మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 03:35:20

దుబ్బాక ఉప ఎన్నిక నవంబర్‌ 3న

దుబ్బాక ఉప ఎన్నిక నవంబర్‌ 3న

  • అక్టోబర్‌ 9 నుంచి నామినేషన్లు
  • నవంబర్‌ 10న ఓట్ల లెక్కింపు
  • సీఈసీ షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌, సిద్దిపేట, నమస్తే తెలంగాణ: సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు తేదీ ఖరారైంది. నవంబర్‌ 3న ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికలసంఘం ప్రకటించింది. దేశంలోని వివిధ అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదలచేసింది. అక్టోబర్‌ 9 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు తెలిపింది. 17న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 19న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అదేరోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నట్టు వెల్లడించింది. నవంబర్‌ 10న ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు 6న అకాల మరణం చెందడంతో దుబ్బాక సీటు ఖాళీ అయింది. దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్‌, రాయపోల్‌, చేగుంట, నార్సింగ్‌ మండలాలు ఉన్నాయి. ఇందులో సిద్దిపేట జిల్లాలో దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్‌, రాయపోల్‌ మండలాలు ఉండగా, చేగుంట, నార్సింగ్‌ మండలాలు మెదక్‌ జిల్లాలోకి వస్తాయి. గత ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో1,97,909 మంది ఓటర్లు ఉన్నారు. 


logo