శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 02:49:05

దుబ్బాకలో బీజేపీ డబ్బు.. గబ్బు

దుబ్బాకలో బీజేపీ డబ్బు.. గబ్బు

 • సిద్దిపేటలో బయటపడిన కమలనాథుల నోట్ల కట్టలు
 • బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువు ఇంట్లో 18.67 లక్షలు స్వాధీనం 
 • దుబ్బాకలో పంచేందుకేనని ఒప్పుకొన్న అంజన్‌రావు  
 • పోలీసులు, రెవెన్యూ సిబ్బందిపై బీజేపీ శ్రేణుల దౌర్జన్యం
 • సీజ్‌చేసిన డబ్బులో నుంచి 12.87 లక్షలు ఎత్తుకెళ్లిన కార్యకర్తలు
 • ఫేక్‌ వీడియోలతో పోలీసులపై తప్పుడు ప్రచారం .. నానా రభస
 • రఘునందన్‌రావు యాక్షన్‌.. బీజేపీ కార్యకర్తల ఓవరాక్షన్‌ 
 • దొంగలే దొంగా.. దొంగా అని అరుస్తున్నరు: మంత్రి హరీశ్‌రావు
 • పక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్‌ చేశాం: సీపీ జోయల్‌ డెవిస్‌ 

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నట్టు బీజేపీ మరో నాటకానికి తెరతీసింది. చేసిన దొంగపని పట్టపగలు మేజిస్ట్రేట్‌ సాక్షిగా పట్టుబడగా.. గుట్టు రట్టయి..  ఆట కట్‌ అయిపోగా.. వీధి నాటకంతో వీరంగం వేసింది. కిందపడ్డా తనదే పైచేయి అంటూ అరాచకం సృష్టించింది. విలువలకు తానే నిలువుటద్దమంటూ పోజులు కొట్టే పేరుగొప్ప జాతీయ పార్టీ, ఆఫ్ట్రాల్‌ ఒక ఉప ఎన్నికలో డిపాజిట్‌ కాపాడుకునేందుకు, కాదూ కూడదంటే రెండో స్థానం దక్కించుకొనేందుకు,  ఎన్ని డ్రామాలు వేయాలో అన్నీ వేస్తున్నది.

దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువు అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షల నగదును సిద్దిపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రఘునందన్‌కు వరుసకు బామ్మర్ది అయ్యే వ్యక్తి, ఎన్నికల్లో పంచేందుకు, ఆ డబ్బును తన ఇంట్లో పెట్టినట్టు అంజన్‌ వాంగ్మూ లం ఇవ్వగా, ఆ తర్వాత రఘునందన్‌ వచ్చి, నానా యాగీ చేశారు. దొంగే పోలీసును దొంగ అన్నట్టు... కార్యకర్తలతో పోలీసులపై దాడికి దిగారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు, లాఠీచార్జీకి దారితీసింది. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడి కూడా లాపాయింట్లు మాట్లాడిన రఘునందన్‌, ఆ పాచిక పారదని తెలిసి.. తర్వాత సానుభూతి నాటకానికి తెర తీశారు. 

గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టు చేసిన రఘునందన్‌కు రాష్ట్ర బీజేపీ నేతలు వంత పాడడం సిగ్గుచేటైతే.. కేంద్ర హోంమంత్రి హోదాలో ఉన్న అమిత్‌షా.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫోన్‌ చేసి ఏం జరిగిందని ఆరా తీయడం మరో వింత! ఇలాంటి పార్టీతో తమకేం లాభమో  ప్రజలే ఆలోచించుకోవాలి!            

