ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 02:41:13

పాస్‌బుక్‌ లేనివారికే ఈ-పాస్‌బుక్‌

పాస్‌బుక్‌ లేనివారికే ఈ-పాస్‌బుక్‌

  • ఇదికూడా అధికారిక డాక్యుమెంటే
  • వారంలో శాశ్వత పట్టాదార్‌ పాస్‌బుక్‌
  • పాస్‌బుక్‌ ఉంటే అప్పటికప్పుడు అప్‌డేట్‌ 
  • ధరణి పోర్టల్‌తో తీరిన అన్నదాతల కష్టాలు

ఈ-పాస్‌బుక్‌ అనేది రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అందరికీ ఇస్తున్నారనే ప్రచారం తప్పు. ఇప్పటికే పట్టాదారు పాస్‌బుక్‌ ఉన్నవారికి ఈ-పాస్‌బుక్‌ ఇవ్వరు. పట్టాదార్‌ పాస్‌బుక్‌ లేనివారికి మాత్రమే.. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న క్షణాల్లోనే అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసిన తాసిల్దార్‌ ఈ-పాస్‌బుక్‌ను అందిస్తారు. ఇది పూర్తిగా అధికారిక డాక్యుమెంట్‌.

‘రిజిస్ట్రేషన్‌ అంటే రెండు, మూడు రోజులయితది. మ్యుటేషన్‌ అంటెనే నెలల తరబడిసాగే తతంగం’ ఇది పెద్దోళ్లు అనే మాట.. కానీ ఇప్పుడు ఆ మాట తప్పయింది. ధరణి పోర్టల్‌తో పావుగంటలోపే పట్టా చేతికి వస్తున్నది. పైరవీలతో అసలు పనేలేదు. ఇప్పటివరకు ఎలాంటి పాస్‌బుక్‌ లేనివారికి అప్పటికప్పుడే ఈ-పాస్‌బుక్‌ అందుతుంది. ఇప్పటికే పాస్‌బుక్‌ ఉన్నవారికి అప్పటికప్పుడే అప్‌డేట్‌ అవుతుంది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘సారూ.. మాకు కొత్త పాస్‌బుక్‌ ఇవ్వండి’ అని వేడుకొంటూ నెలల తరబడి తాసిల్‌ ఆఫీస్‌ చుట్టూ తిరుగాల్సిన కష్టం ఇక ఉండదు. ‘మా పాస్‌బుక్‌ అప్‌డేట్‌ చేయండి’ అంటూ అధికారుల కాళ్లు పట్టాల్సిన అవసరం అసలే లేదు. దళారులకు లంచం ఇవ్వాల్సిన పనేలేదు. ధరణి రాకతో రైతుల కష్టాలు తొలిగిపోయాయి. అరగంటలోపే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తవుతూ అన్నివర్గాల ప్రశంసలు అందుకుంటున్నది. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన క్షణాల్లోనే ఈ-పాస్‌బుక్‌ చేతిలో పెడుతుండటంతో రైతుల కండ్లలో ఆనందం వెల్లివిరుస్తున్నది. వ్యవసాయ భూములకు సంబంధించి మన వద్ద ప్రభుత్వం నుంచి ఉండే ఏకైక ఆధారం పట్టాదార్‌ పాస్‌బుక్‌. గతంలో రిజిస్ట్రేషన్‌ జరిగి.. ఆ కాగితాల ఆధారంగా మ్యుటేషన్‌ కోసం తాసిల్దార్‌కు దరఖాస్తు చేసుకునేవారు. కొన్నవారికి, అమ్మినవారికి నోటీసులు పంపించి విచారించి మ్యుటేషన్‌ చేసేవారు. పాస్‌బుక్‌ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగాల్సి వచ్చేది. ఏదైనా పైరవీ చేసుకుంటేగాని పాస్‌బుక్‌ వచ్చేది కాదు. కానీ ఇప్పుడా సమస్యలకు తెరపడింది.

నిమిషాల్లోనే ప్రక్రియ

ఓ వ్యక్తి వ్యవసాయ భూమిని వేరే వ్యక్తి నుంచి కొన్నా రనుకుందాం. ఇందుకు కావాల్సిన డ్యాక్యుమెంట్లు, ఆధార్‌కార్డులు, నిర్దేశించిన మొత్తానికి చలానా కట్టి సంబంధించిన రసీదులు, ఫొటోలు, ఇతరత్రా పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. తమకు ఇష్టమైన స్లాట్‌ను బుకింగ్‌ చేసుకుంటారు. సమయానికి జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ అయిన తాసిల్దార్‌ ఆఫీస్‌కు భూమిని కొనుగోలు చేసిన, అమ్మిన వ్యక్తులిద్దరూ.. సాక్షులతో కలిసి వెళ్తారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కేవలం నిమిషాల్లోనే పూర్తిచేస్తారు. ఈ సమయంలో వ్యవసాయ భూమిని అమ్మిన వ్యక్తికి సంబంధించిన పట్టాదార్‌ పాస్‌బుక్‌ నుంచి అమ్మిన విస్తీర్ణం మేరకు భూమిని తొలిగిస్తారు. అప్పటికప్పుడు పాస్‌బుక్‌ను అప్‌డేట్‌ చేస్తారు.

