శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 02:40:11

మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే చర్యలు

మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే చర్యలు

  • ప్రైవేటు స్కూళ్లకు మంత్రి సబిత హెచ్చరిక
  • వారంలో ఇంగ్లిష్‌ మీడియం క్లాసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. చిన్నపిల్లల మానసిక స్థితికి భిన్నంగా క్లాసులు నిర్వహించే ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ క్లాసులపై ఉన్నతాధికారులతో తన కార్యాలయంలో బుధవారం మంత్రి సమీక్షించారు. డిజిటల్‌ క్లాసు ల నిర్వహణకు క్షేత్రస్థాయిలో తలెత్తే ఇబ్బందులను కలెక్టర్లు పరిష్కరించాలని సూచించారు. సమీక్షలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌, డైరెక్టర్‌ శ్రీదేవసేన, ఇంటర్‌బోర్డు సెక్రటరీ సయ్యద్‌ ఒమర్‌జలీల్‌ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. వారం రోజుల్లో ఇంగ్లిష్‌ మీడియంలో డిజిటల్‌ తరగతుల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నది. బుధవారం 80 శాతానికిపైగా విద్యార్థులు ఆన్‌లైన్‌లో పాఠాలు విన్నట్టు అధికారులు తెలిపారు.

20 వరకు స్కూళ్లు మూసి ఉంచాలి

అన్‌లాక్‌-4 మార్గదర్శకాలకు సంబంధించి ఈ నెల 20 వరకు స్కూళ్లు మూసి ఉంచాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. ఈ నెల 21 నుంచి 50 శాతం చొప్పున బోధన, బోధనేతర సిబ్బంది విధులకు హాజరు కావొచ్చన్న జీవో 190 అమల య్యేలా చూడాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బుధవారం పీఆర్టీ యూ, యూటీఎఫ్‌, ఎస్టీయూ నాయకులు విన్నవించారు.

నేటి నుంచి ఎంసెట్‌ హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌

 ఈ నెల 9 నుంచి 14 వరకు నిర్వహించనున్న ఎంసెట్‌ 2020 హాల్‌టిక్కెట్లను టీఎస్‌ఎంసెట్‌ వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేశామని సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. విద్యార్థులు గురువారం (ఈ నెల 3) నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. హాల్‌టిక్కెట్ల కోసం https://eamcet.tsche. ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

పాలిసెట్‌కు 77% హాజరు

రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశం కోసం బుధవారం నిర్వహించిన పాలిసెట్‌-2020కి 77% మంది విద్యార్థులు హాజరైనట్టు సాంకేతిక విద్య శిక్షణ మండలి కార్యదర్శి శ్రీనాథ్‌ తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహించనట్టు వెల్లడించారు.  మొత్తం 285 కేంద్రాల్లో పాలిసెట్‌ సాఫీగా సాగింది. ఈ నెల 10న ఫలితాలు విడుదల చేసి, 14 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్‌ 1 నుంచి ఫస్టియర్‌ తరగతులు ప్రారంభించడానికి రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యాచరణ రూపొందించింది. 

రెండోరోజు సాఫీగా జేఈఈ మెయిన్‌ పరీక్షలు

రాష్ట్రంలో జేఈఈ మెయిన్‌ పరీక్షలు రెండోరోజైన బుధవారం సాఫీగా సాగాయి. కరీంనగర్‌, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్లగొండతోపాటు రంగారెడ్డి జిల్లాలో  కేంద్రా లు ఏర్పాటు చేశారు. 


logo