హైదరాబాద్‌/సిద్దిపేట, నమస్తే తెలంగాణ: దుబ్బాక ఎన్నికల్లో ప్రజలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ చేస్తున్న మరో కుట్ర బయటపడింది. ఓటర్లకు పంచడానికి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు దగ్గరి బంధువు ఇంట్లో దాచిన రూ.18.67 లక్షలను పోలీస్‌, రెవెన్యూ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ప్రతిసారి అడ్డంగా దొరికిపోతుండటం.. ప్రజల ముందు పరువు పోతుండటాన్ని తట్టుకోలేని ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు, ఇతర నేతలు, కార్యకర్తలు ఏకంగా అధికారులపైనే దౌర్జన్యానికి దిగారు. సీజ్‌ చేసిన డబ్బును బయటకు తెస్తుంటే.. దాడిచేసి ఎత్తుకెళ్లారు. పైగా అధికారులే ఆ డబ్బును తీసుకొచ్చారంటూ ఫేక్‌ వీడియోలతో తప్పుడు ప్రచారానికి దిగారు. దీనికి V6 చానల్‌ వంతపాడుతూ డ్రామాను రక్తి కట్టించింది. ఈ పరిణామాలపై ఆర్థికమంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. బీజేపీ నేతలు ఫ్రస్ట్రేషన్‌తో ఉన్నారని, పోలీసులకు సహకరించకుండా గూండాల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలే వారికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. మరోవైపు సోదాల్లో దొరికిన రూ.18.67 లక్షలను రఘునందన్‌రావు సమీప బంధువు జితేందర్‌రావు పంపినట్టు నిందితుడు అంజన్‌రావు ఒప్పుకొన్నారని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ పేర్కొన్నారు. ఈ డబ్బును కొద్దికొద్దిగా దుబ్బాకకు చేర్చేలా వారు ప్రణాళిక రచించినట్టు చెప్పారు. 

బీజేపోళ్ల గూండాగిరీ

దుబ్బాక నియోజకవర్గ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు తీసుకొచ్చారన్న పక్కా సమాచారం మేరకు సోమవారం సిద్దిపేట రెవెన్యూ, పోలీస్‌ అధికారులు పట్టణంలోని మూడు ఇండ్లల్లో సోదాలు నిర్వహించారు. లెక్చరర్స్‌ కాలనీలో ఉండే దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మామ సురభి రామ్‌గోపాల్‌రావు, సమీప బంధువు సురభి అంజన్‌రావు ఇండ్లల్లో మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల మధ్య తనిఖీలు మొదలుపెట్టారు. అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షలు దొరికాయి. దుబ్బాక ఎన్నికల్లో పంచేందుకు జితేందర్‌రావు అనే వ్యక్తి తన డ్రైవర్‌ద్వారా ఈ డబ్బును పంపారని అంజన్‌రావు ఒప్పుకొన్నారు. దీంతో అధికారులు ఆ డబ్బును సీజ్‌ చేశారు. వన్‌టౌన్‌ సీఐ సైదులు, సిద్దిపేట అర్బన్‌ తాసిల్దార్‌ విజయ్‌ సాగర్‌ ఆధ్వర్యంలో పంచనామా జరిగింది. నిజం బయటికొస్తే ఓటర్లు ఛీ కొడుతారని గుర్తించిన రఘునందన్‌రావు, బీజేపీ నేతలు వెంటనే భారీ హైడ్రామాకు తెరలేపారు. సిద్దిపేటతోపాటు ఇతర మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలకు ఫోన్లుచేసి మరీ అంజన్‌రావు ఇంటివద్దకు రప్పించుకున్నారు. 250 మంది వరకు గుమిగూడారు. అధికారులు సమన్వయంతో, ఓపికగా ఉన్నా.. వారిని రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు గేటు పైకెక్కారు. ఓ దశలో అధికారులను తోసేస్తూ గూండాగిరీ చేశారు. మధ్యాహ్నం 4.30 గంటల సమయంలో సీజ్‌ చేసిన డబ్బు సంచిని అధికారులు బయటకు తీసుకొస్తుండగా.. సుమారు 30 మంది బీజేపీ కార్యకర్తలు దూసుకొచ్చి దానిని లాక్కొన్నారు. ఆ సంచిలో నుంచి డబ్బును గుంజుకొని.. వాటిని చూపుతూ పారిపోయారు. సీజ్‌చేసిన రూ.18.67 లక్షల్లో బీజేపీ కార్యకర్తలు రూ.12.87 లక్షలు ఎత్తుకెళ్లగా.. పోలీసుల వద్ద ఉన్న సంచిలో రూ.5.80 మాత్రమే మిగిలాయి. పైగా పోలీసులే డబ్బు తీసుకొచ్చి అంజన్‌రావు ఇంట్లో పెడుతున్నారంటూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి.. ‘ఉల్టా చోర్‌.. కొత్వాల్‌ కో డాంటే’ అన్నట్టుగా వ్యవహరించారు. అయితే అందులో పోలీస్‌ అధికారి డబ్బు సంచితో అంజన్‌రావు ఇంటిలోపలి నుంచి బయటకు వస్తుండటం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ వాస్తవానికి మసిబూసి బీజేపీ ఎదురుదాడికి దిగింది. రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినా బీజేపీ మాత్రం నిస్సిగ్గుగా ఉల్టా దబాయింపు మొదలుపెట్టింది. 

