తెలంగాణ రాక ముందు..
అంతా కానికాలం.. కరువుకాలం. ‘చేలల్లో నీళ్లు లేవు.. చెలకల్లో నీళ్లు లేవు.. నీళ్ల కోసం చూసే రైతు కండ్లల్లో నీళ్లు లేవు’.. అంటూ దుఃఖపడింది తెలంగాణ. బిందెడు నీటి కోసం బొక్కెనలేసి ఎదురుచూసిన పల్లెలు, గుక్కెడు జలం కోసం గుక్కపట్టి ఏడ్చిన గూడేలు, తండాలు. కరువు తరుముతుంటే మొగులు వైపు మొకం పెట్టి చినుకు కోసం కునుకు లేకుండా తపస్సు చేసిన రైతులు. తటాకాలు తాంబాలాలుగా మారిన చోట ఊర్లకు ఊర్లు వలసపోయినయ్. గొంతు తడిపేందుకు నీళ్లివ్వలేని పాలకులు..గొంతెత్తిన ప్రజలపై జలఫిరంగులు పేల్చారు.
తెలంగాణ రాష్ట్రంలో..
కేసీఆర్ వెంటే కాలం నడుస్తున్నది. కరువు పారిపోయింది. ఎక్కడా వర్షాభావ ఛాయల్లేవు. ఎప్పుడు చూసినా మొగులు నల్లమబ్బులతో నవ్వుతున్నది. సమైక్య పాలనలో కొందరు ముఖ్యమంత్రుల కాలంలో ఏండ్లకేండ్లు కరువుతో నెర్రెలువారిన నేల ఇప్పుడు తనివితీరా జలకాలాడుతున్నది. దేశవ్యాప్తంగా కరువొచ్చినా తెలంగాణ పచ్చగా నిగనిగలాడుతున్నది. రైతులపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమ మొగులై, నల్లమబ్బై, వాన చినుకై తెలంగాణ నేలతల్లిని తడిపేస్తున్నది.
జనపాలకుడే జలచాలకుడు. పాలకుడి ప్రయత్నానికి వరుణుడూ వరాలిస్తున్నాడు. అడవుల పరిరక్షణతోపాటు జలసంరక్షణకు తీసుకున్న చర్యలతో వానలు దండిగా కురుస్తున్నాయి. తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో ఏటా అధిక వర్షపాతమే నమోదైంది. 2022లో ఏకంగా సాధారణం కన్నా 46శాతం అధికంగా వాన కురిసింది. ఆకుపచ్చని తెలంగాణ సంకల్పంతో చేపట్టిన హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం రెట్టింపైంది. 2014లో 18శాతంగా ఉన్న గ్రీన్‌కవర్ ప్రస్తుతం 31.6 శాతానికి పెరిగింది. ఇది మారిన తెలంగాణ తలరాత. ఇది కేసీఆర్ సృజించిన జలరేఖ. అటు ప్రాజెక్టులతో మెట్టకు ఎక్కుతున్న ఆకాశగంగ.. ఇటు వాగులు చెరువుల్లో చరితార్థమవుతున్న ఉపరితల జలాలు.. మరోవైపు పైపైకి ఎగదన్నుకొస్తున్న భూగర్భజలాలు. పైన, కింద, పాతాళం.. మూడువైపులా నీళ్లు! ఇప్పుడు తెలంగాణే ఒక త్రివేణీ సంగమం!
Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): నాడు కరువుతో అల్లాడిన తెలంగాణలో సీఎం కేసీఆర్ ధర్మపాలన, కార్యదక్షతతో నేడు దండిగా వానలు కురుస్తున్నాయి. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో కరువన్న మాటే వినిపించడం లేదు. 8 ఏండ్లలో 6 ఏండ్లు అధిక వర్షపాతమే కురవగా..మిగిలిన రెండేండ్లు కూడా మంచి వానలే పడటంతో నాడు నెర్రెలు వారిన నేలలో నేడు పసిడి పంటలు పండుతున్నాయి. దేశవ్యాప్తంగా కరువొచ్చినా తెలంగాణ పచ్చగా నిగనిగలాడుతున్నది. తొమ్మి దేండ్ల రికార్డులను పరిశీలిస్తే.. ఏటా సాధారణం కన్నా అధిక వర్షాలే కురిశాయి. 2017లో మాత్రమే 13 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. 2020లో ఏకంగా సాధారణంకన్నా 45 శాతం అధికంగా వర్షాలు కురిశాయి.
