టకాల్చి మీద వేయడం’ మా నీతి, రీతి అంటూ ఢంకా బజాయిస్తున్నాయి. వరుస పరాజయాలతో మూలన పడి మూల్గుతున్న విపక్షాలను భుజానికెత్తుకుని వీరంగం వేస్తున్నాయి. మచ్చుకు కొన్ని అంశాలను పరిశీలిస్తే జంట పత్రికల అసలు స్వరూపం అర్థమైపోతుంది..

గత నెల 23న ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఏడేండ్లలో తెలంగాణ సాధించిన ఆర్థిక అభివృద్ధిని కండ్లకు కట్టినట్టు వివరించారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయం ఎలా రెట్టింపయ్యింది, సొంత రాబడులు ఎలా పెరిగాయి, ఒకప్పుడు దండగ అన్న వ్యవసాయం స్వరాష్ట్రంలో పండగలా మారడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి ఇంజిన్‌లా ఎలా మారిందో అంకెలతో సహా వివరించారు.

ఈ వార్తకు ఆంధ్రజ్యోతి కనీస ప్రాధాన్యం ఇవ్వలేదు. పైగా ‘భూములమ్మి దళితబంధుకు నిధులిస్తాం’ అంటూ హెడ్డింగ్‌ పెట్టి వ్యతిరేక వార్తను ప్రచురించింది. వాస్తవానికి కరోనాతో ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రస్తుత పథకాలకు తోడుగా దళిత బంధుకు నిధులు ఎక్కడి నుంచి ఇస్తారని ఓ విలేకరి ప్రశ్నించగా అనేక మార్గాలు ఉన్నాయని, ఇందులో నిరర్ధక భూముల అమ్మకం ఒకటని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ చిన్న విషయాన్ని ఆంధ్రజ్యోతి భూతద్దంలో చూపడానికి ఉత్సాహపడింది.

ఈనాడు ‘ఏడేండ్లలో అద్భుత ప్రగతి’ అంటూ తూతూమంత్రంగా ఓ వార్తను రాసి చేతులు దులిపేసుకున్నది. మనసొప్పలేదేమో.. 2014-21 మధ్య జరిగిన అభివృద్ధిని వివరించే ప్రయత్నం పెద్దగా చేయలేదు.

‘నక్కలు బొక్కలు వెతుకును’ అన్నదే ఆ రెండు పత్రికల ధోరణి. వాటికి తెలిసిందల్లా ఒక్కటే.. తెలంగాణలో సమస్యల కోసం భూతద్దం వేసి వెదకడం.. వెలుగులను చూసి కండ్లల్లో నిప్పులు పోసుకోవడం.. గోరంతను కొండంతలు చేసి చూపించడం.. అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం.. అంతిమంగా తెలంగాణను బదనాం చేయడం.

తెలంగాణ ప్రజలపై ‘థాట్‌ పోలీసింగ్‌’

ఒక నిజాన్ని వందసార్లు అబద్ధమని చెప్పి ఒప్పించడం గోబెల్స్‌ ప్రచారం. దానిని తలదన్నే ‘థాట్‌ పోలీసింగ్‌’లో ఈ రెండు పత్రికలు దిట్టలు. ఎందుకూ చేతగానివాణ్ణి గొప్పోడని కీర్తిస్తూ అందలం ఎక్కించడం.. సమర్థుడి ఘనతను చాటకపోవడం.. ఇదీ వాటికి ఇష్టమైన పని. నచ్చని వ్యక్తుల పాలనలోని చిన్నచిన్న లోపాలను కొండంత చేసి చూపించి, ప్రజల మనసులలో విషబీజాలను నాటడం ఈ రెండు పత్రికల ైస్టెల్‌. టీఆర్‌ఎస్‌ అప్రతిహత జైత్రయాత్రతో మూలన పడి మూల్గుతున్న విపక్షాలను బలమైన శక్తులుగా చూపేందుకు వెనుకాడటం లేదు. తెలంగాణ అభివృద్ధిని చూసి బయటివారు ఔరా అంటే వీరు మాత్రం బొమ్మలో కోతిలా కండ్లు మూసుకుంటారు.

చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు దిక్కూమొక్కు లేని కంపెనీలు వచ్చి ఎంవోయూలు చేసుకుంటే చాలు… ఆహా, ఓహో అంటూ తెలంగాణ ప్రజలకు అవసరం లేకపోయినా బలవంతంగా కథనాలను రుద్దాయి ఈ రెండు పత్రికలు. మరి రాష్ట్రంలో మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో జరిగిన పారిశ్రామిక ప్రగతిని వివరించాలంటే మాత్రం పెన్ను కదలదు. ప్రపంచంలోని టాప్‌ కంపెనీలన్నీ తెలంగాణ బాట పడుతున్నా ఎంవోయూలకు ఇచ్చిన ప్రాధాన్యం కూడా ఇవ్వడం లేదు.

