సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 03:13:11

నేడు దుబ్బాక ఫలితం

నేడు దుబ్బాక ఫలితం

  • 14 టేబుళ్లు.. 23 రౌండ్లు
  • సిద్దిపేట ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు
  • ఉదయం 8 గంటలకు ప్రారంభం
  • 12 గంటల కల్లా తుది ఫలితం

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు మంగళవారం జరుగనున్నది. సిద్దిపేట అర్బన్‌ మండలంలోని పొన్నాల ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉద యం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలలోగా తుది ఫలితం వెలువడుతుందని భావిస్తున్నారు. మొదటగా పోస్టల్‌ బ్యాలె ట్‌ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌, కాం గ్రెస్‌, బీజేపీ సహా 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈనెల 3న జరిగిన పోలింగ్‌లో 1,64,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 పోలింగ్‌ శాతం నమోదైంది. ఓట్ల లెక్కింపు ప్రకియలో 350 మంది వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పాల్గొననున్నారు. 357 మంది పోలీస్‌ సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎన్నికల పరిశీలకుడు శ్యామ్లా ఇక్బాల్‌, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతీహోళికేరి, పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌, అడిషనల్‌ కలెక్టర్‌ పద్మాకర్‌, దుబ్బాక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చెన్నయ్య ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సోమవారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఒక్కో రౌండుకు 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. మొత్తం 23 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ప్రతి టేబుల్‌ను ఒక మైక్రో అబ్జర్వర్స్‌తోపాటు మిగతా అధికారులు పర్యవేక్షించనున్నారు. టేబుళ్ల వద్ద జరిగే లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షణను ఏఆర్వోలకు అప్పగించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపును తాసిల్దార్‌, ఎంపీడీవో స్థాయి అధికారి పర్యవేక్షించనున్నారు. 

భారీ బందోబస్తు 

సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. ఆరుగురు ఏసీపీలు, సీఐలు 18, ఎస్‌ఐలు 38, ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు 16, మహిళా కానిస్టేబుళ్లు, మహిళా హోంగార్డులు 50, కానిస్టేబుళ్లు, హోంగార్డులు 229 మొత్తం 357 మంది భద్రతను పర్యవేక్షించనున్నారు. సిద్దిపేట పట్టణంలో కౌంటింగ్‌ సెంటర్‌ పరిసర ప్రాంతాల్లో పికెట్స్‌, టియర్‌ గ్యాస్‌ 02 బృందాలు, కౌంటింగ్‌ కేంద్రం, పరిసర ప్రాంతాల్లో రూఫ్‌ టాప్‌ అబ్జర్వేషన్‌ టీమ్స్‌తో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటుచేసినట్టు జోయల్‌ డేవిస్‌ తెలిపారు.