రాష్ట్రంలో పచ్చదనం పెరిగింది కాబట్టే ప్రకృతి కూడా కనికరించిందనేది కాదనలేని వాస్తవం. ఇదే సమయంలో ఆయా సంవత్సరాల్లో అనేక రాష్ర్టాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతి సీజన్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. నైరుతి సీజన్ ఏటా జూన్ మొదటి వారం నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంటుంది. ఈ నాలుగు నెలల్లో సాధారణంగా 72.12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. ఇందులో జూలై 11 నాటికి 20.39 సెంటీమీటర్లు కురవాలని అంచనా. కానీ ఈ ఏడాది 39.57 సెంటీమీటర్ల వాన పడింది. ఇది సాధారణం కంటే 94 శాతం అధికం. దీంతో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. అంతేకాదు.. తెలంగాణ ప్రాంత చరిత్రలోనే అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో ఒక్కరోజే ఏకంగా 64.9 సెంటీమీటర్ల వాన పడింది. ఇదే సమయంలో దేశంలోని అనేక రాష్ర్టాల్లో సాధారణంకంటే తక్కువ వర్షాలు పడ్డాయి.
పాలకుడి ముందుచూపు.. పచ్చని పైరుల ఊపు
రాజు సమర్థుడైతే ప్రకృతి కూడా సహకరిస్తుంది. రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఉత్తమ పాలనలో రాజ్యం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తారు. రాజ్యంలో ధాన్యపు రాసులు, సిరిసంపదలు విలసిల్లుతాయి అని పెద్దలు చెప్తుంటారు. నిత్యం ప్రజల గురించే ఆలోచించడమే కాదు.. పాలనా విధానంలో, పథకాల రూపకల్పనలో, వాటి అమలులో శాస్త్రీయ విధానాలు అవలంబించే నాయకుడు ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది.
ప్రస్తుత తరంలో దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణ. ధర్మ పాలనకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు సీఎం కేసీఆర్. 2014కు ముందు కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణలో నేడు సాధారణం కన్నా అధిక వర్షాలు కురుస్తున్నాయి. నాడు ఆకలి కేకలు వినిపించిన తెలంగాణలో నేడు దేశంలోనే అత్యధిక ధాన్యం పండుతున్నది. తొమ్మిదిన్నరేండ్లుగా సీఎం కేసీఆర్ దార్శనికతతో చేపట్టిన పథకాలు, కార్యక్రమాల ఫలితం ఇది. ఆయన సమర్థ పాలనకు ప్రకృతి సైతం సహకరిస్తున్నది. తొమ్మిదేండ్లుగా సమృద్ధిగా వానలు కురుస్తున్నాయి. ఈ ఏడాది దేశంలోని దాదాపు సగంకన్నా ఎక్కువ రాష్ర్టాలు అనావృష్టితో అల్లాడుతుంటే, తెలంగాణలో మాత్రం సమృద్ధిగా వానలు పడటమే ఇందుకు నిదర్శనం.
‘హరిత’ తెలంగాణ
నదులు, కాలువలు వంటివి పెద్దగా లేకున్నా.. విస్తారమైన అటవీ సంపద తెలంగాణకు ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. అయితే ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యమో, క్షమించరాని మానవ తప్పిదాల వల్లనో, అవసరాలు, అనివార్యతల వల్లనో విచక్షణారహితంగా అడవులను నరికివేశారు. ఫలితంగా 2014లో స్వరాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్రంలో పచ్చదనం (గ్రీన్ కవర్) 18 శాతం మాత్రమే మిగిలింది. అంతకుముందు అడవులు, చెట్లవల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించి, ప్రజలను ప్రోత్సహించిన నాయకుడే లేడు. కానీ సీఎం కేసీఆర్ ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో హరిత విప్లవానికి నాంది పడింది. పచ్చదనాన్ని పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం, కాలుష్యాన్ని నివారించడం, జనారణ్యంలోకి వస్తున్న కోతులవంటి జంతువులను తిరిగి అడవుల్లోకి పంపడం దీని ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించుకున్నారు. 2015లో మొదలైన హరితహారం కార్యక్రమం కింద ఏటా కోట్ల సంఖ్యలో మొకలు నాటేలా చర్యలు తీసుకున్నారు.
ప్రతి గ్రామం, పట్టణం, ప్రతి రోడ్డు..ఎకడ అనువైన స్థలం ఉంటే అకడ మొకలు నాటి సంరక్షించేలా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 9 విడతల్లో 283 కోట్ల మొకలను నాటారు. మొక్కలకు నీళ్లు పోసేందుకు కూలీలు, నీళ్లు తీసుకెళ్లేందుకు ట్యాంకర్లు, మొక్క నరికితే శిక్షలు పడేలా చట్టాలు.. ఇలా మొక్కలు సురక్షితంగా ఎదిగేలా అన్ని రకాల కఠిన చర్యలు తీసుకున్నారు. ఫలితంగా తెలంగాణలో గ్రీన్ కవర్ 18 శాతం నుంచి 31.6 శాతానికి పెరిగిందని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. పచ్చదనం పెంపులో హైదరాబాద్ నగరానికి గ్రీన్‌సిటీ అవార్డు దకింది. లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ అవార్డునూ హైదరాబాద్ దకించుకున్నది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును ప్రధానం చేశారు. భారతదేశం నుంచి ఈ పురసారం అందుకొన్న ఒకే ఒక సిటీ హైదరాబాద్ కావడం విశేషం. హైదరాబాద్ నగరంలో పచ్చదనం 33.15 చదరపు కిలోమీటర్ల నుంచి 81.81 చదరపు కిలోమీటర్లకు (246 శాతం) పెరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘ఎక్కడైతే రోడ్డుకు రెండువైపులా పచ్చగా ఏపుగా పెరిగిన చెట్లు ప్రారంభమవుతాయో.. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం మొదలైనట్టు’ అని అంతర్రాష్ట్ర ప్రయాణికులు చెప్పుకునే స్థాయికి తెలంగాణ ఎదిగింది. అంతేకాదు.. ఇతర రాష్ర్టాలతో పోల్చితే ఉష్ణోగ్రతలు సైతం కాస్త తక్కువగా నమోదవుతున్నాయి.
జీవ వైవిధ్యానికి నిలయంగా తెలంగాణ
ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం జీవ వైవిధ్యానికి నిలయం. వేలాది వృక్ష, జంతు జాతులతో.. పర్యావరణ సమతుల్యతతో తులతూగిన నేల. ఉమ్మడి రాష్ట్రంలో అడవుల నరికివేత, జలవనరుల విధ్వంసం ఫలితంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. జీవజాతుల మనుగడకు ముప్పు వాటిల్లింది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యలతో పర్యావరణం మళ్లీ కుదుటపడింది. హరితహారంతో పెరిగిన చెట్లు, సామాజిక అడవుల పెంపకం, అటవీ విస్తీర్ణం పెరుగుదలకు తీసుకున్న చర్యలు, కాళేశ్వరం పథకంతో వందలాది కిలోమీటర్ల మేర సజీవనదిగా మారిన గోదావరి, నిండుకుండల్లా మారిన రిజర్వాయర్లు, 365 రోజులు నిండుగా పారుతున్న కాలువలు.. ఇవన్నీ వృక్ష, పక్షి, జంతుజాలాలకు ఆలవాలంగా మారాయి. ఒకప్పుడు ఎడారులుగా దర్శనమిచ్చిన నేలల్లో ఇప్పుడు పచ్చిక బయళ్లు పరుచుకొని, అందులో జింకలు చెంగుచెంగున దుంకుతున్నాయి. పులల వంటి అరుదైన జీవాల సంఖ్య పెరిగింది. మొత్తంగా తెలంగాణలో ప్రకృతి వైవిధ్యం విలసిల్లుతున్నది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు రాష్ట్రంలోని 2,939 వృక్షజాతులు, 365 పక్షి జాతులు, 103 క్షీరద జాతులు, 28 పాకుడు జీవ జాతులు, 21 ఉభయచర జాతులు, అనేకరకాల అకశేరుకాలకు అభయం ఇచ్చాయి.
P