గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 01:20:49

కాళేశ్వరం నిర్వహణకు ఈ టెక్నాలజీ

కాళేశ్వరం నిర్వహణకు  ఈ టెక్నాలజీ

  • ప్రాజెక్టు సమగ్ర సమాచారం ఆన్‌లైన్‌లో..
  • వాతావరణ, భూగర్భజలశాఖలతోనూ లింక్‌
  • సీఎం కేసీఆర్‌ మార్గదర్శకాలకనుగుణంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌, మొబైల్‌ యాప్‌ తయారీ
  • వినియోగంపై అధికారులకు వర్క్‌షాప్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిర్మాణం, నిర్వహణలో ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరో అరుదైన ఘనతను సాధించనున్నది. ఈ టెక్నాలజీతో ప్రాజెక్టును నిర్వహించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌, మొబైల్‌ యాప్‌ను రూపొందించారు. సీఎం కేసీఆర్‌ మార్గదర్శకాలకనుగుణంగా ప్రాజెక్టు సమగ్ర సమాచారంతో రూపొందించిన డెసిషన్‌ సపోర్ట్‌ సిస్టమ్‌పై (డీఎస్‌ఎస్‌) బుధవారం జలసౌధలో ఇంజినీరింగ్‌ అధికారులకు ఒకరోజు వర్క్‌షాప్‌ను నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఈఎన్సీ మురళీధర్‌ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో పంప్‌హౌజ్‌లు, జలాశయాలు, కాలువలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని సంకల్పించిందని తెలిపారు. అందులోభాగంగా ప్రాజెక్టు సమగ్ర సమాచారంతో సపోర్ట్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. ఆ సమాచారం ఆధారంగా పంప్‌హౌజ్‌లు, జలాశయాలు, కాలువల నిర్వహణ సాధ్యమవుతుందని.. జలాశయాల్లో నీటి నిల్వలు, ఆయకట్టులో ఎంత నీరు అవసరం అనేది తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. భూగర్భ జలాల పరిస్థితి, వర్షపాతం, నదుల ద్వారా ఎంత పరిమాణంలో నీరు వస్తున్నది? తదితర సమస్త సమాచారాన్ని ఈ సపోర్ట్‌ సిస్టమ్‌లో పొందుపరుచనున్నామని తెలిపారు. 

డెసిషన్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ (డీఎస్‌ఎస్‌)కు అవసరమయ్యే సాఫ్ట్‌వేర్‌, మొబైల్‌ యాప్‌ను వస్సార్‌ ల్యాబ్స్‌ రూపొందించడంతోపాటు, ఐదేండ్లపాటు నిర్వహిస్తుందని చెప్పారు. సాఫ్ట్‌వేర్‌ నిర్వహణ, వినియోగంపై సాగునీటిశాఖ ఇంజినీర్లకు శిక్షణ కూడా ఇస్తారని తెలిపారు. ఇప్పటికే సపోర్ట్‌ సిస్టమ్‌ రూపకల్పన చాలావరకు పూర్తయిందని, మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారని చెప్పారు. గోదావరి బేసిన్‌లో పనిచేస్తున్న ఇంజినీర్లు మొబైల్‌ యాప్‌ పనితీరుపై అవగాహన పెంచుకోవాలని, డాటా ఎంట్రీ ప్రారంభించాలని సూచించారు. 

ఈ సపోర్ట్‌ సిస్టమ్‌ ఆధారంగా సీఎం కేసీఆర్‌ తన కార్యాలయం నుంచే నిర్ణయాలు తీసుకోవడానికి, ఇంజినీర్లకు తగిన సూచనలు, ఆదేశాలు ఇవ్వడానికి అవకాశముంటుందని వెల్లడించారు. అనంతరం డీఎస్‌ఎస్‌పై వస్సార్‌ ల్యాబ్స్‌ ప్రతినిధి నిఖిలేశ్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఇంజినీర్లకు అవగాహన కల్పించారు. వర్క్‌షాప్‌లో ఈఎన్సీలు హరిరామ్‌, ఎస్‌ వెంకటేశ్వర్లు, బీ నాగేందర్‌రావు, చీఫ్‌ ఇంజినీర్లు మధుసూదన్‌రావు, వీరయ్య, హమీద్‌ఖాన్‌, శంకర్‌నాయక్‌, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.