మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 03:39:41

క్రెడిట్‌ కార్డులో కాసులు మాయం

క్రెడిట్‌ కార్డులో కాసులు మాయం

  • తొలి లావాదేవీతోనే సైబర్‌ దొంగల కుచ్చుటోపీ
  • అప్రమత్తంగా లేకపోతే అప్పుల భారం తప్పదు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కొత్తగా క్రెడిట్‌ కార్డుకు దరఖాస్తు చేశారా? పది, పదిహేను రోజుల్లోనే కార్డు మీ చేతికి అందిందా? కార్డు అందిన కొన్ని గంటలకే గుర్తు తెలియని వ్యక్తి నుంచి బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ను అంటూ ఫోన్‌ వచ్చిందా? ఫోన్‌లో అడగ్గానే వివరాలన్నీ చెప్పేశారా? అయితే, మీరు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. క్రెడిట్‌ కార్డులే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు దాడులు చేస్తూ, జేబుకు చిల్లు పెట్టి అప్పుల భారాన్ని మీ నెత్తిన పడేస్తారు. కొత్త క్రెడిట్‌ కార్డు అప్‌డేట్‌ అంటూ అమాయకుల నుంచి వివరాలు తెలుసుకొని, కార్డు ఉపయోగించేలోపే కార్డు క్రెడిట్‌ లిమిట్‌ను సున్నా చేసేస్తున్న ఘటనలు హైదరాబాద్‌లో ఈ మధ్య ఎక్కువగా చోటుచేసుకొంటున్నాయి.  

మోసం చేస్తున్నారిలా..

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని మల్కాజిగిరికి చెందిన రాజుకు ఇటీవల కొత్త క్రెడిట్‌ కార్డు వచ్చింది. ఆపదలో అక్కరకొస్తుందని దాచిపెట్టుకొన్నాడు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ను అంటూ అతడికి ఫోన్‌ వచ్చింది. క్రెడిట్‌ కార్డు అప్‌డేట్‌ చేయాలి.. మీ కార్డు నంబరు, గడువు ముగిసే తేదీ, సీవీవీ, ఓటీపీ, పిన్‌ నంబర్‌ చెప్పండి.. అని అనగానే అన్నీ చెప్పేశాడు. ఫోన్‌ కట్‌ చేశాడో లేదో.. వరుసగా మెసేజ్‌లు వచ్చాయి. చూసేసరికి రూ.68 వేలు కార్డులోంచి మాయం అయ్యాయి. షాకైన రాజు వెంటనే సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. రాజు ఒక్కడే కాదు.. ఇతడిలాంటి వారినెందరికో కుచ్చుటోపీ పెడుతున్నారు సైబర్‌ నేరగాళ్లు.

కార్డు వచ్చినట్టు ఎలా తెలుస్తున్నది?

కొత్త క్రెడిట్‌ కార్డు వచ్చిందన్న విషయం సైబర్‌ నేరగాళ్లకు ఎలా తెలుస్తున్నది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్యాంకుల్లో క్రెడిట్‌కార్డులకు సంబంధించిన వ్యవహారాల బాధ్యతను ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తారని, వాటిని వినియోగదారుడికి అందజేసేవరకు వివరాలన్నీ వాళ్లే చూస్తారని తెలిసింది. క్రెడిట్‌కార్డు డెలివరీ చాలావరకు కొరియర్‌ ద్వారా జరుగుతుండటంతో కొత్త క్రెడిట్‌కార్డు డెలివరీ విషయాలు, ఫోన్‌ నంబర్లను వాళ్ల నుంచి సేకరిస్తున్నారనే అనుమానం కలుగుతున్నది. క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డు అప్‌డేట్‌ పేరుతో వచ్చే ఫోన్‌ కాల్స్‌కు స్పందించవద్దని పోలీస్‌ అధికారులు సూచిస్తున్నారు.