e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home Top Slides ఈటల కబ్జాలో అసైన్డ్‌.. నిజమే

ఈటల కబ్జాలో అసైన్డ్‌.. నిజమే

ఈటల కబ్జాలో అసైన్డ్‌.. నిజమే
  • 65 ఎకరాలు అన్యాక్రాంతం.. మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌ వెల్లడి
  • మంత్రి భూ ఆక్రమణలపై అచ్చంపేటలో సాగిన విచారణ
  • బాధితులతో విజిలెన్స్‌, ఏసీబీ, రెవెన్యూ అధికారుల భేటీ
  • సీఎస్‌కు నివేదిక సమర్పణ.. నేడో రేపో ముఖ్యమంత్రికి

మెదక్‌/ వెల్దుర్తి/ మనోహరాబాద్‌/ హైదరాబాద్‌, మే 1 (నమస్తే తెలంగాణ): మంత్రి ఈటల రాజేందర్‌ భూ కబ్జాలు నిజమేనని తేలింది. మంత్రి ఈటల 65 ఎకరాల సీలింగ్‌ భూమిని కబ్జా చేసినట్టు రెవెన్యూ సర్వేలో తేలిందని మెదక్‌ కలెక్టర్‌ ఎస్‌ హరీశ్‌ వెల్లడించారు. ఈటల తన పౌల్ట్రీఫారం వరకు రోడ్డు వెడల్పు కోసం నిబంధనలకు విరుద్ధంగా అనేక చెట్లను నరికివేసినట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారని, ఈ విషయమై డీఎఫ్‌వో జ్ఞానేశ్వర్‌ విచారణ జరిపారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆరు పేజీల నివేదికను కలెక్టర్‌ హరీశ్‌ శనివారం సాయంత్రం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు పంపినట్టు తెలిసింది. చెట్ల నరికివేతపైనా కలెక్టర్‌ ప్రత్యేక నివేదిక అందజేసినట్టు సమాచారం. ఈటలపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలని సీఎం కేసీఆర్‌ శుక్రవారం సీఎస్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌, విజిలెన్స్‌ ఎస్పీ మనోహర్‌ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ శనివారం మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో పర్యటించింది. సుమారు పది గంటలకు పైగా అధికారులు దర్యాప్తు కొనసాగించారు. బాధిత రైతుల నుంచి వివరాలను సేకరించారు. రైతుల వద్ద ఉన్న హక్కు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విచారణలో విజిలెన్స్‌ ఎస్పీ మనోహర్‌, సీఐ సతీశ్‌రెడ్డి, ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌, తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, తాసిల్దార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు భూ కబ్జాపై విచారణ చేసేందుకు వచ్చినట్లు చెప్పారు.

మూడు డీజీపీఎస్‌ బృందాలతో..

జమున హ్యాచరీస్‌ చుట్టుపక్కల అసైన్డ్‌ భూములను మూడు డీజీపీఎస్‌ సర్వే బృందాలు సర్వే చేశాయి. ముందుగా హ్యాచరీస్‌ చుట్టుపక్కల, సమీపంలోని ఫీడ్‌ మిల్లు, గోదాముల వద్ద, ఆ తర్వాత హ్యాచరీస్‌ నుంచి అసైన్డ్‌ భూముల వరకు వెళ్లి సర్వే నిర్వహించారు. అచ్చంపేటలోని సర్వే నంబర్‌ 130లో 15.35 ఎకరాలు, సర్వే నంబర్‌ 111లో 7.15 ఎకరాలు, సర్వే నెంబర్‌ 81లో 9.18 ఎకరాలు కబ్జాకు గురైనట్టు తేలింది. పలువురు అధికారులతో కూడిన మరో రెవెన్యూ బృందం రికార్డులను పరిశీలించింది. ఈ విచారణలో మొత్తం 65 ఎకరాల అసైన్డ్‌ భూములను మంత్రి ఈటల కబ్జా చేశారని, అందులో హ్యాచరీస్‌ కట్టారని తెలిసింది. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో అసైన్డ్‌ భూముల కబ్జాపై పది మంది రైతులతో విచారణ కొనసాగుతున్నదని విజిలెన్స్‌ ఎస్పీ మనోహర్‌ తెలిపారు.

ఆస్తి పన్ను ఎగవేత!

హైదరాబాద్‌, మే 1 (నమస్తే తెలంగాణ): ఈటల రాజేందర్‌ తన మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని భారీ ఎత్తున ఆస్తిపన్ను కూడా చెల్లించలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తన కోళ్ల షెడ్లను గోదాములుగా మార్చారు. కానీ వాటిని రికార్డుల్లో కోళ్ల షెడ్లుగానే ఉంచారు. వీటిపై ఏడాదికి రూ.12 లక్షలకు పైగా ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉండగా రూ.2,94,830 మాత్రమే చెల్లిస్తున్నట్టు సమాచారం. తన మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని స్వయంగా వెళ్లి ఎక్సైజ్‌ శాఖపై ఒత్తిడి చేసినట్టు తెలిసింది. మంత్రి కావడంతో అధికారులు ఎవ్వరూ మాట్లాడలేదు. ఇదే తీరుగా ఆయన బినామీలుగా ఉండి అక్రమంగా దేవాదాయ భూముల్లో గోడౌన్లు నిర్మించిన వారంతా ప్రాపర్టీ టాక్స్‌ను నామమాత్రంగా చెల్లించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.

సూరి కొట్టడానికి వచ్చాడు

కోళ్ల ఫారాలు కట్టిన సందర్భాల్లో మా భూమిలో నుంచి పెద్ద ఎత్తున గోతులు తవ్వి, నీళ్లను తరలించారు. ఇదేంటి అని అడిగితే సూరి (ఈటల అనుచరుడు) కొట్టడానికి వచ్చాడు. మా దగ్గర ఉన్న కాగితాలను తీసుకురావాలని అనడంతో గత్యంతరం లేక ఇచ్చినం. అవి చెల్లవని బెదిరించి.. భూమిని అన్యాయంగా లాక్కున్నారు.

కొమ్ము ఎల్లం మంజుల,బాధితురాలు, అచ్చంపేట

కబ్జాపై పూర్తి విచారణ చేయాలి

కబ్జాకు గురైన భూమిపై పూర్తి విచారణచేయడం మంచి విషయం. సీఎం కేసీఆర్‌ గారు వెంటనే స్పందించడం బాగున్నది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి భూములపై విచారణ జరిపి, నిరుపేదలకు న్యాయంచేయాలి. భూములను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి.

కొమ్ము రాములు,గ్రామస్తుడు, అచ్చంపేట

స్పందిస్తారని అనుకోలేదు

బాధితులు లేఖ రాసిన వెంటనే సీఎం కేసీఆర్‌ సారు ఇంత పెద్ద ఎత్తున స్పందిస్తారని అనుకోలేదు. ఈటల రాజేందర్‌ను కలిసి, మా బాధను చెప్తామనుకుంటే కలువనీయలేదు. ఎప్పుడైనా సూరి (ఈటల అనుచరుడు)తో పాటు మరికొందరు కలిసి మాట్లాడేవారు. భూములు మాత్రం ఇచ్చేది లేదు.. డబ్బులిస్తామని తెలిపేవారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయంచేయాలి.

కత్తెర రమేశ్‌, గ్రామస్తుడు, అచ్చంపేట

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈటల కబ్జాలో అసైన్డ్‌.. నిజమే

ట్రెండింగ్‌

Advertisement