బుధవారం 27 మే 2020
Telangana - May 21, 2020 , 19:35:28

కరోనా మొబైల్‌ ఐసీయూ ప్రారంభం

కరోనా మొబైల్‌ ఐసీయూ ప్రారంభం

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటున్నది. కంటైన్మెంట్‌లో ఉంటున్న వ్యాధిగ్రస్థులకు అన్నిరకాల  మౌలిక సేవలు అందిస్తూ అన్నివిధాలుగా ఆదుకొంటున్నది. ఈ నేపథ్యంలో ఎన్ని కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు వీలుగా గచ్చీబౌలిలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను దవాఖానగా మార్చారు. ఎప్పటికప్పుడు కరోనా పేషెంట్ల బాగోగులు తెలుసుకొంటున్న ప్రభుత్వం.. త్వరలో 1,500 వెంటిలేర్లను అందుబాటులో ఉంచనున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. గురువారం గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ తయారుచేసిన కరోనా మొబైల్‌ ఐసీయూను ఈటల ప్రారంభించారు. ప్రముఖ ఐటీ  సంస్థ మైక్రాన్‌ వంద వెంటిలేటర్లను ఇచ్చేందుకు ముందుకు రాగా, ప్రభుత్వం మరో 400 వెంటిలేటర్లను త్వరలో సిద్ధంగా ఉంచనున్నదని తెలిపారు. మరో వేయి వెంటిలేటర్ల కోసం ఆర్డర్‌ పెట్టామని పేర్కొన్నారు. 


ఈ సందర్భంగా కరోనా పేషెంట్ల కోసం మొబైల్‌ ఐసీయూ యూనిట్‌ను ఏర్పాటుచేసిన గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులను మంత్రి ఈటల అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డితోపాటు, ఫౌండేషన్‌ సీఈవో చిన్నబాబు సుంకవల్లి తదతరులు పాల్గొన్నారు. క్లిష్టమైన సంరక్షణ సౌకర్యాలను ఈ ఐసీయూలో అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా  రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో బస్సు ఆధారిత వెంటిలేటర్‌ అమర్చిన ఐసీయూలు అవసరం రానున్నాయి. ఈ యూనిట్‌లో వెంటిలేటర్లతోపాటు ఇమేజింగ్‌ పరికరాలు, టెలి-రేడియాలజీ, ఈ-ఐసీయూ, ఆల్ట్రాసౌండ్‌, ఏఐ ఆధారిత రిస్క్‌ స్ట్రాటిఫికేషన్‌, కాంటాక్ట్‌లెస్‌ శాంపిల్‌ కలెక్షన్‌ సిస్టమ్స్‌ ఉన్నాయి.


logo