బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 08:41:00

టీఎస్ ఎంసెట్ ఫ‌లితాలు నేడు విడుదల

టీఎస్ ఎంసెట్ ఫ‌లితాలు నేడు విడుదల

హైదరాబాద్‌ : తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీర్‌ విభాగం ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. మధ్యాహ్నం 3.30గంటలకు జేఎన్టీయూహెచ్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఈ నెల 9న ప్రారంభం కానుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. నవంబర్‌ రెండో తేదీ వరకు రెండు విడుతల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు. మిగతా సీట్లను కళాశాలలో భర్తీ చేసేందుకు స్పాట్‌ అడ్మిషన్‌ కోసం నవంబర్‌ 4న మార్గదర్శకాలను ప్రవేశాల కమిటీ మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈ నెల 9 నుంచి 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి విద్యార్థులు సహాయం కేంద్రం ఎంచుకోవాలి. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు కేంద్రాల్లో విద్యార్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించనున్నారు.

అలాగే 12 నుంచి 20వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండనుంది. ఈ నెల 22న మొదటి విడుతలో ఇంజినీరింగ్‌ సీట్లను కేటాయిస్తామని ప్రవేశాల కమిటీ చైర్మన్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. 22 నుంచి 27వరకు బోధనా రుసుం చెల్లించి సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాలని సూచించారు. ఈ నెల 29న తుది విడుత కౌన్సెలింగ్‌ ప్రారంభం అవుతుంది. అదే రోజు చివరి విడత ధ్రువపత్రాల పరిశీలన కోసం ఆన్‌లైన్‌ స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. 30న పత్రాల పరిశీలన, 30, 31 తేదీల్లో తుది విడుత ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. నవంబర్‌ 2న తుది విడుత సీట్లను కేటాయిస్తారు. 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌ బోధనా రుసుం చెల్లించి కళాశాలల్లో సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. మిగతా సీట్ల కోసం కాలేజీల్లో స్పాట్‌ నిర్వహిస్తారు. ఇందుకు నవంబర్‌ 4న మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. ఇంజినీరింగ్‌ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను 7న వెబ్‌సైట్‌ను పొందుపరుచనున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo