శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Jan 23, 2020 , 02:03:00

తుది అంకానికి ‘అక్షర తెలంగాణ’

తుది అంకానికి ‘అక్షర తెలంగాణ’
  • సాహిత్యం, నీతికథలు, సామెతలతో రూపుదిద్దుకొంటున్న వర్క్‌బుక్‌
  • పుస్తకాన్ని పరిశీలించిన విద్యాశాఖ కమిషనర్‌ టీ విజయ్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈచ్‌వన్‌-టీచ్‌వన్‌ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ‘అక్షర తెలంగాణ’ పుస్తకం రూపకల్పన తుది అంకానికి చేరుకొంది. వీలైనంత త్వరగా నిరక్షరాస్యులకు అందుబాటులోకి తేవాలన్న కృతనిశ్చయంతో పాఠశాల విద్యాశాఖ ఉన్నది. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ఆమోదానికి ఈ వర్క్‌బుక్‌ను పంపనున్నారు. ఈ పుస్తకం తయారీ, అందులో చేర్చిన అంశాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ టీ విజయ్‌కుమార్‌, వయోజన విద్యావిభాగం డైరెక్టర్‌ రమణకుమార్‌ బుధవారం పరిశీలించారు. 


తక్కువ సమయంలో చదువడం, రాయడం, లెక్కలు చేయడానికి తేలికగా ఉండేలా పుస్తకాన్ని రూపొందించాలని, ఆ మేరకు సిలబస్‌లో చిన్నచిన్న మార్పులు చేయాలని విషయ నిపుణులు, స్టేట్‌ రిసోర్స్‌ అధికారులకు సూచించారు. 90 పేజీలలోపు ఉండే ఈ వర్క్‌బుక్‌లో అక్షరాలు, పదాలు, సాహిత్యం, సంఖ్యాపరిజ్ఞానం, నీతికథలు, వీరగాథలు, సామెతలు, కల్తీపదార్థాలపై అవగాహన, హరితహారం వంటి అంశాలను చేరుస్తున్నారు. నిరక్షరాస్యతపై ఇప్పటికే గ్రామాల్లో సర్వే ముగియగా.. త్వరలో మున్సిపాలిటీల్లో చేపట్టనున్నారు. 


దీని తర్వాతనే ఎన్ని కాపీలు ముద్రించాలనేదానిపై నిర్ణయం తీసుకోవడానికి అధికారులకు వీలవుతుంది. ఈచ్‌వన్‌-టీచ్‌వన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ఉద్యోగులు, 40కి పైగా ఉపాధ్యాయ సంఘాలు, ఇంటర్‌ విద్యా జేఏసీ నాయకులు ప్రకటించారు. ప్రైవేట్‌ స్కూల్స్‌, ప్రైవేట్‌ జూనియర్‌, డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులు, దాదాపు 70 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, మరో 70 వేల ఆశాకార్యకర్తలు తమ సహకారం అందిస్తామంటూ ముందుకొచ్చారు. ఈచ్‌వన్‌-టీచ్‌వన్‌ కార్యక్రమానికి సంబంధించి మార్గదర్శకాలు, అక్షర తెలంగాణ వర్క్‌బుక్‌ విడుదల కావాల్సి ఉన్నది. 


logo