ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 25, 2020 , 02:31:27

దళిత తేజాలు

దళిత తేజాలు

  • పేద బిడ్డలకు రాష్ట్ర సర్కారు దన్ను
  • ‘అంబేద్కర్‌ ఓవర్సీస్‌'తో విదేశాల్లో విద్య 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రైవేటు పాఠశాలల్లో చదువే కష్టం.. అలాంటిది విదేశాల్లో చదువు కోవడం.. ఆ వెంటనే అక్కడే ఉద్యోగం.. దీనిని కలలో కూడా ఊహించలేదా బిడ్డలు.. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిజం చేసింది.  విద్యతోనే నిరుపేద దళితకుటుంబాలు సామాజిక ఆర్థిక ప్రగతిని సాధించగలుగుతాయని భావించిన సీఎం కేసీఆర్‌ అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకాన్నిప్రారంభించారు. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకుంటున్న ఎస్సీ విద్యార్థులకు రూ.20 లక్షలను అందించి ప్రోత్సహిస్తున్నది. ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి కింద 603 మందిని ఎంపిక చేయగా అందులో 516 (85.57శాతం) మంది ఉన్నత విద్యాకోర్సులు పూర్తిచేశారు. వీరందరికోసం ప్రభుత్వం రూ.87.50 కోట్లు వెచ్చించింది. ఈ పథకం కింద సాయం పొంది చదువుకొని విదేశాల్లో ఉద్యోగాలు దక్కించుకున్న తెలంగాణ విద్యార్థుల మనోగతమిది.

ఐటీ ప్రోగ్రామర్‌గా.. 

మాది మధ్యతరగతి కుటుంబం. స్వతంత్రంగా ఎదగాలని చిన్నప్పటి నుంచి కలలుగనేదాన్ని. అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యా పథకంతో అది సాకారమైంది. యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిడ్జ్‌ పోర్ట్‌లో ఎంఎస్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తిచేశాను. ప్రస్తుతం జెర్సీ టెక్నాలజీ పార్ట్‌నర్స్‌ సంస్థలో ఐటీ ప్రోగ్రామర్‌ అనలిస్ట్‌గా పనిచేస్తున్నాను. ఈ పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.

- దివ్య శాంతి, యూఎస్‌ఏ

పేద విద్యార్థులకు సాయం చేస్తా

నేను అమెరికాలోని డల్లాస్‌ నగరంలోని బాప్టిస్ట్‌ విశ్వ విద్యాలయంలో మాస్టర్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేశాను. ప్రస్తుతం డల్లాస్‌లోని డెల్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా.  అంబేద్కర్‌ ఓవర్సీస్‌ పథకం నా జీవిత గమనాన్ని మార్చింది. ప్రభుత్వం అందించిన సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను. ప్రభుత్వం ఇచ్చిన స్ఫూర్తితో విదేశాల్లో చదువుకోవాలనుకునే పేద విద్యార్థులెవరికైనా నా వంతు సాయం చేస్తా. 

-కే సింధూజ, డల్లాస్‌, యూఎస్‌ఏ

నా జీవితాన్ని మార్చింది 

అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యాపథకం నాజీవితాన్ని మార్చింది. వృత్తినైపుణ్యాన్ని మెరుగుపరచుకునేందుకు కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదివేందుకు విశ్వవిద్యాలయ రుసుం, విమాన చార్జీలు, వీసా దరఖాస్తు రుసుం ప్రభుత్వమే చెల్లించింది. ఈ అవకాశం కల్పించిన  సీఎం కేసీఆర్‌, ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారులకు కృతజ్ఞతలు. పీజీ కోర్సు పూర్తి చేసిన నేను కాలిఫోర్నియాలోని ఓ ప్రముఖ సంస్థలో ప్రాజెక్టు మేనేజర్‌గా ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నాను.

- భాస్కర్‌ నీరాటి, కాలిఫోర్నియా, యూఎస్‌ఏ

ఓవర్సీస్‌ పథకంతోనే..

అమెరికాతో పోల్చితే ఆస్ట్రేలియాలో ఫీజులు ఎక్కువే. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అంబేద్కర్‌ ఓవర్సీస్‌ పథకంతో మెల్‌బోర్న్‌లోని ఆస్ట్రేలియాలో ఐటీ ఎంటర్‌ప్రైజెస్‌ సిస్టమ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశాను. ప్రస్తుతం స్పెక్ట్‌సేవర్స్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు వీలుగా సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం అభినందనీయం.

- జె.పులి వందన, ఆస్ట్రేలియా