విద్యాసంస్థలను ఆదుకొంటాం

- కరెంట్ బిల్లుల్లో స్లాబ్ మార్పుపై చర్చించి నిర్ణయం
- ప్రైవేటు టీచర్ల సమస్య పరిష్కారానికి చర్యలు
- కేంద్రం ఒక్క విద్యాసంస్థనైనా ఇచ్చిందా?: మంత్రి కేటీఆర్
- విద్యాసంస్థల ఆధ్వర్యంలో ‘ఇంటరాక్షన్ విత్ కేటీఆర్'
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ: తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్‌ను అలజడులు, అశాంతి సృష్టించేవారి చేతుల్లోకి వెళ్లనీయొద్దని ఐటీ, పురపాలకశాఖమంత్రి కే తారకరామారావు ప్రజలను కోరారు. హైదరాబాద్‌లో ఎలాంటి నష్టం జరిగి నా రాష్ట్రం మొత్తం నష్టపోతుందని అన్నారు. అభివృద్ధి నమూనాలేని వ్యక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో మంగళవారం కేజీ టూ పీజీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ‘ఇంటరాక్షన్ విత్ కేటీఆర్' కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటికే నిర్వహించిన హైలెవల్ సమావేశంలో విద్యాసంస్థల సమస్యలను చాలావరకు పరిష్కరించుకున్నామని వెల్లడించారు. మిగిలినవాటిపై మరోసారి అధికారులతో సమావేశం నిర్వహించి చర్చిస్తామని భరోసా ఇచ్చారు. ప్రాపర్టీట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్లులకు వేరే స్లా బ్ ఇవ్వాలని విద్యాసంస్థలు డిమాండ్ చేస్తున్నాయని.. వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ‘గతనెలప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటుచేసుకున్నాం. కొన్ని సమస్యల పరిష్కారంపై చర్చించుకున్నాం. ఇక్కడే మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు.
వారితోపాటు మరో పదిమంది కలిసి రండి. మిగిలిన సమస్యలను కూడా చర్చించి పరిష్కరించుకుందాం’ అని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రైవేట్ టీచర్లు 4 లక్షల మందికిపైగా ఉన్నారని, వారంతా కరోనాకాలంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థలకు ఏవైనా రాయితీలు ఇచ్చి అందులోనుంచి టీచర్లకు న్యాయం జరిగేలా ఆలోచనలు కూడా చేస్తున్నామని తెలిపారు. ఇటీవల అన్ని మున్సిపాలిటీలకు ప్రాపర్టీ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చామని గుర్తుచేశారు. సినిమాహాళ్లు తెరిచారు.. బడులు కూడా తెరుస్తారా? అని పలువురు ఆడుగుతున్నారని.. విద్యార్థుల ప్రాణాలకు సంబంధించిన ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఆరేండ్లలో అరనిమిషం కర్ఫ్యూలేదు
తెలంగాణలో ఒక్కచిన్న ఘర్షణ కూడా లేదని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎక్కడా హిందూ ముస్లిం పంచాయితీ లేదని, ఆరేండ్లలో అరనిమిషం కూడా కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్థితి రాలేదని తెలిపారు. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌కు దిగ్గజసంస్థలు తరలివస్తున్నాయంటే శాంతిభద్రతలే కారణమని చెప్పారు. గూగుల్, అమెజాన్, ఆపిల్, ఊబర్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలు వస్తున్నాయంటే చిన్న విషయం కాదని చెప్పారు. గడిచిన నాలుగేండ్లలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు.
ఒక మతాన్ని మొత్తం టెర్రరిస్టులుగా చిత్రీకరించడం మంచిది కాదని, దేశంలో 32 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు.. వాళ్లు బతుకొద్దా? ఎందుకంత ద్వేషం? అని మంత్రి కేటీఆర్ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ నేతల మాటలు నమ్మొద్దని.. ప్రజలు అభివృద్ధి వైపు నిలబడాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ప్రభుత్వవిప్ బాల్క సుమన్, టీఆర్ఎస్ఎంఏ, టీపీజేఎంఏ, టీపీడీఎంఏ, ఇంజినీరింగ్, ఫార్మసీ, పారామెడికల్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, నర్సింగ్ కాలేజీల అసోసియేషన్ల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.
అడిగినవి ఎన్నో.. ఇచ్చింది సున్నా
విద్యాసంస్థలకు సంబంధించి కేంద్రాన్ని చాలా అడిగామని.. కానీ ఒక్కటి కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐఐఎం, ఎన్ఐడీ, కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ, రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, నవోదయ పాఠశాల ఇలా ఎన్నోఅడిగాం.. ఇందులో ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. 2013లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఐటీఐఆర్ మంజూరు చేసిందని.. తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే దానికి నిధులు ఇవ్వకపోగా ఏకంగా రద్దుచేసిందని చెప్పారు. దీంతో 15లక్షల మందికి ఉద్యోగావకాశాలు రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. అదానీ, అంబానీల కోసమే బీజేపీ పనిచేస్తున్నదని ఎద్దేవాచేశారు.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు