శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 17:49:21

తొలి విడుత 71.49 శాతం ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీ

తొలి విడుత 71.49 శాతం ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీ

హైదరాబాద్‌ : రాష్ట్రంలో భర్తీ అయిన ఇంజినీరింగ్‌ సీట్ల వివరాలను ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ అధికారులు శనివారం వెల్లడించారు. తొలి విడుత 71.49 శాతం ఇంజినీరింగ్‌ సీట్లు భర్తీ అయ్యాయని, ఇంకా 19,998 సీట్లు మిగిలాయని తెలిపారు. రాష్ట్రంలోని 14 యూనివర్సిటీ కళాశాలల్లో 3,091 ( 98.5 శాతం) సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. 164 ప్రైవేట్‌ కళాశాలల్లో 47,046 బీటెక్‌ సీట్లు కేటాయించారు. 13 యూనివర్సిటీలు, 35 ప్రైవేట్‌ కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. 

మూడు ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు.  బీటెక్‌లోని 21 కోర్సుల్లో  సీట్లన్నీ నిండాయి.  బీఫార్మసీ, ఎంపీసీ కోటాలో కేవలం 4.02 శాతం సీట్లు మాత్రమే భర్తీ కాగా 4,324 సీట్లు మిగిలాయి. సీట్లు వచ్చి న అభ్యర్థులు ఈ నెల 28లోగా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ సూచించారు.  ఈ నెల 29 నుంచి తుది విడుత ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

ఎంసెట్‌లో వెయిటేజ్‌ తొలగించే ఆలోచన..

ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజ్‌ తొలగించేందుకు యోచిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి పేర్కొన్నారు.  ప్రభుత్వం అంగీకరిస్తే కేవలం ఎంసెట్‌ మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయిస్తామని వెల్లడించారు. ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25శాతం వెయిటేజ్‌ కేటాయిస్తున్న సంగతి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.