పట్టాదార్‌ పాస్‌బుక్‌ లేకపోతే.. 

భూమిని కొన్న వ్యక్తికి పాస్‌బుక్‌ ఉన్నదా.. లేదా అని రిజిస్ట్రేషన్‌ సమయంలోనే ఆన్‌లైన్‌లో అడుగుతుంది. ఉంది అంటే పాస్‌బుక్‌ను అప్‌డేట్‌ చేస్తారు. అందులో ప్రస్తుతం కొన్న మొత్తం విస్తీర్ణం భూమిని ఎక్కిస్తారు.   పాస్‌బుక్‌ లేదం టే.. వెంటనే ఈ-పాస్‌బుక్‌ జనరేట్‌     అవుతుంది. అది డౌన్‌లోడ్‌ అవుతుంది. ఇదంతా 10- 20 నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఒకవేళ వ్యవసాయ భూమిని కొన్న వ్యక్తికి పట్టాదార్‌ పాస్‌బుక్‌ లేకపోతేనే.. ఈ-పాస్‌బుక్‌ను తాసిల్దారు అందిస్తారు. ఇందులో పట్టాదార్‌ పాస్‌బుక్‌ నంబరుతోసహా.. పాస్‌బుక్‌లో ఉండే వివరాలన్నీ ఉంటాయి. ఇదికూడా అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగిసిన క్షణాల్లోనే పూర్తవుతుంది. పైగా ఇది అధికారిక డాక్యుమెంటే. అన్ని రకాల వ్యవహారాల్లోనూ.. దీనిని అధికారిక డాక్యుమెంట్‌గా ఉపయోగించుకోవచ్చన్నమాట. ఆ తరువాత వారం రోజుల్లోపు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఆకుపచ్చ రంగులో శాశ్వత పట్టాదార్‌ పాస్‌బుక్‌ కొరియర్‌లోగానీ.. పోస్టుద్వారా గానీ ప్రభుత్వం నుంచి భూమిని కొనుగోలుచేసిన వ్యక్తి చిరునామాకు చేరుతుంది. 

ఈ-పాస్‌బుక్‌ అధికారిక డాక్యుమెంట్‌

పాస్‌బుక్‌ లేకపోతే ఈ-పాస్‌బుక్‌ ఇస్తాం. పట్టాదార్‌ పాస్‌పుస్తకంలో ఉండే వివరాలన్నీ ఇందులో ఉంటాయి. ఇదికూడా అధికారిక డాక్యుమెంటే. పూర్తిస్థాయి పట్టాదార్‌పాస్‌ పుస్తకం వచ్చేంత వరకు ఈ-పాస్‌బుక్‌ను అధికారిక డాక్యుమెంట్‌గా ఉపయోగించుకోవచ్చు. బ్యాంకులు, మార్ట్‌గేజ్‌, ఎరువులు, విత్తనాలు పొందడానికి, సబ్సిడీ స్కీములకు ఇది అధికారిక డాక్యుమెంట్‌గా ఉపయోగించుకోవచ్చు. రైతులకు ఎలాంటి కష్టం ఉండదు. పాస్‌బుక్‌ లేదనే బెంగకూడా వారికి అవసరం లేదు. అద్భుతమైన పద్ధతి ఇది.

