సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 01:53:15

కేబుల్‌ బ్రిడ్జిపై సంగీతోత్సవం

కేబుల్‌ బ్రిడ్జిపై సంగీతోత్సవం

కొండాపూర్‌: దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం జనసంద్రంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఇండియన్‌ ఆర్మీ సింఫనీ బ్యాండ్‌, అవినీతి నిరోధక శాఖ బృందాల సంగీత కచేరీని తిలకించేందుకు జనం వేలాదిగా తరలివచ్చారు. అద్భుతమైన దేశభక్తి గీతాలు, అలనాటి మధురస్మృతులను గుర్తుచేస్తూ ఆలపించిన తీరు సందర్శకులను ఆకట్టుకున్నాయి. సరిహద్దుల్లో ప్రాణత్యాగంచేసిన వీరులను, కరోనా సమయంలో ముందు వరుసలో ఉన్న వారియర్స్‌కు సంఘీభావం తెలిపే సంగీత కచేరీకి జనం ముగ్ధులయ్యారు. రంగురంగుల విద్యుత్‌ దీపకాంతుల మధ్య వంతెన అందాలను తిలకిస్తూ సెల్ఫీలు దిగుతూ సంతోషంగా గడిపారు. ఇండియన్‌ ఆర్మీ సింఫనీ బ్యాండ్‌ 40 మంది సభ్యులతో సంగీత కచేరీని గంటసేపు కొనసాగించారు. అనంతరం అనిశా బృందం సభ్యులు మరో గంటపాటు సందర్శకులను అలరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ, ఏపీలో మేజర్‌ జనరల్‌ ఆర్కే సింగ్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరం తనకు ఎంతగానో నచ్చిందన్నారు. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఈ కేబుల్‌ బ్రిడ్జి నగరానికి సరికొత్త ఐకాన్‌గా నిలుస్తుందని చెప్పారు. 


logo