అభ్యంతరాలుంటే లీగల్‌గా వెళ్లండి : సీపీ జోయల్‌ 

తన బంధువుల ఇంట్లో డబ్బులు దొరికాయన్న సమాచారం తెలుసుకున్న రఘునందన్‌రావు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి మధ్యాహ్నం 3:20 గంటలకు హుటాహుటిన సిద్దిపేటకు చేరుకున్నారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగంతో వాగ్వాదానికి దిగారు. ‘అనుమతి లేకుండా మా ఇండ్లల్లో ఎలా తనిఖీ చేస్తారు’ అంటూ నానా రభస చేశారు. ఒకవైపు అనుచరులను పిలిపించుకుంటూ మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి విషమించడంతో అక్కడకు చేరుకున్న సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌.. ఒక మేజిస్ట్రేట్‌ (తాసిల్దార్‌) సమక్షంలో సీజ్‌చేసిన డబ్బును ఎలా లాక్కెళ్తారంటూ ప్రశ్నించారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించడం కరెక్ట్‌ కాదని.. అభ్యంతరాలుంటే లీగల్‌గా వెళ్లాలని రఘునందన్‌రావుకు సూచించారు. కాగా, రఘునందన్‌కు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర కీలక నేతలు సిద్దిపేటకు వచ్చి గొడవ సృష్టించారు. 

పార్టీలకతీతంగా సోదాలు 

దుబ్బాక ఉప ఎన్నికను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు పార్టీలకతీతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోమవారం టీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు ఇంట్లోనూ సోదాలు చేశారు. సోమవారం రాత్రి మంత్రి హరీశ్‌రావు వాహనాన్ని భూంపల్లి చౌరస్తా వద్ద ఆపి తనిఖీలు చేశారు. ఇప్పటివరకు హరీశ్‌ వాహనాన్ని మూడుసార్లు తనిఖీ చేశారు. మద్యం నిల్వ చేశారన్న అనుమానం మేరకు చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ నేత నారాయణరెడ్డి ఇంట్లో తనిఖీలు చేశారు. కానీ, ఎలాంటి బాటిళ్లు దొరుకలేదు. ఇప్పటివరకు దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత వాహనాన్ని మూడుసార్లు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వాహనాలను కూడా రెండుమూడుసార్లు తనిఖీలు చేశారు. అనుమానం ఉన్న ప్రతి ఇంటిలో అధికారులు సోదాలు చేస్తుంటే.. బీజేపీ నేతలు మాత్రం తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. 

అనుమానాలు.. 

1) డబ్బు నాది కాదని రఘునందన్‌ ఎందుకు అనలేదు? 

బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు సిద్దిపేటకు వచ్చీ రావడంతోనే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘పర్మిషన్‌ లేకుండా ఇంట్లోకి ఎలా వెళ్తారు?’ అంటూ ప్రశ్నించారు. అంతేగానీ.. తనకు ఆ డబ్బుతో ఎలాంటి సంబంధం లేదని మాత్రం చెప్పలేదు. దీనిపై ప్రజల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా పోలీస్‌ కమిషనర్‌, మేజిస్ట్రేట్‌ (తాసిల్దార్‌) స్వయంగా వెళ్లినా.. సెర్చ్‌ వారంట్‌ లేకుండా ఎలా వచ్చారంటూ అర్థంలేని వాదనకు దిగారు. 

2) పోలీసులపై దౌర్జన్యం ముందస్తు ప్రణాళిక? 

దుబ్బాకలో పంచేందుకు ఏమార్గంలో డబ్బు, చీరలు, డ్రెస్సులు వంటివి తీసుకొస్తున్నా పోలీసులు పసిగట్టి స్వాధీనం చేసుకుంటుండటంతో బీజేపీకి నిద్రపట్టడం లేదు. అందుకే ఈసారి డబ్బు స్వాధీనం చేసుకునే సమయంలో హడావుడి చేసి తప్పును కప్పిపుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఏ క్షణానైనా రావడానికి ఇతర మండలాల కార్యకర్తలను కూడా సిద్ధం చేసుకున్నారని చెప్తున్నారు. 

3) ఆధారాలను మాయం చేసేందుకే హైడ్రామా? 

బీజేపీ తప్పు చేసి అడ్డంగా దొరికిపోయింది. సోదాలు, పంచనామా పక్కాగా నిబంధనల ప్రకారం జరిగాయి. ఆ ఆధారాలను మాయం చేయడానికే నోట్ల కట్టలను ఎత్తుకెళ్లారని పలువురు భావిస్తున్నారు. 

4) ఇంకా ఎంత డబ్బును తరలిస్తున్నారో? 

రూ.18.67 లక్షలను సిద్దిపేట నుంచి కొంత కొంత దుబ్బాకకు చేర్చాలనేది వారిప్లాన్‌ అని పోలీసులు చెప్తున్నారు. దీనిని బట్టి ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు బీజేపీ ఎంత డబ్బును దుబ్బాకకు చేర్చిందో.. ఎంత పంచారో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కావాల్సినంత డబ్బు నియోజకవర్గంలోని బీజేపీ నాయకుల ఇండ్లకు చేర్చినట్టు సమాచారం.

ఇంకా 8 డ్రామాలు? 

దుబ్బాకలో చిత్తుగా ఓడిపోతామని తెలిసిన బీజేపీ నేతలు రఘునందన్‌రావు డైరెక్షన్‌లో రోజుకో డ్రామా చేసి సానుభూతి పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. సోమవారం ఒక ఎపిసోడ్‌ పూర్తయిందని.. నవంబర్‌ 3వ తేదీ వరకు ఇంకో ఎనిమిది డ్రామాలు ఉండే అవకాశం ఉన్నదని సోషల్‌ మీడియాలో చర్చ సాగుతున్నది. సంచలనాలతో సానుభూతి మాట పెరుగడం పక్కనబెడితే మొదటికే మోసం వస్తున్నదని బీజేపీ సీనియర్‌ నేతలు మొత్తుకుంటున్నారు.  

బండి సంజయ్‌ వింత వాదన 

ఎన్నికల వేళ సోదాలు జరుపడం చట్టవిరుద్ధమని బండి సంజయ్‌ వ్యాఖ్యానించడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల వేళ ప్రజలను ప్రలోభాలకు గురిచేయకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. ఇందులోభాగంగానే వాహనాల తనిఖీలు, అనుమానాస్పద ఇండ్లల్లో సోదాలు చేస్తుంటారు. ఇది ప్రతి ఎన్నికల్లో, దేశవ్యాప్తంగా జరిగేదే. జాతీయపార్టీకి చెందిన నేత, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైన బండి సంజయ్‌ ఈ విషయాన్ని మరిచిపోవడం విడ్డూరమని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.

అవినీతికి వంతపాడుతున్న ఛీ6 

అడ్డంగా దొరికిపోయిన బీజేపీ నేతలు.. తిరిగి దొంగా.. దొంగా.. అని అరుస్తుంటే ‘వీ 6’ న్యూస్‌చానల్‌ దానికి వంతపాడుతున్నదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆ చానల్‌ అధిపతి వివేక్‌.. బీజేపీ నేత కావడంతో ఆ పార్టీకి వంతపాడుతూ కనీస విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నదని పలువురు ఛీకొడుతున్నారు.  దుబ్బాక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వస్తున్న ఆదరణను చూసి వీ6 చానల్‌ మొదట్నుంచీ విషప్రచారమే చేస్తున్నదని, అదే సమయంలో ఏమాత్రం ఆదరణలేని బీజేపీని భూతద్దంలో చూపిస్తూ ఏనుగులా ప్రచారంచేస్తూ బొక్కబోర్లా పడుతున్నదని ఎద్దేవా చేస్తున్నారు. సిద్దిపేట ఘటనలోనూ ఏదో జరిగిపోతున్నట్టు హడావుడి చేసిందని అన్నారు. సీజ్‌ చేసిన డబ్బును బీజేపీ కార్యకర్తల నుంచి కాపాడేందుకు పోలీస్‌ అధికారి చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వీడియోను చూపిస్తూ పోలీసులే డబ్బు తెచ్చారంటూ తప్పుడు ప్రచారం చేసిందని, అధికారులు మూడుచోట్లే తనిఖీలు చేస్తే.. 8 చోట్ల చేశారంటూ అసత్య ప్రచారానికి ఒడికట్టిందని పేర్కొంటున్నారు. 

