e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home ఎడిట్‌ పేజీ నాటిదే ఈ దళితబంధుత్వం

నాటిదే ఈ దళితబంధుత్వం

నాటిదే ఈ దళితబంధుత్వం

‘దళితవాడల నుంచి దారిద్య్రాన్ని పారదోలడమే దేశానికి నిజమైన స్వాతంత్య్రం’ అని కేసీఆర్‌ చెప్పారు. ఈ మాటలను నిజం చేయటంలో భాగమే ‘దళితబంధు పథకం’. తరాలుగా అణచివేతకు, దోపిడీకి గురవుతున్న దళితజాతి జీవితాల్లో వెలుగులు నింపడమంటే వాళ్లు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు సహకరించడమే. సాధికారతకు నిర్వచనం కూడా వారి జీవితాల్లో సమూలమైనమార్పును కోరుకోవడమే. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న దళితులకు ‘దళితబంధు’ నిజంగా ఆత్మబంధువే.

దేశానికి స్వాతంత్య్రం రాకముందు అంబేద్కర్‌ దళితులకు కాంట్రాక్టు టెండర్లలో అవకాశం కల్పించాలని బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌కు లేఖ రాశారు. అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగానే దళితుల అభివృద్ధికి కేసీఆర్‌ ప్రణాళికలు రూపొందించి అమలుచేయడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ క్రమంలోనే సింగరేణి సంస్థలో కాంట్రాక్టు టెండర్లలో దళితులకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించి ఆర్థికం గా భరోసా ఇచ్చింది.

- Advertisement -

తెలంగాణ ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పుడే కేసీఆర్‌ ప్రతి అంశాన్ని అధ్యయనం చేశారు. తెలంగాణ ఎట్లా ఉండాలో ఒక బ్లూ ప్రింట్‌ సిద్ధం చేశారు. ముఖ్యంగా తెలంగాణలో మెజారిటీ వర్గాలైన దళిత, గిరిజన, బహుజన, మైనారిటీలకు తెలంగాణ రాష్ట్ర ఫలాలను అందించేందుకు ఎన్నో పథకాలను తీసుకువచ్చి కేసీఆర్‌ విజయవంతంగా అమలు చేస్తున్నారు. పేద ప్రజలకు కేసీఆర్‌ అందిస్తున్న ఆసరా పింఛన్‌ గానీ, పేదింటి ఆడపిల్లల పెండ్లిళ్లకు సాయపడుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం గానీ వారి జీవితాల్లో వెలుగులు నింపేవే.

చాలామంది అనుకుంటున్నట్లు, కొందరు ఆరోపిస్తున్నట్లు కేసీఆర్‌కు దళితుల సంక్షేమం గురించి ఆలోచన ఈ రోజే ఆకాశం నుంచి ఊడిపడలేదు. రాజకీయ లబ్ధి కోసం నేడు దళితబంధు పథకం రూపొందలేదు. మొదటినుంచీ దళిత సంక్షేమం పట్ల నిబద్ధత ఉన్న నేతగా కేసీఆర్‌ రూపకల్పన చేసిందే ఈ పథకం. దళితుల సాధికారత, సంక్షేమం విషయంలో కేసీఆర్‌కు మొదటి నుంచీ ప్రత్యేక శ్రద్ధ, పట్టింపు ఉన్నది. ఆయన ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా దళితుల అభ్యున్నతికోసం వినూత్నంగా ఆలోచించారు. పథకాలు రూపొందించి అమలుచేశారు. ఆ క్రమంలోనే.. 1983లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటినుంచీ దళితుల కోసం ప్రత్యేక కార్యాచరణతో ప్రజలకు చేరువయ్యారు. 1985 లో ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుంచీ దళిత, బహుజనుల సంక్షేమం పట్ల నిరంతరం ఆలోచించారు. తనదైన పరిధిలో వినూత్న కార్యాచరణతో ముందుకుపోయారు. 1997లోనే కేసీఆర్‌ చిన్నకోడూరు మండలంలోని పెద్దకోడూరు, నంగునూరు మండలంలోని మగ్దుంపూర్‌, సిద్దిపేట మండలంలోని బండచర్లపల్లిలో ‘దళిత చైతన్య జ్యోతి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాడే గ్రామ ప్రజలను ఏకం చేసి నియంత్రిత సాగు దిశగా చైతన్యపరిచి నాలుగు గ్రామాల్లో ఉమ్మడి వ్యవసాయ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆ కాలంలోనే పెద్దకోడూరు, మగ్దుంపూర్‌, రాఘవాపూర్‌ గ్రామాల్లో దళితులకు ట్రాక్టర్లు అందజేశారు. దళితులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అప్పుడే చొరవతో కార్యాచరణకు పూనుకోవటం గమనార్హం.

