బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 15:10:31

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహిస్తోంది. గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈసీ వేర్వేరుగా సమావేశం అవుతోంది. వార్డుల వారీగా ఓటరు జాబితా తయారీ, పోలింగ్‌ కేంద్రాల ఖరారు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అభ్యర్థుల వ్యయం తదితర అంశాలపై ఆయా పార్టీల నేతలతో చర్చిస్తోంది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్‌ పార్థసారధితో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేత భరత్‌  సమావేశమయ్యారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను సేఫ్‌గా జరపాలని, ఎన్నికల ప్రక్రియలో కొవిడ్‌ నియమాలు పాటించాలని కోరారు.

అలాగే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.5లక్షలు, మున్సిపాలిటీల పరిధిలో రూ.2.5లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, దివ్యాంగులు, కొవిడ్‌ రోగులకు ప్రత్యేక వసతులు, పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే పోలింగ్‌ కేంద్రాలు విశాలంగా ఉండేలా చూడాలని ఈసీని కోరినట్లు శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. అలాగే సోషల్‌ మీడియాలో ఎన్నికల కథనాలపై దృష్టి పెట్టాలని కోరినట్లు టీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రెటరీ భరత్‌ తెలిపారు. సోషల్‌ మీడియాతో ఓటర్లు ప్రలోభాలకు గురవుతున్నారని, సోషల్‌ మీడియా కట్టడికి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అంతకు ముందు బీజేపీ నుంచి ఎన్వీఎస్‌ ప్రభాకర్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఈసీతో సమావేశమయ్యారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.