శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 24, 2020 , 15:43:14

కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్లే .. ప్రతి ఎకరం సాగులోకి

 కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్లే .. ప్రతి ఎకరం సాగులోకి

సిద్దిపేట : సమృద్ధిగా వర్షాలు కురవడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్లే జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరా సాగులోకి వచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జిల్లాలోని గుర్రాలగొందిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. పేద ప్రజలు ఆత్మ గౌరవంతో జీవించాలనే డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని తెలిపారు. అర్హులకు మాత్రమే డబుల్ బెడ్ రూం ఇండ్లు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు.

రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపడుతామని పేర్కొన్నారు. చెరువులు నిండినా ఒక్కటి కూడా తెగలేదంటే అది మిషన్ కాకతీయ ఘనతే అన్నారు. జిల్లాలో మొత్తం 3,484 చెరువులను గానూ ఇప్పటి వరకూ 3 వేల పైగా చెరువులు నిండు కుండలను తలపిస్తూ మత్తడి దుంకుతున్నాయని మంత్రి తెలిపారు. దశాబ్దాల తర్వాత చెరువులన్నీ నిండడంతో అధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తూ రైతులు, మత్స్య కారులు అనందంగా ఉన్నారని తెలిపారు.


 సోమవారం నారాయణపేట మండలం గుర్రాల గొంది గ్రామంలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకు స్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. గుర్రాల గొంది గ్రామం ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ గా అవార్డ్ దక్కించుకున్నదని, ఇది గ్రామస్తుల ఘనతే అన్నారు. భవిష్యత్ లో కూడ ఇదే స్ఫూర్తితో పనిచేసి మరిన్ని అవార్డులు చేజిక్కించు కోవాలన్నారు.

ప్లాస్టిక్ ను సమూలంగా నిర్మూ లించేందుకు గుర్రాల గొంది గ్రామంలో స్టీల్ బ్యాంక్ ను ఏర్పాటు చేశామన్నారు. పల్లెల స్వచ్ఛత అంశంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో చైర్మన్ స్థానిక ఎంపీపీ జెడ్పీటీసీ, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.logo