e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home తెలంగాణ దళితుల ఆత్మ‘బంధు’వు

దళితుల ఆత్మ‘బంధు’వు

స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా నేటికీ దేశంలోని 28 కోట్ల మంది దళితులు సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనంలో మగ్గుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది, అంతరిక్షంలోకి అడుగుపెడుతున్నా అనేక గ్రామాల్లో వివక్ష రాజ్యమేలుతున్నది. దళితులు ఎటువంటి ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల ఆకలితో అలమటిస్తున్నారు. కులవ్యవస్థ దోపిడీ, అణచివేతలే దళితుల అంటరానితనం, ఆకలి, పేదరికానికి కారణమని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆనాడే అన్నారు. కులవివక్ష కారణంగా దళితులు భూమిలేని వ్యవసాయ కూలీలుగా జీవించటం, తప్పనిసరి పరిస్థితుల్లో వారి పిల్లలు బాలకార్మికులుగా మారటం సర్వసాధారణమైంది. దేశంలో దళితులు నేటికీ వెట్టిచాకిరి, సఫాయి, కర్మచారి వంటి అమానవీయ వృత్తుల్లో మగ్గిపోతున్నారు.

అంబేద్కర్‌ దార్శనికత మూలంగా రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆకలి, పేదరికం అసమానతల్లేని సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దళితుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నది. ఏండ్ల తరబడి సమాజంలో వివక్ష, అణచివేతకు గురవుతున్న దళితుల ఉద్ధరణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నడుం బిగించారు. దళితుల అభ్యున్నతితోనే పురోగతి సాధ్యమని భావించిన కేసీఆర్‌ ‘దళితబంధు’ పేరిట వినూత్న పథకం ప్రకటించడం గర్వకారణం. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని అందించనున్నామని సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో దళితవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -

ఏ రాష్ట్రంలో లేనివిధంగా దళితులు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేలా సీఎం కేసీఆర్‌ ‘దళితబంధు’ పేరిట బృహత్తర పథకాన్ని తీసుకువచ్చారు. తెలంగాణ దళిత సమాజాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిపరిచి, వారి జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకురావడమే కేసీఆర్‌ లక్ష్యంగా కనిపిస్తున్నది. దళితుల జీవితాల్లో వెలుగులు విరజిమ్మేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించడం ముదావహం. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుపరుచుకుంటూ తద్వారా దళితుల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపర్చాలన్నది ప్రభుత్వ ఆశయం. దళితులు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందడానికి మరిన్ని పథకాలు ప్రవేశపెట్టాలని భావించడం శుభపరిణామం.

దళితుల్లో పేదరికం ఆకలి, అసమానతలనేవే లేకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవడానికి రానున్నకాలంలో ‘దళిత బంధు’ పథకం ద్వారా రూ.లక్ష కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయబోతున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడం సంతోషదాయకం. దీనికితోడు కార్పస్‌ ఫండ్‌ను కూడా ఏర్పాటుచేయబోతున్నట్లు ప్రకటించారు. దళారీ వ్యవస్థ లేకుండా లబ్ధిదారులకే నేరుగా ఆర్థికసాయం అందించాలని అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని పటిష్ఠంగా రూపకల్పన చేసి, అమలుచేయడం వల్ల ఆశించిన ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు. దళితులు అన్నిరంగాల్లో ముందడుగు వేసేందుకు ఈ పథకం ప్రధాన భూమిక పోషిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో దళితులకు బతుకుదెరువు లేదు. దీంతో తమ పిల్లల భవిష్యత్తు ఆగమైపోతుందేమోనని తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రుల్లో సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చిన ‘దళిత బంధు’ పథకం కొత్త ఆశలు రేకెత్తించింది. తమ పిల్లల భవిష్యత్తు ఇక బంగారుమయం అవుతుందని దళితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వ సామాజిక, ఆర్థిక విధానాల్లో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయాలు ఇమిడి ఉన్నాయి. ఆయన చూపిన దారిలోనే తెలంగాణ ప్రభు త్వ పథకాలు అమలవుతున్నాయనడంలో సందేహం లేదు. దళిత, గిరిజనుల కోసం ప్రత్యేక ఉప ప్రణాళికల అమలు, ‘తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రాం ఫర్‌ రాపిడ్‌ ఇంక్యుబేషన్‌ ఆఫ్‌ దళిత్‌ ఎంట్రప్రెన్యూర్‌’ ద్వారా ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.

పారిశ్రామిక స్థలాల కేటాయింపు ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్నది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో రాజకీయ రిజర్వేషన్లను అమలుచేస్తున్నది. ఎస్సీ, ఎస్టీల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక గురుకులాలను ఏర్పాటుచేసింది. విదేశీ విద్యా నిధి ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నది. 2017లో 200 మంది ఎస్సీ, ఎస్టీ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ‘నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ హైదరాబాద్‌’ ద్వారా శిక్షణనిచ్చి కాంట్రాక్ట ర్లుగా తయారుచేసి లైసెన్సులు కూడా అందించింది. అన్నిరంగాల్లో దళితులు అభివృద్ధి చెందాలంటే ఆర్థిక స్వావలంబనే ప్రధానమని అంబేద్కర్‌ భావించారు. 1942లో దళితులకు సివిల్‌ కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్లు అమలుచేయాలని బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌కు వినతిపత్రం ఇచ్చారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లయినా ఆ మహనీయుని కల నేటికీ నెరవేరలేదు. కానీ సీఎం కేసీఆర్‌ దార్శనికత వల్ల రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్‌ 59/2017 ద్వారా ఎస్సీ, ఎస్టీలకు కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్లు కల్పించి వాటిని అమలుచేస్తున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా జీహెచ్‌ఎంసీలో జెట్టింగ్‌ మిషన్‌ ద్వారా ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడమే ఉదాహరణ.

ఈ బృహత్తర ‘దళితబంధు’ పథకం బడుగులకు నిజమైన బంధువుగా భరోసానిస్తుందనడంలో సందేహం లేదు. రాష్ట్రంలోని అనేక దళిత కుటుంబాలు ఆర్థిక, ఆరో గ్య, అక్షరం దిశగా స్వావలంబన సాధించబోతున్నాయి. ఇక ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకొని దళితు లు తమ మెరుగైన జీవన ప్రమాణాలను మెరుగుపర్చు కుంటూ, ఆత్మగౌరవంగా జీవిస్తూ, ధనవంతులుగా మారడమే తరువాయి.

బి.వెంకటయ్య
(జోనల్‌ కో- ఆర్డినేటర్‌, డిక్కి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana