శుక్రవారం 29 మే 2020
Telangana - Feb 16, 2020 , 02:37:50

19నఎంసెట్‌ నోటిఫికేషన్‌

19నఎంసెట్‌ నోటిఫికేషన్‌
  • 21 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం
  • మార్చి 30 వరకు దరఖాస్తులకు గడువు
  • మే 4 నుంచి 11 వరకు ప్రవేశపరీక్షలు
  • షెడ్యూల్‌ జారీచేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కాలేజీలలో సీట్ల భర్తీకోసం మే 4 నుంచి 11వ తేదీవరకు నిర్వహించనున్న టీఎస్‌ ఎంసెట్‌- 2020 షెడ్యూల్‌ను జారీచేశారు. ఈ షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 19న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలకానున్నది. శనివారం జేఎన్టీయూహెచ్‌లో నిర్వహించిన ఎంసెట్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.


ఈ సమావేశానికి ఆ వర్సిటీ ఇంచార్జి వీసీ జయేశ్‌రంజన్‌ హాజరయ్యారు. షెడ్యూల్‌ విడుదల తర్వాత ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవడానికి విద్యార్థులకు అవకాశం కల్పించామన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు మార్చి 30 వరకు గడువు విధించామని వివరించారు. ఏప్రిల్‌ 20 నుంచి మే 1వ తేదీవరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా పరీక్షలకు ఒక్క నిమిషం నిబంధన వర్తిస్తుందని, ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 


ఎంసెట్‌ కమిటీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ మాట్లాడుతూ.. గతంలో మాదిరిగానే ఈసారి ప్రవేశ పరీక్షల ఫీజులు నిర్ణయించామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలతోపాటు పీహెచ్‌సీవారికి ఫీజులో 50శాతం మినహాయించామన్నారు. ఈ మేరకు జనరల్‌ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ విద్యార్థులు రూ.400 పరీక్ష ఫీజు చెల్లించాలని చెప్పారు. రాష్ట్రంలో 16 ప్రాంతీయ కేంద్రా లు, ఏపీలో నాలుగు ప్రాంతీయ కేంద్రాలు, మొత్తం 55 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని వివరించారు. ఆన్‌లైన్‌ పరీక్షలను ప్రతిరోజు రెండుపూటల్లో.. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహిస్తామని తెలిపారు. 


మూసివేతకు దరఖాస్తులు

రాష్ట్రంలో జేఎన్టీయూహెచ్‌ ఆధ్వర్యంలో 2020-21 విద్యాసంవత్సరంనుంచి మూసివేయడానికి 15 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. ప్రైవేటు ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ వంటి కాలేజీల భూమి, భవనాలకు సంబంధించి డాక్యుమెంట్లతో ఇప్పటివరకు 81 విద్యాసంస్థలే వర్సిటికీ దరఖాస్తు చేశాయని తెలిపారు. మరో 70 కాలేజీలవరకు డాక్యుమెంట్లు జతచేయలేదని చెప్పారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, ప్రొఫెసర్‌ వెంకటరమణ, సెక్రటరీ శ్రీనివాసరావు, ఈసెట్‌ కన్వీనర్‌ ముంజూర్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.logo