బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Apr 17, 2020 , 09:04:11

గల్ఫ్‌లో ఉపాధికి గండి!

గల్ఫ్‌లో ఉపాధికి గండి!

  • కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు విలవిల
  • 25% ఉద్యోగాలకు కోత
  • 3.72 లక్షల తెలంగాణవారికి దెబ్బ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారి ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ప్రపంచదేశాలను దెబ్బతీస్తున్నది. దీంతో దాదాపు అన్ని దేశాల్లో ఉద్యోగాలు తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు. అదే జరిగితే గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణవాసులు భారీగా నష్టపోనున్నారు. కనీసం 25 శాతం మేర ఉపాధికి గండిపడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, కువైట్‌, ఒమన్‌, ఖతర్‌, బహ్రెయిన్‌ దేశాల్లో 87,64,829 మంది భారతీయులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. వీరిలో తెలంగాణకు చెందినవారు 17శాతం (14.90 లక్షలు) వరకు ఉన్నారు. వీరిలో 25 శాతం మంది ఉపాధి కోల్పోయేట్లయితే 3.72 లక్షల మంది రానున్న ఆరునెలల్లో తిరిగి తమ స్వస్థలాలకు వచ్చేయాల్సి ఉంటుంది. వీరు ప్రస్తుతం తెలంగాణలోని తమ కుటుంబాలకు నెలకు సగటున రూ.520 కోట్ల వరకు పంపుతున్నట్టు అంచనా. గల్ఫ్‌లో ఉపాధి అవకాశాలు ఆకస్మికంగా కోల్పోవడం ఇది మొదటిసారికాదు. 1990-91లో జరిగిన గల్ఫ్‌ యుద్ధం, అక్రమ నివాసులకు క్షమాభిక్ష పథకం, ముడిచమురు ధరలు పతనం కావడం, ఆర్థిక మాంద్యం, కంపెనీల దివాళా, ఇరాక్‌ - లిబియా - యెమెన్‌లో ఘర్షణలు తదితర కారణాల వల్ల గల్ఫ్‌లో ఉపాధి కోల్పోయి స్వరాష్ట్రం బాట పట్టారు. 

కేంద్రం ఆదుకోవాలి

గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోల్పోయి స్వదేశం వచ్చేవారికి కేంద్ర ప్రభుత్వం పునరావాసం కల్పించాలని, వారికోసం రీసెటిల్మెంట్‌ పథకాలను రూపొందించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఓ ప్రత్యేక విభాగాన్ని లేక సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటుచేయాలన్నారు. తిరిగివచ్చేవారిలో కొంత నైపుణ్యం, అనుభవం ఉంటుందని, వారి వద్ద కొద్దిపాటి పెట్టుబడి సామర్థ్యం కూడా ఉండే అవకాశం ఉంటుందని.. ఈ కోణంలో ప్రభుత్వం వారికి పునరావాసం కల్పించేందుకు ప్రయత్నించాలని వారు సూచిస్తున్నారు. 

భద్రత, భరోసాతో కూడిన ఉపాధి అవకాశాలు కావాలి

భద్రత, భరోసాతోకూడిన ఉపాధి లభిస్తున్నందునే భారతీయులు గల్ఫ్‌దేశాలకు పనులకోసం వెళ్లారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి వీరిలో చాలామంది స్వదేశానికి వచ్చే అవకాశముంది. గల్ఫ్‌లో పనిచేసే భారతీయులకు అంతర్జాతీయస్థాయి అనుభవం ఉంటుంది. నిర్మాణరంగం, రోడ్లు, భవనాలు, హౌసింగ్‌, మరమ్మతులు, నిర్వహణ వంటి రంగాల్లో వారి వృత్తి నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడంద్వారా వారికి పునరావాసం కల్పించవచ్చు.

-పాట్కూరి బసంత్‌రెడ్డి, గల్ఫ్‌ తెలంగాణ వెల్ఫేర్‌, కల్చరల్‌ అసోసియేషన్‌


logo