రాజన్న సిరిసిల్ల జిల్లా సోమవరంపేట గ్రామ సర్పంచ్‌ ఈ ఏడాది మే నెలలో అనారోగ్య కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా జిల్లా పంచాయతీ అధికారి నిర్ధారించారు. అయినా ఈనాడు మాత్రం ప్రభుత్వంపై విషం కక్కింది. అడ్డగోలుగా అటు తిప్పి.. ఇటుతిప్పి.. పిచ్చి రాతలు రాసింది. ప్రభుత్వం బిల్లులు పెండింగ్‌లో ఉంచడం వల్ల చికిత్సకు డబ్బులు లేక ఆత్మహత్య చేసుకున్నాడంటూ బీభత్సమైన కథ అల్లింది.

వాస్తవానికి గ్రామానికి సంబంధించి రూ.53వేల బిల్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నది. అది కూడా సెప్టెంబర్‌ నెలలో ఇచ్చిందే. అంటే ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవు. కిడ్నీ, ఇతర దీర్ఘకాలిక సమస్యలతో ఆయన మరణిస్తే ఈనాడు విచిత్రమైన కథ అల్లి ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నించింది. పైగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మొదటి పేజీలో బ్యానర్‌ వార్త వేసిన ఈనాడు.. దాన్ని ఖండిస్తూ, నిజాలు వివరిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు రాసిన లేఖను మాత్రం లోపలి పేజీలో ఎవరికీ కనిపించకుండా ఓ మూలన పడేసింది. ఇక ఆంధ్రజ్యోతి ఈ వార్తను సింగిల్‌ కాలమ్‌కు పరిమితం చేసింది. అలవాటైన ప్రాణం మరి!

తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ రెండు పత్రికలు థాట్‌పోలీసింగ్‌ను అమలు చేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధిని కీర్తిస్తే కనీస ప్రాధాన్యం ఇవ్వకుండా.. అవాస్తవాలతో బ్యానర్లు కడుతున్నాయి. ‘గాలికి గడ్డపారలు కొట్టుకపోయినయట’ అన్నట్టుగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి. ఇందుకు అనేక ఉదాహరణలు.

ఈ నెల 1న నీతిఆయోగ్‌ విడుదల చేసిన ఏడో ఎడిషన్‌ ‘అర్థ్‌నీతి’ నివేదికలో రాష్ట్ర ఆర్థికప్రగతిని ప్రత్యేకంగా ప్రశంసించింది. చిన్న రాష్ట్రమైనా బ్రహ్మాండంగా అభివృద్ధి సాధించిందంటూ కొనియాడింది. ఈ నివేదికను ప్రముఖంగా ప్రచురించాల్సి ఉండగా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి కనీసం ప్రస్తావించలేదు. రాష్ట్ర అభివృద్ధికి జాతీయ స్థాయిలో దక్కిన ప్రశంసను కనీసం పట్టించుకోలేదు.

తెలంగాణ ఆర్థిక ప్రగతిని ఆర్బీఐ సైతం ప్రశంసించింది. ఈ నెల 15న విడుదల చేసిన ‘హ్యాండ్‌ బుక్‌ స్టాటిస్టిక్స్‌ ఆన్‌ ఇండియన్‌ ఎకానమీ-2021’లో తెలంగాణ అభివృద్ధిని కండ్లకు కట్టింది. రాష్ట్ర నికర విలువ జోడింపులో (ఎన్‌ఎస్వీఏ) తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్నదని స్పష్టం చేసింది. అన్ని రంగాల్లోనూ ఏడేండ్లలో అద్భుత ప్రగతి సాధించిందని లెక్కలతో సహా వివరించింది.

ఇంతటి గొప్ప విషయాన్ని ఈనాడు అసలే పట్టించుకోలేదు. ఆంధ్రజ్యోతి కేవలం నాలుగు లైన్ల వార్తకు పరిమితం చేసింది.

ఈ నెల 7,8 తేదీల్లో పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ తెలంగాణలో పర్యటించింది. 7న బృందం టీహబ్‌ను సందర్శించి, అభినందించింది. తమిళనాడులోనూ టీ-హబ్‌ తరహాలో ఇంక్యుబేటర్‌ ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర ఎంపీ కార్తి చిదంబరం అన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ వార్తను కనీసం ప్రచురించలేదు.

