మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 08:05:44

ప్రారంభమైన దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌

ప్రారంభమైన దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌

సిద్దిపేట : ఉత్కంఠగా ఎదురుచూస్తున్న దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. పొన్నాల ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. 8 గంటలకు తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలలోగా తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ సహా 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 3న జరిగిన పోలింగ్‌లో 315 పోలింగ్‌ బూతుల్లో 1,64,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 పోలింగ్‌ శాతం నమోదైంది. ఒక్కో రౌండుకు 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. మొత్తం 23 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. 

ప్రతి టేబుల్‌ను ఓ మైక్రో అబ్జర్వర్స్‌తోపాటు మిగతా అధికారులు పర్యవేక్షించనున్నారు. టేబుళ్ల వద్ద జరిగే లెక్కింపు పర్యవేక్షణ బాధ్యతలను ఏఆర్వోలకు అప్పగించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపును తాసిల్దార్‌, ఎంపీడీఓ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ ఆధ్వర్యంలో  కౌంటింగ్‌ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. 357 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నారు. సిద్దిపేట పట్టణంలో కౌంటింగ్‌ సెంటర్‌ పరిసర ప్రాంతాల్లో పికెట్స్‌, టియర్‌ గ్యాస్‌ బృందాలు, కౌంటింగ్‌ కేంద్రం, పరిసర ప్రాంతాల్లో రూఫ్‌ టాప్‌ అబ్జర్వేషన్‌ బృందాలతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. 

కొనసాగుతున్న దుబ్బాక ఎన్నికల కౌంటింగ్‌..

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఐదు రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయ్యింది. తొలిరౌండ్‌ నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందర్‌ రావు స్వల్ప మెజారిటీలో కొనసాగుతున్నారు. మొత్తం 23 రౌండ్లు ఉండగా ఇప్పటివరకు ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. ఐదో రౌండ్ వరకు బీజేపీ అభ్యర్థి 16,517 ఓట్లు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 13,497 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి 2,724 ఓట్లు సాధించారు. ఇంకా 18 రౌండ్ల లెక్కింపు జరగాల్సి ఉండగా.. విజయం ఎవరినైనా వరించే అవకాశముంది. మధ్యాహ్నం 2 గంటల వరకు తుది ఫలితం రావచ్చు. ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్ నుంచి సోలిపేట సుజాత‌, కాంగ్రెస్ పార్టీ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి‌, బీజేపీ నుంచి రఘునందర్‌రావుతోపాటు చిన్నాచితక పార్టీల నుంచి  23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 

p>లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.