మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 02:16:52

జీహెచ్‌ఎంసీలో వృద్ధులకు ఈ-ఓటింగ్‌

జీహెచ్‌ఎంసీలో వృద్ధులకు ఈ-ఓటింగ్‌

  • ఎన్నికల సిబ్బంది, కరోనా బాధితులకూ అవకాశం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎన్నికల విధుల్లో ఉండి ఓటేయలేకపోతున్నారా? వయోభారంతో కనీసం పోలింగ్‌ కేంద్రానికి కూడా రాలేకపోతున్నారా? కరోనాతో క్వారంటైన్‌లో ఉండి ఓటుకు వెళ్లేందుకు వీలుకాదని బాధపడుతున్నారా?.. అయితే మీరిక చింతించాల్సిన పనిలేదు. ఇంట్లో నుంచే ఓటేసేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ-ఓటింగ్‌ విధానాన్ని తీసుకురానున్నది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఈ-ఓటింగ్‌ను కల్పించాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి చెప్పారు. 

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓటర్లుగా నమోదై ఉండి ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వ సిబ్బందికి, వయోవృద్ధులకు, కొవిడ్‌-19 కారణంగా క్వారంటైన్‌లో ఉన్న ఓటర్లకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తామని స్పష్టంచేశారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అధికారులతో పార్థసారథి సమీక్ష నిర్వహించారు. ఈ-ఓటింగ్‌ ద్వారా ఓటేసేందుకు రిజిస్టర్‌ చేసుకునే విధానం, ఓటింగ్‌ గోప్యత తదితర అంశాలపై చర్చించారు.  సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్‌, జాయింట్‌ సెక్రటరీ జయసింహారెడ్డి పాల్గొన్నారు.