By Maduri Mattaiah
బాలీవుడ్‌తో పోలిస్తే క్రీడా నేపథ్య చిత్రాల్ని వెండితెరపై ఆవిష్కరించే ట్రెండ్ దక్షిణాదిలో తక్కువే. గతంలో క్రికెట్, కబడ్డీ లాంటి ఆటలతో తెలుగులో కొన్ని సినిమాలొచ్చాయి. హాకీ క్రీడతో ఇప్పటివరకు హీరోలెవరూ సినిమాలు చేయలేదు. ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’తో తొలిసారి సందీప్‌కిషన్ ఆ ప్రయత్నం చేశాడు. హాకీ కథాంశంతో తెలుగులో రూపొందిన తొలి చిత్రమిది. తమిళంలో రూపొందిన ‘నాట్పే తునై’ ఆధారంగా దర్శకుడు డెన్నిస్ జీవన్ కానుకొలను ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
సంజు అలియాస్ సందీప్‌నాయుడు(సందీప్‌కిషన్) విదేశాల్లో స్థిరపడాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. కొన్ని పరిస్థితుల వల్ల యానాంలో ఉన్న మామయ్య (పోసాని కృష్ణమురళి) దగ్గర కొన్నాళ్లు సంజు ఉండాల్సివస్తుంది. అక్కడ తొలిచూపులతోనే హాకీప్లేయర్ లావణ్య(లావణ్య త్రిపాఠి) అతడి మనసును దోచేస్తుంది. సంజులోని మంచితనం, నిజాయితీకి మెచ్చి లావణ్య అతడిని ఇష్టపడుతుంది. లావణ్య కోరడంతో ఆమె కోసం హాకీ ఆడతాడు సందీప్. తన ఆటతో అక్కడి వారందరిని మెప్పిస్తాడు. ఆ మ్యాచ్ కారణంగానే సందీప్ ఓ ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్ అనే నిజం అక్కడివారందరికి తెలుస్తుంది.
కథా విశ్లేషణ
యానాంలోని చిట్టిబాబు హాకీ స్టేడియానికి ఘనమైన చరిత్ర ఉంటుంది. ఆ స్టేడియాన్ని క్రీడశాఖ మంత్రి రావురమేష్(రావురమేష్) ఫార్మా కంపెనీకి లీజుకు ఇవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ గ్రౌండ్‌ను కాపాడుకోవాలంటే వైజాగ్ క్లబ్ టీమ్‌తో జరిగే హాకీ మ్యాచ్‌లో యానాం క్లబ్ పోరాడాల్సి వస్తుంది. కష్టాల్లో ఉన్న యానాం టీమ్‌కు సందీప్ ఎలా అండగా నిలిచాడు?అంతర్జాతీయ ఆటగాడైన సందీప్ ఎందుకు హాకీకి దూరమవ్వాల్సివచ్చింది?స్నేహితులు దర్శి(ప్రియదర్శి), రాహుల్(రాహుల్ రామకృష్ణ)లతో సంజుకు ఉన్న సంబంధమేమిటి? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. ఎంతగానో ఇష్టపడే చారిత్రాత్మక స్టేడియాన్ని కోచ్‌తో కలిసి హాకీ టీమ్ రాజకీయ ఎత్తుగడలను ఎదురించి ఎలా కాపాడుకున్నదనే కథాంశంతో రూపొందిన చిత్రమిది. హాకీ నేపథ్యానికి స్నేహం, ప్రేమ లాంటి కమర్షియల్ హంగులను అద్దుతూ దర్శకుడు కథనాన్ని అల్లుకున్నారు.
