e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home టాప్ స్టోరీస్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి
  • ఎమ్మెల్సీ కవితపై ఈటలవి అసత్య వ్యాఖ్యలు
  • ఆమె వల్లే విద్యుత్తు కార్మికుల జీవితాల్లో వెలుగు
  • నాడు, నేడు, రేపు కవితనే మా గౌరవ అధ్యక్షురాలు
  • స్పష్టంచేసిన టీఆర్‌వీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌

ఖైరతాబాద్‌, జూన్‌ 6: టీఆర్‌ఎస్‌లో ఉండి మంత్రిగా అన్నీ అనుభవించిన ఈటల రాజేందర్‌ ఏ ఒక్క రోజూ విద్యుత్తు కార్మికుల సమస్యలపై స్పందించలేదని, నేడు పదవి నుంచి తొలిగించగానే అవగాహన రాహిత్యంతో ఎమ్మెల్సీ కవితపై, తమ కార్మిక సంఘంపై అసత్య వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు కార్మిక సంఘం (టీఆర్‌వీకేఎస్‌) అధ్యక్షుడు కేవీ జాన్సన్‌ మండిపడ్డారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవుపలికారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాశ్‌తో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2004లో నాటి ఉద్యమసారథి కేసీఆర్‌ నాయకత్వంలో కరీంనగర్‌ వేదికగా టీఆర్‌ఎస్‌కు అనుబంధంగా ఏర్పాటయిన ఏకైక కార్మిక సంఘం టీఆర్‌వీకేఎస్‌ అని చెప్పారు. నాడు గౌరవ అధ్యక్షుడిగా నాయిని నర్సింహారెడ్డి, అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్‌ను ఎన్నుకున్నామని వివరించారు. రాష్ట్రం సిద్ధించాక ఉద్యమంలో ప్రముఖపాత్ర పోషించి, తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించిన కల్వకుంట్ల కవితను గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని సంకల్పించామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎగ్జిక్యూటివ్‌ మీటింగ్‌ పెట్టుకొని, ఒక రిజల్యూషన్‌ పాస్‌ చేసుకొని 2015లో కవితను టీఆర్‌వీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నుకొన్నామని తెలిపారు. ఈ వాస్తవాలను తెలుసుకోకుండా ఈటల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవుపలికారు.
కార్మిక పక్షపాతిగా..
కవిత గౌరవ అధ్యక్షరాలిగా విద్యుత్తు కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారని జాన్సన్‌ తెలిపారు. 2011 బ్యాచ్‌ జేఎల్‌ఎం పోస్టుల అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నదని, అదే నేపథ్యంలో ప్రభుత్వంతో మాట్లాడి 1,175 మంది జేఎల్‌ఎంలను రెగ్యులరైజ్‌ చేయించారని చెప్పారు. 2014 పీఆర్సీ విషయానికి వస్తే 27 శాతానికి అన్ని సంఘాలు అంగీకరించగా, ఉత్తర్వులు వచ్చే క్రమంలో సీఎం కేసీఆర్‌తో మాట్లాడి 30 శాతానికి పెంచేలా చూశారని గుర్తుచేశారు. తాజాగా ఏపీలో 25 శాతం ఫిట్‌మెంట్‌ మంజూరు కాగా, ఇక్కడి కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని స్వయంగా సీఎం కేసీఆర్‌ను కలిసి 35 శాతానికి పెంచేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారని అన్నారు. మెడికల్‌ పాలసీ కూడా కనీవినీ ఎరుగని రీతిలో రూ.23 లక్షలకు ఒప్పించి అందరికీ లబ్ధిచేకూర్చారని తెలిపారు. విద్యుత్తుశాఖలో ఒక పోస్టు మంజూరుకావాలంటే ఎన్నో రకాలుగా కష్టపడాల్సి ఉంటుందని, కానీ 13,357 అదనపు పోస్టులు కూడా మంజూరుచేయించడంలో కవిత కృషి వెలకట్టలేనిదని, మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవ చూపారని గుర్తుచేశారు. కవిత ప్రత్యేక చొరవతో 23 వేల పైచిలుకు కార్మికులను ఆర్టిజన్లుగా విలీనంచేశారని అన్నారు. ఉద్యమంలో పాలుపంచుకున్న కార్మికులందరికీ ఇంక్రిమెంట్లు, 24 గంటల విద్యుత్తు ఇప్పించిన ఘనత కూడా ఎమ్మెల్సీ కవితకే దక్కుతుందన్నారు.నాడు, నేడు, రేపు ఆమెనే తమ సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉంటారని స్పష్టంచేశారు. టీఆర్‌వీకేఎస్‌ రాష్ట్ర అధనపు ప్రధాన కార్యదర్శి వీ నిరంజన్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత టీఆర్‌వీకేఎస్‌కు గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆమె కృషితో ఉమ్మడి రాష్ట్రంలో కోల్పోయిన వాటిని సాధించుకున్నామని చెప్పారు.

ఉద్యమ పార్టీపై విమర్శలు సహించం: ఆర్‌ మోజెస్‌
ప్రత్యేక రాష్ట్ర పోరులో ఉద్యమనేతగా ఉండి నేడు ఆ ఉద్యమ పార్టీపైనే విమర్శలుచేయడం తగదని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ దళిత్‌ క్రిస్టియన్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌ మోజెస్‌ హితవుపలికారు. విద్యుత్తు కార్మికుల వేతనాలు, పదోన్నతులు, తాజాగా సర్వీసు పెంపు సీఎం కేసీఆర్‌ చలువతోనే వచ్చాయన్న వాస్తవాలు ఈటలకు తెలియదా అని ప్రశ్నించారు. కార్మిక సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్న ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను తమ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. సమావేశంలో టీఆర్‌వీకేఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు టీ రజనీకాంత్‌, డీవీ లక్ష్మీనారాయణ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ యూసుఫ్‌, పీ కరెంట్‌రావు, టీఎస్‌ట్రాన్స్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎం శివకుమార్‌, పీ రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

ట్రెండింగ్‌

Advertisement