పేద ప్రజల ఆరోగ్య వసతుల్ని మెరుగుపరచడం, ‘కేసీఆర్‌ కిట్‌’ వంటి పథకాలు ఒక ఎత్తయితే, అంబేద్కర్‌ చెప్పినట్టు జ్ఞానం మాత్రమే అన్నింటికీ మూలం అనే సిద్ధాంతంతో దళిత బహుజన మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించాల నే మహోన్నత లక్ష్యంతో అన్ని నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటుచేయడం మరో ఎత్తు. ఒకతరం నాణ్యమైన విద్యను అభ్యసిస్తే ఆ తరం ఒక మంచి భవిష్యత్తుకు విత్తనం వేసినట్లే. గిరిజన గూడెం నుంచి ఎవరెస్టు శిఖరం ఎక్కాలనే ఆత్మస్థయిర్యం, ప్రపంచమే నివ్వెరపోయేలా ఇంగ్లిష్‌ మాట్లాడే సత్తా, ప్రపంచంలోనే పేరెన్నికగన్న విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొంది పెద్దపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన అద్భుతాలెన్నో గురుకులాలతో ఆవిష్కరింపబడ్డాయి. దళితుల సంక్షే మం, అభివృద్ధిలోనే కాదు ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో కూడా తెలంగాణ ముందున్నది. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు ద్వారా దళితుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరంగా ప్రభుత్వం కృషిచేస్తున్నది.

దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది నాయకులు, అనేక పార్టీలు.. కేవలం ఎన్నికల్లో దళితుల ఓట్లు పొందేందుకు తాత్కాలిక తాయిలాల కోసం ఆలోచించారే తప్ప, దళితుల కుటుంబాల్లో సమూలమైన మార్పు కోసం ఎవరూ ప్రయత్నించలేదు. దేశంలో ఏ నాయకుడు ఆలోచించని రీతిలో పేద, దళిత ప్రజల జీవన విధానంలో గుణాత్మకమైన మార్పు కేవలం ఆర్థికప్రగతి ద్వారా సాధ్యమవుతుందని ఈ దళితబంధు పథకాన్ని ఈ రోజు కేసీఆర్‌ రూపొందించటం గమనార్హం.

అన్నివర్గాల సమగ్రాభివృద్ధితో మాత్రమే తెలంగాణ అభివృద్ధి అని విశ్వసించే నాయకుడు కేసీఆర్‌. అందుకే ఎన్నో ఏండ్లుగా వివక్షతో పేదరికంలో మగ్గుతున్న దళిత జాతికి ఒక గొప్ప సాంత్వన ఈ ‘దళిత బంధు’ రూపంలో అందబోతున్నది. స్వశక్తితో దళిత కుటుంబాలు ఎదిగేందుకు ‘దళితబంధు’ ఎంతో సహకరిస్తుందని యావత్‌ దళిత సమాజం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నది. దళిత ప్రజా ప్రతినిధులను, ప్రతిపక్ష నాయకులను, దళిత మేధావులను పిలిచి లోతైన చర్చ జరిపి ఈ పథకాన్ని కేసీఆర్‌ రూపొందించారు. దళితబంధు పథకానికి ఊరూ వాడ స్వాగతం పలుకుతున్నది. తమ బతుకుల్లో దళితబంధు కొత్త వెలుగులు నింపబోతుందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నది. దళిత కుటుంబాల్లోని పేదరికాన్ని పారదోలి వెలుగులు విరజిమ్మే బంగారు తెలంగాణ దళితవాడలో వికసించబోతున్నది. కేసీఆర్‌ సామాజిక స్ఫూర్తికి, చిత్తశుద్ధికి యావత్‌ తెలంగాణ దళిత సమాజం కృతజ్ఞతలు చెప్తూ జేజేలు పలుకుతున్నది.
(వ్యాసకర్త: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌)

డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాటిదే ఈ దళితబంధుత్వం
నాటిదే ఈ దళితబంధుత్వం
నాటిదే ఈ దళితబంధుత్వం

ట్రెండింగ్‌

Advertisement