ప్రతిభ ఉండి ఆర్థిక స్థోమత లేకపోవడం, రాజకీయ ప్రభావం వల్ల క్రీడల్లో రాణించలేకపోతున్న ఆటగాళ్ల అంతఃసంఘర్షణను అంతర్లీనంగా కథలో చూపించారు. ఒలింపిక్ క్రీడల్లో దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని తీసుకొచ్చిన హాకీ నేడు ప్రాభవాన్ని ఎలా కోల్పోయింది? హాకీ క్రీడాకారుల్ని ప్రజలు ఎలా విస్మరిస్తున్నారో సంభాషణల ద్వారా అర్థవంతంగా చూపిస్తూ తెరకెక్కించారు. హాకీ, కబడ్డీ లాంటి క్రీడల్లో అద్భుతమైన విజయాల్ని సాధించినా ఆటగాళ్ల ప్రతిభకు గుర్తింపు, విలువ ఇవ్వడం లేదనే అంశాన్ని అర్థవంతంగా ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశారు. ప్రథమార్థం సంజు, లావణ్య ప్రేమకథతో సరదాగా సినిమా సాగుతుంది. మహేష్ విట్టా, సత్య కామెడీ కొన్ని చోట్ల వర్కవుట్ అయ్యింది. సంజు అంతర్జాతీయ హాకీ ప్లేయర్ అనే నిజాన్ని వెల్లడిస్తూ అతడి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌తో ద్వితీయార్థాన్ని మొదలుపెట్టారు దర్శకుడు. స్నేహం కోసం హాకీ వదులుకున్న సంజు గ్రౌండ్‌ను కాపాడుకోవడం కోసం ఓ టీమ్ చేసే పోరాటాన్ని చూసి మళ్లీ ఏ విధంగా హాకీ ఆడటానికి సిద్ధమయ్యడనే అంశాన్ని భావోద్వేగభరితంగా ఆవిష్కరించారు. హాకీ మ్యాచ్ నేపథ్యంలో వచ్చే పతాక ఘట్టాలు నిజమైన ఆటను చూస్తున్న ఫీలింగ్‌ను పంచుతాయి.
హాకీ ప్లేయర్, స్నేహితుడు, ప్రేమికుడిగా భిన్న పార్శాలతో కూడిన పాత్రలో సందీప్‌కిషన్ చక్కటి వైవిధ్యాన్ని కనబరిచాడు. ఇప్పటివరకు లవర్‌బాయ్ పాత్రల్లోనే ఎక్కువగా సందీప్‌కిషన్ నటించాడు. గత పాత్రల ఛాయలు కనిపించకుండా ఎమోషన్స్‌తో కూడిన సంజు పాత్రలో చక్కటి నటనను కనబరిచాడు. ద్వితీయార్థం అతడి నటన ఆకట్టుకుంటుంది. హాకీ క్రీడాకారుడి పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకొని నటించడంతో ఆట బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలన్నీ సహజంగా ఉన్నాయి. తిరుగుబాటు తత్వమున్న హాకీప్లేయర్‌గా లావణ్య త్రిపాఠి తన నటనతో ఆకట్టుకున్నది. పాటల్లో గ్లామర్ తళుకులతో మెప్పించింది. హాకీ కోచ్‌గా మురళీశర్మ పాత్ర ఎమోషనల్‌గా సాగింది. స్వార్థపు ఆలోచనలతో కూడిన రాజకీయనాయకుడిగా రావురమేష్ కనిపించారు. అలవాటైన పాత్ర కావడంతో తనదైన పంచ్‌లు, ప్రాసలతో పాత్రలో ఒదిగిపోయారు. ప్రియదర్శి, రాహుల్‌రామకృష్ణ తమ పంథాకు భిన్నంగా స్నేహానికి విలువనిచ్చే యువకులుగా సీరియస్ పాత్రల్లో కనిపించారు.
డెన్నిస్ జీవన్ కానుకొలనుకు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. తమిళ మాతృకను తెలుగు నేటివిటికి తగినట్లుగా మార్పులు చేయడంలో అతడు తగినంతగా కసరత్తులు చేయలేదని అనిపిస్తుంది. లావణ్య, సంజు ప్రేమకథను అందంగా, ఆహ్లాదంగా మలచలేకపోయారు. అలాగే యానాం ప్రజలకు గ్రౌండ్‌పై ఉండే మమకారానికి ఉద్వేగభరితంగా చెబితే బాగుండేది. పతాక ఘట్టాల్లో వచ్చే హాకీ మ్యాచ్‌లో ఆసక్తి లోపించింది. చిన్న చిన్న లోపాలపై దృష్టిపెడితే బాగుండేది. హిప్హాప్ తమిళ సమకూర్చిన పాటల్లో సింగిల్ కింగులం మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. హాకీ మ్యాచ్‌తో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చేయడంలో కెవిన్‌రాజ్ ఛాయాగ్రహణం, హిప్హాప్ నేపథ్య సంగీతం ఉపకరించాయి. కథపై ఉన్న నమ్మకంతో చిత్ర నిర్మాణంలో సందీప్‌కిషన్ భాగస్వామిగా వ్యవహరించారు. అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్, దయా పన్నెంలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాల పట్ల స్వతహాగా యువతరం ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. అందులో తెలుగులో హాకీ నేపథ్యంలో వచ్చిన తొలి సినిమా ఇదే కావడంతో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’కు కలిసివచ్చే అవకాశాలున్నాయి. అలాగే ఈ వారం పెద్ద సినిమాలేవీ పోటీగా లేవు కాబట్టి మంచి ఓపెనింగ్స్‌ను ఈ సినిమా రాబట్టవచ్చు.