-దూలం మధు, 

తాసిల్దార్‌/జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌, 

కథలాపూర్‌, జగిత్యాల జిల్లా

పోర్టల్‌ పర్‌ఫెక్ట్‌ బీజేపీ నేత, మాజీ ఎంపీపీ రేగులపాటి సుభాష్‌రావు

సిరిసిల్ల రూరల్‌: ధరణి పోర్టల్‌పై పార్టీలకతీతంగా ప్రశంసలు కురుస్తున్నాయి. నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తికావడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ధరణి పోర్టల్‌, కొత్త రిజిస్ట్రేషన్‌ విధానం పర్‌ఫెక్ట్‌గా ఉన్నదని సిరిసిల్ల మాజీ ఎంపీపీ, బీజేపీ నేత రేగులపాటి సుభాష్‌రావు కితాబిచ్చారు. తన చిన్నమ్మ గునిగంటి లక్ష్మికి మూడెకరాల భూమి రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకొని, గురువారం తంగళ్లపల్లి తాసిల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. 10 నిమిషాల్లో భూమి రిజిష్ర్టేషన్‌ చేసి, అరగంటలోనే మ్యుటేషన్‌, 1బీలో పేరు మార్పులన్నీ ఏకకాలంలో జరిగిపోయాయని సుభాష్‌రావు సంతోషం వ్యక్తంచేశారు. నయా పైసా ఖర్చు లేకుండా పని పూర్తిచేశారని మెచ్చుకున్నారు. ఈ విధానం రైతులకు ఎంతో మేలు చేస్తున్నదని కొనియాడారు.

అద్ద గంటకే పట్టా ఇచ్చిండ్రు

జహీరాబాద్‌ మండలం గోవింద్‌పూర్‌లో 17 ఎకరాల వ్యవసాయ భూమిని కొన్న. గురువారం మంచి రోజు ఉన్నదని రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకున్న. అద్దగంటకే అధికారులు పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చిన్రు. ఇంత జెల్ది పని అయితదనుకోలే. అందరి వేలిముద్రలు, పేపర్లు తీసుకొని జెల్దిజెల్ది పనిచేసిన్రు. ధరణి పోర్టల్‌తోనే ఇదంతా సాధ్యమైంది. ఇదివరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం సుట్టూ దినాం తిరుగాల్సి వచ్చేది. భూమి రిజిస్ట్రేషన్‌కు ఆన్‌లైన్‌లో పైసలు కట్టినం. ఎవరికీ ఒక్క పైసా ఇయ్యలేదు. దళారులు లేరు. సక్కగ రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ చేసి పాసుపుస్తకం ఇచ్చిండ్రు. సంతోషం అనిపించింది.

- శెట్టి శేఖర్‌రెడ్డి, రైతు, గోవింద్‌పూర్‌, 

జహీరాబాద్‌ మండలం, సంగారెడ్డి జిల్లా 

సూస్తుండంగనే రిజిస్ట్రేషన్‌ అయిపోయింది

మా ఊరు ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్‌. మా ఆయన శ్రీధర్‌ దుబాయ్‌లో ఉన్నడు. మా మామయ్య ఎల్లయ్య పేరిట తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లె శివారులో 5 ఎకరాల భూమి ఉన్నది. అందులో నుంచి మా ఆయన పాలుకు 1.26 ఎకరాల ఇచ్చిండు. నా పేరు మీద స్లాట్‌బుక్‌ చేసుకొని తాసిల్‌ ఆఫీసుకు పోయిన. సూస్తుండంగనే రిజిస్ట్రేషన్‌ అయిపోయింది. మ్యుటేషన్‌, పట్టా బుక్కు చేతిల పెట్టింన్రు. చాలా సంతోషమనిపించింది. సీఎం కేసీఆర్‌ సార్‌ కృతజ్ఞతలు.

 - లావణ్య, మహిళ పెద్దలింగాపూర్‌, (సిరిసిల్ల రూరల్‌)

పది నిమిషాల్లోనే పూర్తి..

ధరణి ద్వారా కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ ముగిసింది. అందుకు సంబంధించిన ధ్రువపత్రం ఇవ్వడానికి ప్రింట్‌ ఆప్షన్‌ పనిచేయకపోవడంతో కాస్త ఆలస్యమైంది. నా భర్త నుంచి గిఫ్ట్‌ డీడ్‌ కింద తాసిల్దార్‌ కార్యాలయంలో చాలా తొందరగా రిజిస్ట్రేషన్‌ చేశారు. పని ఇంత సులువుగా అవుతుందని అనుకోలేదు. సీఎంకు, అధికారులకు కృతజ్ఞతలు.                   

 - నాగమణి, మహిళా రైతు, వరిదేల, 

కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా 

చాలా సింపుల్‌గా ఉన్నది

 రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ చాలా సింపుల్‌గా ఉన్నది. గురువారం 7 రిజిస్ట్రేషన్లు చేశాను. మధ్యా హ్నం 3 గంటల వరకు  రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతా పూర్తయింది. వాళ్లందరికి మ్యుటేషన్‌ చేసి  ఈ -పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు అందిం చాం. రిజిస్ట్రేషన్‌ సమయంలో బయో మెట్రిక్‌ కలిస్తే ప్రక్రియ ముందుకు వెళుతుంది. 

- షేక్‌ అహ్మద్‌, తాసిల్దార్‌, 

మోత్కూర్‌, యాద్రాది- భువనగిరి జిల్లా