గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 03:06:23

వైద్యులంటే లెక్క లేదా?

వైద్యులంటే లెక్క లేదా?

  • కరోనా వేళ వారి ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీస్తారా? 
  • ప్రతిపక్షాల తీరుపై మంత్రి ఈటల విస్మయం
  • వైద్యుల సేవలు భేష్‌: మంత్రి వేముల 
  • నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో కరోనాపై సమీక్ష

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రాణాలకు తెగించి కరోనాతో పోరాటం చేస్తున్న వైద్యులకు అండగా నిలవాల్సింది పోయి వారి ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసేలా రాజకీయనాయకులు, ఓ వర్గం మీడియా, కొందరు మేధావులు చేస్తున్న ఆరోపణలు బాధాకరమని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కొవిడ్‌-19 పోరాటంలో సర్కారు చేస్తున్న ప్రయత్నాలను శంకించాల్సిన అవసరంలేదని హితవుపలికారు. ఆదివారం నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో రోడ్లు భవనాలశాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి మంత్రి ఈటల కరోనాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కోసం ఎంత ఖర్చయినా పెట్టేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారన్నారు. ఓ వర్గం మీడియాలోవస్తున్న అసత్య కథనాలపైనా మంత్రి తీవ్రం గా స్పందించారు. తెలంగాణలో సాధారణ సమయంలోనే వెయ్యిమందికిపైగా మరణిస్తుంటారని, ఈ సంఖ్య దేశం లో 30వేల పైచిలుకు ఉంటుందని వెల్లడించారు. కొవిడ్‌తో బాధపడుతున్న వారిలో ఇతర జబ్బులున్న వారు మాత్రమే రిస్క్‌ను ఎదుర్కొంటున్నట్టు వివరించారు. 81 శాతం మందికి కరోనా లక్షణాలు కన్పించవని, 19 శాతం మందికి మాత్రమే డాక్టర్ల సేవలు అవసరం ఉంటాయని తెలిపారు. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ర్టాల కంటే కొవిడ్‌-19 చికిత్సలో తెలంగాణలోనే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. 

వైద్యుల సేవలు అమోఘం: మంత్రి వేముల

కరోనా రోగులకు వైద్యులందిస్తున్న సేవలు అమోఘమని మంత్రి వేముల అన్నారు. ఉమ్మడి జిల్లాకు ఏ అవసరం వచ్చినా ముందుండి సాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.సమావేశంలో ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్‌, హన్మంత్‌ షిండే, షకీల్‌ అహ్మద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్లు దాదాన్నగారి విఠల్‌ రావు, దఫేదార్‌ శోభ, కలెక్టర్లు నారాయణరెడ్డి, శరత్‌ పాల్గొన్నారు.logo