శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 20:33:29

వెదురుగట్ట అడవికి కేసీఆర్ వనంగా నామకరణం : మంత్రి గంగుల

వెదురుగట్ట అడవికి కేసీఆర్ వనంగా నామకరణం : మంత్రి గంగుల

కరీంనగర్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నీళ్లతోపాటు పచ్చదనం అంటే ఎంతో ఇష్టమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో హరితహారం, రైతు వేదికలు, కల్లాల నిర్మాణ పనుల పురోగతిపై ఎమ్మెల్యేలు, కలెక్టర్, అధికారులతో  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో అందమైన పూల మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. అడవుల పెంపకంలో జిల్లా వెనుకబడి ఉందని సీఎం ఆదేశాల మేరకు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో హరితహారంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.

కరీంనగర్‌ను హరిత వనంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. డీఎంఎఫ్టీ నిధుల నుంచి హరితహారానికి రూ.కోటి కేటాయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థకు రూ.50 లక్షలు, చొప్పదండి మున్సిపాలిటీకి రూ.30 లక్షలు, కొత్తపల్లి మున్సిపాలిటీకి రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని 14.5 కిలోమీటర్ల ప్రధాన రహదారులతోపాటు జిల్లా సరిహద్దుల వరకు ఉన్న ఆర్అండ్‌బీ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని అన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచన మేరకు వెదురుగట్ట అడవికి ‘కేసీఆర్ వనం’గా నామకరణం చేశారు. హరితహారంలో భాగంగా వెదురుగట్టలో అద్భుతంగా మొక్కలు నాటారని రవిశంకర్‌ను మంత్రి అభినందించారు. కురిక్యాల గ్రామంలో బొమ్మలగుట్టను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. 


logo