తప్పుడు ప్రచారాలు.. అనుమానాలు.. నిజాలు ప్రచారం: అధికారులు దౌర్జన్యంగా ఇంట్లో సోదాలు నిర్వహించారు. 

వాస్తవం: అధికారులు మధ్యాహ్నం 3 గంటల సమయంలో రామ్‌గోపాల్‌రావు, అంజన్‌రావు ఇండ్లల్లో సోదాలు నిర్వహించారు. అంజన్‌రావు ఇంట్లో డబ్బు దొరికింది. అధికారులు పంచనామా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి. అందులో అంజన్‌రావుసహా అధికారులంతా ఇంట్లోనే ఉన్నారు. ఆ సమయంలో ఇంటి ఆవరణలో ఎలాంటి హడావుడి లేదు. అంజన్‌రావు సహా అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నారు.

ప్రచారం: పోలీసులే డబ్బు తీసుకొచ్చి పెట్టారు. 

వాస్తవం: మధ్యాహ్నం 3 గంటల సమయంలో డబ్బు సీజ్‌ చేసినప్పుడు తీసిన ఫొటోల్లో.. టేబుల్‌పై డబ్బు కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు బీజేపీ కార్యకర్తల దౌర్జన్యం మొదలైంది. అప్పటికే సీజ్‌ చేసిన డబ్బును బయటకు తెస్తుండగా వీడియో తీసి పోలీసులే డబ్బు తెచ్చారంటూ బీజేపీ సోషల్‌ మీడియాలో, వీ6 చానల్‌లో ప్రచారం చేశారు. ఇందులో బీజేపీ కార్యకర్తల అరాచకం, వారు పోలీసులపై దాడి చేయడం స్పష్టంగా కనిపిస్తున్నది. 3 గంటలకు డబ్బు సీజ్‌ చేస్తే.. 3:30 గంటలకు డబ్బు ఎలా తీసుకొస్తారు? 

పాయింట్‌ బ్లాంక్‌

 • మేజిస్ట్రేట్‌ సాక్షిగా పోలీసులు సోదాలు జరిపితే రఘునందన్‌కు వచ్చిన ఇబ్బంది ఏమిటి? పోలీసులకు సోదాలు చేసే అధికారం ఉందా? లేదా?
 • రఘునందన్‌కు బావమరిది వరుసయ్యే వ్యక్తే  తన ఇంటికి ఆ డబ్బు పంపినట్టు అంజన్‌రావు వాంగ్మూ లం ఇచ్చిన మాట నిజం కాదా? 
 • ఒకే కులం, పొరుగిల్లు అయినంత మాత్రాన, పట్టుబడ్డ డబ్బు తనదంటే ఎలా అంటున్న రఘునందన్‌ మరి కార్యకర్తల్ని రప్పించి నానా     యాగీ ఎందుకు చేసినట్టు? 
 • 2.30-3.00 గంటల మధ్య సోదాలు మొదలయ్యాయి. పోలీసులు డబ్బు పెట్టాలనుకుంటే అప్పుడే2:17 AM 10/27/20202:17 AM 10/27/20202:17 AM 10/27/2020 ఇంట్లో పెట్టేవారు. గంట తర్వాత, బీజేపీ కార్యకర్తలు భారీగా వచ్చాక, అందరూ చూస్తుండగా పెడతారా? 
 • చేసే రగడంతా చేశాక.. పోలీసులను, చట్టాలను గౌరవిస్తానంటూ సుద్దపూసలా మాట్లాడిన   రఘునందన్‌కు ఆ సంగతి ముందెందుకు గుర్తుకురాలేదు?
 • ఎన్నికల వేళ తనిఖీలు సర్వసాధారణం. ఇదే రోజు మంత్రి హరీశ్‌రావు వాహనాన్ని పోలీసులు తనిఖీచేశారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు రాజనర్సు ఇంటిలోనూ సోదాలు నిర్వహించారు. ఇదేదో అరుదైన సంగతన్నట్టు ఎన్నికల సమయంలో సోదాలు జరుపడం చట్ట విరుద్ధమని అంటున్న రఘునందన్‌రావుకు అసలు చట్టం తెలుసా?