ఉమ్మడి రాష్ట్రంలో జరిగిందేమిటి? చంద్రబాబు హయాంలో ఏం చేసినా అదొక అద్భుతం. రాష్ట్రంలో ఏ మూలన చిన్న రోడ్డు వేసినా.. ఒక్క భవనం నిర్మించినా.. ఒక్క కంపెనీని తీసుకొచ్చినా అద్భుతమైన అభివృద్ధి జరిగిపోతున్నదంటూ కథనాలు వండి వార్చేవి. ప్రజల మనసుల్లో ఆయనను బాహుబలి విగ్రహం అంత ఎత్తులో నిలబెట్టేందుకు తాపత్రయ పడ్డాయి. వారి సారువారు కాకుండా ఇంకెవరు అధికారంలో ఉన్నా ఆ రెండు పత్రికలకు కడుపు రగిలిపోతుంది.

చంద్రబాబు హయాంలో హైదరాబాద్‌ నగరంలో నాలుగైదు ఫ్లైఓవర్లకు మించి నిర్మించలేదు. అయినా ఈ రెండు పత్రికలు ‘హైదరాబాద్‌ను ఫ్లైఓవర్ల నగరంగా మార్చారు’ అంటూ ఆకాశానికి ఎత్తేశాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో ఎస్సార్డీపీ పేరుతో బృహత్తర ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఈ ఏడాది జూలై నాటికి నగరంలో ఏకంగా 11 ఫ్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు, 4 ఆర్‌యూబీ/ఆర్వోబీలు, ఒక కేబుల్‌ బ్రిడ్జి, ఒక స్టీల్‌ బ్రిడ్జిని పూర్తి చేశారు. ఈ 21 ప్రాజెక్టులు ఈ రెండు పత్రికల కంటికి కనిపించలేదు. వాటి ప్రారంభోత్సవాలపై చిన్న వార్తలు ఇవ్వడం మినహా.. ఎస్సార్డీపీ వల్ల నగర ప్రజలకు కలుగుతున్న లబ్ధి, ప్రాజెక్టు గొప్పదనాన్ని వివరిస్తూ కథనాలు రాసే ధైర్యం రావడం లేదు.

చంద్రబాబు ఒక్క హైటెక్‌ సిటీని నిర్మించినందుకే.. ‘హైదరాబాద్‌ను నిర్మించిన చంద్రబాబు’ అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి నిస్సిగ్గుగా ఇప్పటికీ ఆకాశానికి ఎత్తుతుంటాయి. కానీ గత ఏడేండ్లలో హైదరాబాద్‌లో వెలిసిన ఆకాశహర్మ్యాలు, జరిగిన అభివృద్ధి మాత్రం వాటికి కనిపించదు.

కరోనా మొదటి, సెకండ్‌వేవ్‌ సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్ని రకాల ప్రయత్నాలు చేశాయి. వైద్యం అందడం లేదని, మందులు లేవని, టెస్టులు చేయడం లేదని, మరణాల సంఖ్యను తప్పుగా చూపిస్తున్నారంటూ విష ప్రచారం చేశాయి. కరోనా కట్టడిలో టాప్‌లో నిలిచినా.. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని చెప్పినా.. అడ్డగోలు రాతలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి.

వ్యాక్సినేషన్‌ విషయంలోనూ రెండు పత్రికలు దుర్మార్గంగా వ్యవహరించాయి. రాష్ర్టాలకు టీకాల పంపిణీ కేంద్రం చేతుల్లో ఉందని తెలిసినా.. మొదట్లో కేంద్ర ప్రభుత్వం సహకరించక తక్కువ డోసులు పంపిందని తెలిసినా.. టీకాలు వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ అడ్డగోలుగా ప్రచారం చేశాయి.

రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రభుత్వం ఎక్కడా ప్రజలపై పన్నుల భారాన్ని మోపలేదు. మొట్టమొదటిసారిగా రెండు నెలల కిందట రిజిస్ట్రేషన్‌ చార్జీలను సవరించింది. ప్రతి ఒక్కరినీ దృష్టిలో పెట్టుకొని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఈ ధరలను సవరించింది. అయినా ఆంధ్రజ్యోతికి మాత్రం ఇది ‘బాదుడు’ మాదిరిగా కనిపించింది.

తెలంగాణ ప్రగతిని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనాదక్షతను, మంత్రి కేటీఆర్‌ నాయకత్వ పటిమను అనేక మంది కేంద్ర మంత్రులు నేరుగా, ట్విట్టర్‌ వేదికగా ప్రశంసించారు. ఈ రెండు పత్రికలకు అవేవీ కనిపించవు. తిట్టిన నోర్లను మాత్రం పెద్దవి చేసి చూపించేందుకు తహతహలాడుతుంటాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement