ఆదివారం 24 మే 2020
Telangana - Mar 07, 2020 , 01:11:59

అంతుబట్టని భానుడి తృష్ణ!

అంతుబట్టని భానుడి తృష్ణ!
  • వర్షాకాలంలోనూ శ్రీశైలం ఆవిరినష్టం 900 క్యూసెక్కులు!
  • 50 రోజుల్లో చుక్కనీరూ నష్టంలేదు
  • సాగర్‌ కంటే శ్రీశైలంలోనే ఆవిరి ఎక్కువ
  • అస్తవ్యస్త లెక్కలపై ఏపీకి కృష్ణాబోర్డు ఘాటులేఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గతేడాది ఆగస్టు 16న శ్రీశైలం పరిసరాల్లో బోరున వర్షం కురిసింది. అప్పటికే నిండుకుండలా మారిన శ్రీశైలం జలాశయంలోకి ఎగువ నుంచి 74.74 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతుండగా.. గేట్లు ఎత్తి 71.39 టీఎంసీలను దిగువకు విడుదల చేస్తున్నారు. అంతవర్షంలోనూ ఆ రోజు శ్రీశైలం జలాశయంలో నీటిఆవిరి నష్టమెంతో తెలుసా? అక్షరాలా 900 క్యూసెక్కులు! వర్షంలోనూ భానుడికి అంత దాహమేసింది.. ఆ మరుసటి రోజు.. అంటే ఆగస్టు 17న మాత్రం ముందురోజు కడుపునిండా తాగినందుకో లేక దాహం వేయలేదో!! ఒక్కచుక్క కూడా సూ ర్యుడు ఆవిరిరూపంలో స్వీకరించలేదు. 2019-20 నీటిఏడాదిలో ఏకంగా 50 రోజులపాటు ఒక్కచుక్కా ముట్టుకోలేదు!! శ్రీశైలం జలాశయంలో ఆవిరినష్టాల నమోదు లెక్కలను చూస్తే ఇలాంటి విచిత్రాలెన్నో కనిపిస్తా యి. ఇది మామూలు విషయమే అయినా.. కీలకమైన, ఉమ్మడి జలాశయనిర్వహణలో భాగంగా అధికారుల నిర్లక్ష్యాలకు ఇవి ఉదాహరణలు మాత్రమే. కృష్ణానదీ యాజమాన్య బోర్డు దీనిని తీవ్రంగా పరిగణించి.. తెలుగు రాష్ర్టాలకు లేఖరాసింది. వీటిపై వివరణ ఇవ్వాలని సూచించింది. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు తెలుగు రాష్ర్టాలకు అత్యంత కీలకమైనవి. భారీ జలాశయాలు కావడంతో ఏటా వీటి ఆవిరినష్టాలు కూడా భారీగానే ఉంటాయి. ఆ నష్టాన్ని సంబంధిత ప్రాజెక్టు ఇంజినీర్లు ప్రతిరోజూ కచ్చితంగా, సరైనరీతిలో నమోదుచేయాలి. అయితే ఈ లెక్కలను ఇటీవల పరిశీలించిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు అందులోని డొల్లతనాన్ని బయటపెట్టింది. ముఖ్యంగా శ్రీశైలం జలాశయం నీటిఆవిరి లెక్కల నమోదులో సంబంధిత అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అనే విషయాన్ని రెండురాష్ర్టాలకు రాసిన లేఖలో వివరించింది. 


  • 1.6.2019 నుంచి 28.2.2020 వరకు 50 రోజులు శ్రీశైలం జలాశయం నీటిఆవిరి నష్టాలను ‘సున్నా’గా నమోదుచేశారు. అంటే దీనిప్రకారం అక్కడ ఉష్ణోగ్రతలు సున్నా అంతకంటే తక్కువగా ఉన్నాయా? 
  • 2018-19లో 35రోజుల పాటు 300 క్యూసెక్కుల చొప్పున నీటిఆవిరి లెక్కలను నమోదుచేసిన అధికారులు.. ఈ నీటి సంవత్సంలో అసలు వేసవి మొదలు కాకముందే ఏకంగా 128 రోజులపాటు 300 క్యూసెక్కుల చొప్పున నమోదు చేయడం గమనార్హం. 
  • గతేడాది ఆగస్టు 10- 31వ తేదీ వరకు ఏడుపర్యాయాలు శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదలచేశారు. అంటే వర్షాకాలం.. పైగా భారీఎత్తున వరద కొనసాగుతున్న సమయం. ఇలాంటి సమయంలో ఆవిరినష్టాలు చాలా తక్కువగా నమోదవుతాయి. కానీ, అధికారులు మాత్రం ఏకంగా 450-900 క్యూసెక్కుల చొప్పున నమోదుచేశారు.
  • నాగార్జునసాగర్‌ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 312.050 టీఎంసీలు. శ్రీశైలం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.810 టీఎంసీలు. పైగా సాగర్‌ జలాశయం భౌగోళికంగా పరుచుకొని ఉంటుంది. శ్రీశైలం రెండుగుట్టల మధ్య లోతుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సాగర్‌లో ఆవిరి నష్టాలు నిండువేసవిలోనూ గరిష్ఠంగా 400 క్యూసెక్కులు మాత్రమే. కానీ శ్రీశైలంలో వేసవి రాకముందే ఒక్కోరోజు 900 క్యూసెక్కుల వరకు నమోదు చేశారు. లెక్కల్లోని ఈ డొల్లతనాన్ని కృష్ణాబోర్డు బహిర్గతం చేసింది.


ఇక.. నియంత్రణ అనివార్యం

తెలుగు రాష్ర్టాలు రెండు కృష్ణాజలాల వినియోగంలో నియంత్రణ పాటించాల్సిన అనివార్యత నెలకొన్నదని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు హెచ్చరించింది. వేసవి మొదలుకావడంతో యాసంగి సాగునీటి అవసరాలతోపాటు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం రెండురాష్ర్టాల ఈఎన్సీలకు లేఖ రాశారు. శ్రీశైలం, సాగర్‌ జలాశయాల్లో ఎండీడీఎల్‌ ఎగువన ఉన్న నీటిని.. రెండు రాష్ర్టాల అవసరాలను లెక్కల్లోకి తీసుకుంటే 4-5 టీఎంసీల మేర తక్కువ పడే అవకాశమున్నది. మార్చి మొదట్లోనే ఈ పరిస్థితి ఉండగా.. మున్ముందు ఆవిరినష్టాలు పెరుగనున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగాన్ని నియంత్రించుకోవాలని.. తద్వారా ఎండీడీఎల్‌ దిగువకు వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాకుండా చూడాలని బోర్డు తెలిపింది. 


logo