సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 02:26:10

ఎంబీఎస్‌ జ్యువెలరీస్‌కు 222 కోట్ల జరిమానా

ఎంబీఎస్‌ జ్యువెలరీస్‌కు 222 కోట్ల జరిమానా

  • సంస్థ డైరెక్టర్‌ సుఖేశ్‌గుప్తాకు రూ.22 కోట్ల వడ్డన
  • ఫెమా చట్టాల ఉల్లంఘన కేసులో షాకిచ్చిన ఈడీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిబంధనలకు విరుద్ధంగా హాంకాంగ్‌కు వజ్రాలను ఎగుమతి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంబీఎస్‌ జ్యువెలరీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు, సంస్థ డైరెక్టర్‌ సుఖేశ్‌గుప్తాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) భారీ జరిమానా వి ధించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి, విదేశీ కంపెనీతో వ్యాపార లావాదేవీలు నిర్వహించినందుకు ఎంబీఎస్‌ జ్యువెలరీస్‌ రూ. 222.44 కోట్లు, సుఖేశ్‌గుప్తా వ్యక్తిగతంగా రూ.22 కోట్లు జరిమానా చెల్లించాలని ఈడీ మంగళవారం ఆదేశాలు జారీచేసింది.  హాం కాంగ్‌లోని లింక్‌ఫై అనే సంస్థకు తన కం పెనీ ద్వారా రూ.220 కోట్ల విలువైన వజ్రాలను 2013లో పం పానని, ఇంకా డబ్బులు రావాల్సి ఉన్నందున ప్రభుత్వానికి పన్నులు చెల్లించలేదని గతంలో సుఖేశ్‌గుప్తా చెప్పినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ లావాదేవీలకు సంబంధించి లింక్‌ఫై కంపెనీపైనా నిఘా పెట్టినట్టు చెప్పారు. ఈ జరిమానా మొత్తాలను తమ ఆదేశాలు అందిన 45 రోజు ల్లోపు ‘జాయింట్‌ డైరెక్టర్‌, ఈడీ, హైదరాబాద్‌ కార్యాలయం పేరిట డీడీలు తీసి ఫతేమైదాన్‌, శక్కర్‌భవన్‌లోని ఈడీ కార్యాలయంలో అందజేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సుఖేశ్‌గుప్తా ఇప్పటికే రూ.216 కోట్ల విలువైన మెటల్స్‌, మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ కుంభకోణం కేసులోనూ నిందితుడు.